ఆపరేషన్ గరుడ విషయం బయటకు చెప్పిన హీరో శివాజీని, అరెస్ట్ చేయాలంటూ విజయవాడ పోలీస్ కమీషనర్ కు వైసిపి నేతలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ నేతల ఫిర్యాదు పై అమెరికా పర్యటనలో ఉన్న సినీ నటుడు శివాజీ స్పందించారు. వైసిపి నేతల వైఖరిని దుయ్యబడుతూ శివాజీ అమెరికా నుంచే ఒక వీడియో విడుదల చేశారు. అమెరికా నుంచే స్పందించి ఒక వీడియోను విడుదల చేశారు. ఆపరేషన్ గరుడ విషయంలో వైసీపీ నేతలు గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని హీరో శివాజీ ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడపై తనకున్న సమాచారం చెప్పానని, వైసీపీ నేతల ప్రేలాపన ఆపాలని హెచ్చరించారు.

sivaji 30102018 2

నాకున్న సమాచారం ప్రకారం నేను ఆపరేషన్ గరుడ గురించి చెప్పాను. నేను చెప్పిందే మీరు నిజం చేస్తున్నారు. మళ్లీ నన్నే తప్పుబడుతున్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని మీరే అడిగారు, ఎందుకు పెట్టాలి అని శివాజీ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారని, రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలని కోరుతున్నారని, ఎందుకు ఇవ్వాలి, నేనేమైనా బ్యాంకులని మోసగించానా? రుణాలు ఎగ్గొట్టి అమెరికా వచ్చానా? అని శివాజీ మండిపడ్డారు. నా మీద ఫిర్యాదు చెయ్యాలంటున్న బీజేపీ వారిని ప్రశ్నిస్తూ, చంద్రబాబు ప్రభుత్వన్ని మూడు నెలల్లో పడగొడతాం, చుక్కలు చూపిస్తాం అని ఎందుకు అంటున్నారో కూడా విచారణ చెయ్యాలన్నారు.

sivaji 30102018 3

సిఎం చంద్రబాబు నాకు డబ్బులిస్తే నేను అమెరికా వచ్చానని వైసిపి నేతలు అంటున్నారు. నేను అమెరికా రావడం ఇదే మొదటిసారి కాదు, నా వీసా చెక్ చేసుకోండి, ఇప్పటికి 54 సార్లు అమెరికా వచ్చాను. అదీ 2010 నుంచి అనేక సందర్భాల్లో అమెరికా వచ్చా, నాకు ఛార్జీలకు డబ్బులు కూడా లేని పరిస్థితి, వేరే వాళ్లు డబ్బులు ఇస్తేనే అమెరికా వచ్చేంత హీన పరిస్థితి లేదన్నారు. అయినా కేంద్రం మీ చేతుల్లోనే ఉందని అందరూ అనుకుంటున్నారు. నా మీద మీ ఇష్టం వచ్చిన దర్యాప్తు చేసుకోండి, తప్పు ఉందని తేలిస్తే మీ ఇష్టం వచ్చినట్లు శిక్షించుకోండి, అంతే తప్ప ఊరికే ఆరోపణలు చేయొద్దని హీరో శివాజీ తాను అమెరికా నుంచి విడుదల చేసిన వీడియోలో వైసిపికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి పై విచారణ మూడో రోజుకి చేరింది. ఠాణేలంక పెదపేటలోని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి సోదాలు చేసి.. తండ్రి తాతారావు, తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజును సిట్‌ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. శ్రీనివాసరావు 20 రోజుల క్రితం మురమళ్లలో కోనసీమ ఉత్సవాలు జరిగిన ప్రాంతంలో గోదావరి ఒడ్డున కొంతమంది స్నేహితులకు శ్రీనివాసరావు భారీ విందు ఇచ్చాడని.. ఆ విందుకు ఒక యువతిని కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ విందుకు రూ.40 వేల వరకు చెల్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు.. అక్కడ ఏం మాట్లాడుకున్నారనే విషయాలపై సిట్‌ ఎస్‌ఐ వెంకట్రావు ఒక్కొక్కరినీ విడివిడిగా విచారిస్తున్నారు.

jagan 30102018 2

శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, కాల్‌డేటా పరిశీలనలో అతడు ఏడాదిలో పదివేల కాల్స్‌ మాట్లాడినట్లు వెలుగులోకి వచ్చింది. వందమందితో ఎక్కువసార్లు సంభాషించాడని పోలీసులు నిర్ధరణకు వచ్చారు. శ్రీనివాసరావుతో తరచూ మాట్లాడిన వారెవరు? ఏ అంశాలపై మాట్లాడారు? అన్నది కూపీ లాగుతున్నారు. వైకాపా కార్యాలయంలో విధులు నిర్వర్తించే ‘కె.కె.’ అనే వ్యక్తితోనూ ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలడంతో పోలీసులు అతన్ని సోమవారం విమానాశ్రయ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. దీంతోపాటు విమానాశ్రయంలోని రెస్టారెంట్లో పనిచేసే ముగ్గురు యువతుల సెల్‌ఫోన్ల నుంచి కూడా శ్రీనివాసరావు మాట్లాడాడని తేలడంతో వారినీ విచారించారు.

jagan 30102018 3

నిందితుడికి ప్రాథమికంగా మూడు బ్యాంకు ఖాతాలున్నాయని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ఆంధ్రాబ్యాంకు ఖాతాలో సున్నా, విజయా బ్యాంకులో రూ.350, ఎస్‌బీఐలో కేవలం రూ.56 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇంత తక్కువ మొత్తాలపై పోలీసులు విస్మయానికి గురయ్యారు. శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజుకు ఆంధ్రాబ్యాంకు ఖాతాలో రూ.80 వేలున్నట్లు గుర్తించారు. ఈ నగదు ప్రైవేటు వడ్డీ వ్యాపారినుంచి వచ్చినట్లు సమాచారం. శ్రీనివాసరావు తల్లి సావిత్రి, వదిన బేబిలకు ఠాణేలంక ఎస్‌బీఐ కియోస్క్‌లో ఖాతాలున్నాయి. ఉపాధిహామీ పథకం, గ్యాస్‌రాయితీ వంటి సొమ్ములు మినహా వాటిలోకి భారీగా నగదు బదిలీ జరిగే అవకాశం లేనందున అధికారులు వాటిని పరిశీలించలేదని తెలిసింది. శ్రీనివాసరావు తండ్రి జనిపల్లి తాతారావు పేరున రూ.2 లక్షల రుణం మంజూరు కాగా ఇప్పటివరకు రూ.1.15 లక్షలవరకూ బిల్లు చేసినట్లు గృహనిర్మాణ అధికారులు వివరించారు.

పోలవరం ప్రాజెక్టులో నిర్వాసిత కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ప్రకటించారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలకు నిర్మిస్తున్న ఇళ్లకు అదనంగా రూ.75 వేలు ఇస్తున్నట్లుగానే.. గిరిజనేతర కుటుంబాలకు కూడా అదనంగా రూ.50 వేల చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.245.53 కోట్ల భారం పడుతుంది. అయితే ప్రతి నిర్వాసిత కుటుంబం సంతోషంగా ఉండడమే తనకు ముఖ్యమని.. ఇందుకోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా వెనుకాడేదిలేదని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ.15 వేలు అదనంగా ఇవ్వాలని సూచించారు.

polavaram 30102018 2

సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు. జనవరికల్లా 48 కాలనీలు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పునరావసం, పరిహారానికి చెందిన సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిర్వాసితులు ప్రభుత్వం నిర్మించే గృహ విస్తీర్ణం కన్నా మరింత విశాలంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం చెప్పవద్దన్నారు. వీలైతే బ్యాంకుల నుంచి వారు రుణాలు పొందేందుకు సహకరించాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రాంతంలోని 8 గ్రామాల్లోని 3,992 నిర్వాసిత కుటుంబాలకు 2014లో పునరావాసం పూర్తయింది. ఇంకా 16,048 నిర్వాసిత కుటుంబాలను తరలించాలి.

