‘ప్రజలతో నిత్యం కలిసేలా కార్యక్రమం ప్రకటించాం. ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కార్యక్రమాలను వినియోగించుకోవాల్సిందిగా కోరాం. కానీ చాలా మంది 50 శాతం మించి గ్రామదర్శిని అమలు చేయలేకపోయారు. మిగతా చాలా చోట్ల ప్రజా సంతృప్తి శాతం పెరిగింది. ఈ విషయంలో అందరూ గ్రామదర్శిని-గ్రామ వికాసంపై పూర్తి దృష్టి పెట్టాల్సిందే. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ పడను. బాగా పనిచేసే వారికే పార్టీ అండగా ఉంటుంది. లేదంటే ప్రత్యామ్నాయాలు ఉంటాయి’ అంటూ ఇటీవల టీడీపీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా ఇచ్చిన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామదర్శినిలో వెనుకంజలో ఉండడం సహజంగానే సీఎం చంద్రబాబుకు ఆగ్రహం రప్పించింది. ఇక ముందు వారానికో మారు కార్యక్రమాల అమలుతీరును స్వయంగా పరిశీలిస్తారని ఎమ్మెల్యేలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
కాని గడచిన మూడు నెలల కాలంలో జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో గ్రామదర్శినికి ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో పార్టీ పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా.. ఊరంతా కలియతిరగడం, అందరినీ పలకరించడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీయడంతో సహజంగానే మంత్రులు నేరుగా పల్లెల్లో ఒకింత మంచి మార్కులు పొందారు. అయినా పూర్తి చేయాల్సిన గ్రామాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అధిష్టానం ఆదేశం మేరకు గ్రామదర్శినిని పూర్తి చేయాలనే పట్టుదలతో మంత్రులు ఉన్నారు. కాని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు.దాదాపు మూడు నెలలు గడిచినా నియోజకవర్గాల్లో గ్రామదర్శినిని పూర్తి చేయలేకపోయారు.కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అనుకున్న లక్ష్యానికి ఈ మధ్యనే చేరువగా ఉన్నారు.
మంత్రులు పితాని, జవహర్ దూకుడు : రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, కె.ఎ్‌స.జవహర్‌లు గ్రామదర్శిని నిర్వహణలో తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు లక్ష్యానికి చేరువ అవుతున్నారు. మంత్రులుగా తమకు ఉన్న బాధ్యతలు ఒకవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాల అమలు మరోవైపు ఉన్నా ఈ రెండింటినీ సమతుల్యం చేసుకుని, ఉన్నంతలోనే గ్రామదర్శినికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ మధ్యన రోజుకు రెండు గ్రామాలను చుట్టిముడుతున్నారు. గ్రామదర్శిని పేరిట వెలువడిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే గ్రామాలను చుట్టిరావడం, పెద్ద వయస్సు కలిగిన వారిని అక్కున చేర్చుకుని.. వెయ్యి రూపాయలు పింఛన్ అందుతుందా, లేదా అంటూ ఆరా తీస్తున్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ గ్రామసభల్లోనే ప్రశ్నిస్తూ వాస్తవాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కమ్యూనిటీ హాళ్ళు, రోడ్డు నిర్మాణాలు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, పీహెచ్‌సీలకు ఎక్కడికక్కడ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారు. ఆచంట నియోజకవర్గంలో 52 గ్రామాలు ఉండగా ఇప్పటిదాకా 34 చోట్ల నేరుగా గ్రామదర్శినిని పూర్తి చేయగలిగారు.
ఇప్పటిదాకా నిర్వహించిన గ్రామసభలన్నింటిలోనూ మంత్రి పితానికి క్షేత్ర స్థాయి సమాచారం పూర్తిగా తెలిసొచ్చింది.మరోవైపు ఎక్సైజ్ మంత్రి కె.ఎ్‌స.జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో సైతం గ్రామదర్శిని నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ముందుగానే తెలుసుకోవడం, గ్రామదర్శిని నిర్వహించే ముందే వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి అదే విషయాన్ని గ్రామసభలో వివరించడం ద్వారా ప్రజల మద్దతు పొందుతున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 63 గ్రామ పంచాయతీలకుగాను ఇప్పటికే 44 చోట్ల గ్రామదర్శినిని పూర్తిచేశారు. స్వయంగా పల్లెల్లో పాదయాత్ర చేస్తూ, స్థానికులను ఊరికి ఇంకేం చేయాలని ఆరాతీస్తూ ఆయన పర్యటన సాగుతోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఇంటి స్థలాలు, సొంత ఇళ్ళ కోసం ఎక్కువగా విజ్ఞాపనలు చేస్తున్నారు.