ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ యాక్షన్ ప్లాన్ ఊపందుకుందా ? చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ మరింత దాడిని పెంచబోతుందా? రాబోయే ఆరు నెలల్లో ఏం జరగబోతోంది? ఏపీలో ఎన్నికల వాతావరణం ముందే వచ్చేసింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పటినుంచి మొదలైన రాజకీయ యుద్ధం ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. ఎన్డీయే నుంచి బయటకొచ్చాక మోదీపై టీడీపీ యుద్ధం ప్రకటించింది. హోదా ఇవ్వకుండా మోదీ ఎలా మోసం చేసింది ప్రజలకు వివరిస్తూ.. ధర్మపోరాట దీక్షలు చేసింది. అవకాశం వచ్చిన ప్రతీసారి మోదీ తీరును చంద్రబాబు ఎండగట్టారు. అంతేకాదు రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు జగన్, పవన్‌తో కలిసి కుట్రలు పన్నారని ఆరోపించారు.
దీంతో చంద్రబాబు టార్గెట్‌గా బీజేపీ పావులు కదపడం ప్రారంభించింది. బాబు ఇమేజ్‌ను, టీడీపీని దెబ్బతీసేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఇందుకు తగినట్టుగానే బీజేపీ తెరవెనుక పావులు కదిపింది. తిరుమల రమణదీక్షితుల అంశంతో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ చూసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత పీడీ ఎకౌంట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి.. చంద్రబాబుకు ఇక్కట్లు తప్పవంటూ బీజేపీ నేతలు హెచ్చరికలు చేశారు. మరోవైపు కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై టీడీపీ ధర్నాకు దిగింది. దీంతో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ప్రాంతాలవారీగా రెచ్చగొట్టేందుకు బీజేపీ కొత్తపన్నాగం పన్నిందని టీడీపీ ఎదురుదాడి చేయడంతో కమలనాథులు వెనక్కితగ్గారు.
దీంతో టీడీపీని దెబ్బతీసేందుకు తన ఫార్ములాను బీజేపీ బయటకు తీసింది. ఐటీ దాడులతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంది. అలాగే ఓటుకు నోటు కేసును బయటకులాగి చంద్రబాబును ఇరుకున పెట్టాలని అనుకుంది. తాజాగా ఐటీ దాడులు, జగన్ పై కోడి కత్తి దాడి,అగ్రిగోల్డ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే దేనికీ భయపడబోమని, ఎంతకైనా సిద్ధమని టీడీపీ నేతలు ప్రకటించారు. మరోవైపు జగన్, పవన్‌తో బీజేపీ తెరవెనుక అవగాహన కుదుర్చుకుందని టీడీపీ మొదటినుంచీ ఆరోపిస్తూ వస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. త్వరలో ప్రభుత్వం మారిపోతుందని, ప్రభుత్వం ఏర్పాటులో కీలకం కాబోతున్నామని రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో, బీజేపీ వైపు నుంచి, మరిన్ని ఇబ్బందులు రావటం తధ్యంగా టిడిపి నేతలు భావిస్తూ, మానసికంగా సిద్ధమవుతున్నారు.