ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని, అయితే జరిగిన విధానమే ఎవరికైనా సందేహం కలిగించేలా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని విపక్ష నేతలు చేసిన విమర్శలపై మండిపడ్డారు. జగన్పై ఆయన సొంత పార్టీ కార్యకర్త దాడికి పాల్పడితే దానిని అడ్డుపెట్టుకొని అనేక శక్తులు టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహించారు. గురువారం రాత్రి చంద్రబాబు మీడియాతో ఈ అంశంపై మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. మునుపెన్నడూ లేనట్లుగా కఠిన స్వరం వినిపించారు. నేను కేంద్రంతో పోరాడుతున్నాని, అందరితో కలిసి కుట్రలు పన్ని, ఏకంగా రాష్ట్రాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నారు, నేను నేను భయపడటం లేదు, రాష్ట్రం కోసం సిద్ధపడుతున్నా,ఎన్ని కుట్రలు చేసిన నేను రెడీ అని చంద్రబాబు అన్నారు.
‘దాడి జరిగింది వైకాపా అధ్యక్షుడిపై .. చేసింది ఆ పార్టీ వీరాభిమాని.. ఘటన జరిగిన ప్రాంతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విమానాశ్రయంలో.. నెపం తెలుగుదేశంపై వేస్తారా? ఇదేం దుర్మార్గం..! తమాషాలాడుతున్నారా? మీ ఆటలు నా దగ్గర సాగవు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..’ అని తీవ్రస్థాయిలో ఆయన మండిపడ్డారు. ‘విమానాశ్రయంలో కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రత ఉంటుంది.. దాడి జరిగిన వెంటనే వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఇక్కడ మాత్రం సాయంత్రం 4.30 గంటలకు ఫిర్యాదు ఇచ్చారు.. అప్పటికీ దాడికి ఉపయోగించిన చిన్న కత్తిని స్వాధీనం చేయలేదు. కొంత సమయం దగ్గర పెట్టుకుని తర్వాత తెచ్చి ఇచ్చారు. దీనికి ఫొరెన్సిక్ పరీక్ష ఎలా సాధ్యమవుతుంది?’ అని ప్రశ్నించారు. ‘జరిగిన దాడి మెడికో లీగల్ కేసు. కేసున్నా, లేకున్నా సంఘటన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలి. జగన్ మాత్రం బాధ్యతా రాహిత్యంగా విమానంలో హైదరాబాద్కు వెళ్లిపోయారు’ అని చంద్రబాబు విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో ఘటన జరిగింది. దానికి మా బాధ్యత ఉండదు. కానీ, విశాఖలో వంద మంది వైసీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. పులివెందులలో ఫ్లెక్సీలు తగలబెట్టారు. విశాఖలో క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఫిన్టెక్ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. వారందరూ తిరిగి వెళ్లే సమయంలో ఇవన్నీ చేశారు. ఇటువంటి సంఘటనలు సృష్టించడం దేనికి? ఈ రాష్ట్రానికి ఎవరూ రాకుండా చేయాలని ప్రయత్నమే కదా?’’ అని నిలదీశారు. ఎవరో భయపెడితే తాను భయపడేవాడిని కానని, దేనిని ఎలా ప్రతిఘటించి నిలబడాలో బాగా తెలిసిన వాడినని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కేంద్రంలో బీజేపీ నుంచి విడిపోగానే కుట్రలు మొదలయ్యాయన్నారు. ‘‘మేం బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఐటీ దాడులు లేవు. హోదా కోసం పోరాటం మొదలుపెట్టగానే అన్నీ మొదలయ్యాయి. జీవీఎల్ నుంచి జగన్ వరకూ... కేసీఆర్ నుంచి పవన్ వరకూ మాపై కమ్ముకొస్తున్నారు. వారు చేసే తప్పులు వారికే ఎదురు తిరుగుతాయి. ప్రజలు రోజూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపకపోవచ్చు. కానీ, మనసులో ఉంచుకొంటారు. తగిన సమయంలో తీర్పు చెబుతారు’’ అని స్పష్టం చేశారు.