ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త... మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కొలువుల కోలాహలం మొదలైంది. ఇటీవల ఎస్సై ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీ పోలీసు నియామక మండలి సోమవారం సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుళ్లు, జైలు వార్డర్లు, ఫైర్‌మెన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 2,723 పోస్టులను భర్తీ చేయనుంది. మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్.పి.ఠాకూర్, పోలీసు నియామక మండలి ఛైర్మన్ కుమార్ విశ్వజిత్‌లు సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసి అందులోని ముఖ్యాంశాలను వెల్లడించారు.
దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌లో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. గణితం, రీజనింగ్, జనరల్ స్టడీస్‌వంటి అంశాలతో ప్రశ్నపత్రం ఉంటుంది. మూడు గంటల వ్యవధిలో రాయాలి. ఓసీ అభ్యర్థులు 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ విశ్రాంత సైనికోద్యోగులు 30 శాతం మార్కులు పొందితే తదుపరి దశకు అర్హులవుతారు. ప్రాథమిక రాత పరీక్షలో ఎంపికైన వారికి మాత్రమే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక రాత పరీక్ష అర్హత పరీక్ష మాత్రమే. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. కాకినాడ జేఎన్‌టీయూకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. మార్చినాటికి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నారు.
విద్యార్హతలు.. * సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుల్, ఫైర్‌మెన్‌లకు: ఇంటర్మీడియట్‌లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి... * ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివి పరీక్షలు రాసుంటే సరిపోతుంది... * జైలు వార్డర్లు: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవాలి... ముఖ్యమైన తేదీలు: * దరఖాస్తుల స్వీకరణ: 12.11.2018 (సోమవారం) మధ్యాహ్నం మూడింటినుంచి ప్రారంభమైంది... * దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు: 2018 డిసెంబరు 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ.. * ప్రాథమిక రాత పరీక్ష: 2019 జనవరి 6 ఆదివారం ఉదయం పదింటినుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ... * శారీరక దారుఢ్య పరీక్షలు: 2019 ఫిబ్రవరి 9- 2019 ఫిబ్రవరి 20 మధ్య... * తుది రాత పరీక్ష: 2019 మార్చి 3న దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు... * slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.