పెడన నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. జోగి రమేష్ వర్గం, ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 2014 ఎన్నికలు అయిన దగ్గర నుంచి పెడన నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్‌గా ఉప్పాల రాంప్రసాద్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. ఇటీవల మారిన సమీకరణాల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గానికి చెందిన జోగి రమేష్ అనే వ్యక్తిని పెడన నియోజకవర్గానికి జగన్ పంపించారు. దీంతో ఇద్దరి మధ్య అధిపత్యపోరు నడుస్తోంది.
ఇరువురూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మచిలీపట్నం ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి బలసౌరీ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బాలసౌరీకి సంబంధించిన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్, ఉప్పాల రాంప్రసాద్ పోటా పోటీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెల్లాచెదురు చేశారు.
గొడవకు కారణమైనవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మచిలీపట్నంలో పార్లమెంటరీ నియోజకవర్గ వైకాపా కార్యాలయాన్నిఈరోజు ప్రారంభిస్తున్న సందర్భంగా పెడనలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాలకు చెందిన వైకాపా కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీగా బయలుదేరారు. పెడన బస్టాండ్ సమీపంలో ఇరువర్గాల ర్యాలీలు ఎదురవడంతో రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో జోగి రమేశ్‌కు చెందిన కారు అద్దం ధ్వంసం కాగా, ఉప్పాల వర్గానికి చెందిన ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి.