సామాన్య ప్రజలకేమో, కూటి కోసం కోటి పాట్లు... రాజకీయ నాయకులకేమో, ఓట్ల కోసం, కోటి పాట్లు... తెలంగాణాలో అయ్య కేసీఆరే ఏమో ఒక పక్క ఆంధ్రోళ్ళని అమ్మనా బూతులు తిడతాడు, కొడుకేమో వెళ్లి అదే ఆంధ్రోళ్ళకు వెన్న పూస్తాడు. ఇదే సందర్భంలో కూకట్‌పల్లికి వచ్చి, అక్కడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిస్కట్ వేస్తున్నాడు కేటీఆర్. చంద్రబాబుని కావాలని తిట్టటం లేదని, మాకు ఆయన పై ద్వేషం లేదని, కేవలం రాజకీయంగానే విమర్శలు చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తరువాతే, తెలుగు వారికి గుర్తింపు వచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత, ఎవరి బ్రతుకు వాళ్ళం బ్రతుకుతున్నామని, చంద్రబాబు మా దగ్గరకు వచ్చి, తెలుగు వారు అందరూ కలిసి ఉందాం అని మాతో పొత్తుకు వస్తే కూడా, ఇదే చెప్పమని చెప్పారు కేటీఆర్.
మరో పక్క ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పై కూడా కేసీఆర్ బిస్కట్ వేసే ప్రయత్నం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని నిర్మించుకోవాలని అక్కడి ప్రభుత్వం తలంచిందని, ఇందులో భాగంగా రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఏపీ ప్రభుత్వం ఆహ్వానించిందని గుర్తుచేశారు. ఆ సందర్భంగా అమరావతి నిర్మాణానికి రూ.100 కోట్లు ప్రకటించాలని మంత్రివర్గం సమ్మతితో కేసీఆర్ నిర్ణయించారని కేటీఆర్ వెల్లడించారు. సంతోషంగా అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లారని, అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించిందన్నారు. శంకుస్థాపన సందర్భంగా ఏపీ ప్రభుత్వం బహిరంగ సభను ఏర్పాటు చేసిందని, ఆ సభలో కేసీఆర్‌ను తొలుత ప్రసంగించాల్సిందిగా కోరారని గుర్తుచేశారు.
అప్పటికే వంద కోట్లు ప్రకటించాలని నిర్ణయంతో ఉన్న కేసీఆర్.. తొలుత కేంద్రం ఏం ఇస్తుందో తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి సెక్రెటరీని సంప్రదించారని చెప్పారు. ఏపీకి ప్రధాని ఎంత ప్రకటిస్తున్నారని అడగగా మట్టి, నీళ్లు మాత్రమేనని వారి నుంచి సమాధానం వచ్చిందన్నారు. దీంతో చేసేదేమీ లేక.. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. ఒకవేళ తాను వంద కోట్లు ప్రకటించి.. ప్రధాని మోదీ ప్రకటించకపోతే వివాదం రాజుకుంటుందనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు కేటీఆర్ వివరించారు. ఇదంతా అక్కడ ఉన్న ఆంధ్రా వాళ్ళని మంచి చేసుకోవటానికి కేటీఆర్ చెప్పారు. అయితే ఇంత విశాల హృదయం ఉన్న కేసీఆర్, ఆంధ్రా కరెంటు బాకీలు అయిన 5 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు ? ఉమ్మడి ఆస్తుల విభజన గురించి ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదు ? అమరావతి పై ఎందుకు హేళన చేస్తున్నారు ? ఇవన్నీ ప్రజలు మర్చిపోతారని కేటీఆర్ భావన అనుకుంటా. సరే డిసెంబర్ 11 దాక ఎదురు చూడండి.