polavaram 30102018 3

వీరికోసం 48 కాలనీల నిర్మాణం కొనసాగుతోంది. 2013 భూసేరణ చట్టం ప్రకారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని ఒక్కో నిర్వాసిత కుటుంబానికి అందిస్తారు. పునరావాస కాలనీలకు తరలి వెళ్లేందుకు రూ.5,00,000.. 12 నెలలకు రూ.36 వేల గ్రాంటు (నెలకు రూ.3,000 చొప్పున), ఎస్సీ, ఎస్టీల తరలింపునకు అదనంగా రూ.50 వేలు, చేతివృత్తుల వారికి, వ్యాపారులకు అదనంగా రూ.25 వేలు, పశుశాలకు అదనంగా రూ.25 వేలు.. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి ఇంటి స్థలం (243 చదరపు గజాలు) రూ.1,00,000, ఇంటి నిర్మాణానికి (ఐఏవై) రూ.2,84,000, ఎస్టీ కుటుంబాలకు అదనంగా రూ.75 వేలు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.6,86,000, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక్కో కుటుంబానికి రూ.7,00,000.. మొత్తం రూ.18,45,000. ఎస్టీయేతరులకు రూ.18,20,000 వ్యయమవుతుంది.

కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు, ఐటి అధికారులు ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ఐటి దాడులు చేస్తున్నారు. వివధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటి అధికారులు, అచ్చంగా ఏపిలోనే నివాసం ఉంటున్నారా అనే విధంగా, గత 20 రోజుల నుంచి, ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఐటీ అధికారులు సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న గుంటూరులో టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శి ఇంట్లో సోదాలు జరిపిన ఐటీ అధికారులు ఈ రోజు మళ్ళీ విశాఖలో తనిఖీలు చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌‌ టార్గెట్ గా ఆయన బంధువు, పేరం గ్రూప్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

it 29102018 2

నిన్న ప్రముఖ వ్యాపారి, టీడీపీ నేత, గుంటూరు వాసులకు గ్యాస్‌ నానిగా సుపరిచితుడైన కోవెలమూడి రవీంద్ర (నాని) ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం ఉదయం ఆరు గంటలకే సుమారు 16 మంది ఐటీ అధికారులు మూడు బృందాలుగా విడిపోయారు. లక్ష్మిపురం మెయిన్‌ రోడ్డులో ఐటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న నాని ఇల్లు, కార్యాలయంతో పాటు బ్రాడీపేట 3వ లైన్‌లోని గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయంలో కూడా విస్తృతంగా సోదాలు నిర్వహించారు. రవీంద్ర నా వద్ద ఎటువంటి డబ్బు లేదు, మీరు అన్నీ చూసుకోవచ్చు అని స్పష్టం చేసినట్లు తెలిసింది. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని తమతో తీసుకొని వెళ్లిన ఐటీ అధికారులు... నానిని కార్యాలయానికి వచ్చి కలవాలని చెప్పారు.

it 29102018 3

కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారికి ఆర్థిక సహకారం అందించే వ్యాపార వేత్తలపై ఐటీ దాడులు జరగవచ్చంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సహకారం అందిస్తుండే కోవెలమూడి రవీంద్రపై ఐటీ దాడులు జరగడంతో కలకలం రేగింది. రవీంద్రపై దాడితో వ్యాపార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకున్నాయి. సోదాలు పూర్తయ్యే వరకు వారంతా రోడ్డుపైనే ఉండిపోయారు. అధికారుల బృందం వెళ్ళిన తరువాత పార్టీ శ్రేణులు నానీని కలిసి పరిణామాలపై చర్చించాయి. అయితే ఈ విషయమై అటు ఐటీ అధికారులు కానీ ఇటు నాని కానీ స్పందించేందుకు నిరాకరించారు. బీజేపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.

Advertisements

Latest Articles

Most Read