ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంటూ వస్తున్నా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు, ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు సమాచారం. ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. నిబంధనల ప్రకారం సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పిస్తామని చెప్పిన సీఎం.. ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. దీంతో రెండు ఈ రెండు స్థానాలను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనారిటీల్లో రాయలసీమకు చెందిన నేతకే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఫరూక్ మండలి ఛైర్మన్‌గా ఉన్నందున ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. తెదేపాలో ముస్లిం మైనార్టీ నుంచి ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఒకరు ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫరూక్‌కే మెరుగైన అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీల విషయానికి వస్తే.. పోలవరం ఎమ్మెల్యే, అలాగే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన వేళ ఆయన తనయుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది.