తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అల్లకల్లోలం చేసింది. తుఫాను తీవ్రత తెలిసిన వెంటనే యావత్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణనష్టం తగ్గించగలిగాం. కానీ 165కి.మీ వేగంతో ఈదురుగాలుల బీభత్సం వల్ల ఆస్తినష్టం నివారించలేక పోయాం. ‘తిత్లీ’చేసిన ఆస్తి నష్టం కారణంగా శ్రీకాకుళం,విజయనగరం ప్రజలు తీరని బాధల్లో ఉన్నారు. రైతులు కన్నబిడ్డల్లా చూసుకున్న పచ్చని తోటలు నిలువునా కుప్పకూలాయి. కళ్లముందే ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయి. ఉద్యానవనం లాంటి ఉద్దానం 'తిత్లీ' తెచ్చిన నష్టంతో దశాబ్దాలు వెనక్కి పోయింది. నిన్నటివరకూ కిడ్నీ బాధలే అనుకుంటే పులిమీద పుట్రలా 'తిత్లీ' విలయతాండవం ఉద్దానాన్ని అధ్వాన్నంగా మార్చేసింది. ఒక్క ఉద్ధానంలోనే కాదు, శ్రీకాకుళం జిల్లాలో అనేక గ్రామాలలో తుఫాను పెను విషాదాన్ని మిగిల్చింది. కొబ్బరి, జీడి తోటలతోపాటు, వరి తదితర పంటలు కళ్లముందే కూలిపోవడం చూసి రైతుల దు:ఖం వర్ణనాతీతం. వలలు, పడవలు కొట్టుకుపోయి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 40 వేల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. 114 సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి. 700 కి.మీ. రోడ్లు పాడయ్యాయి. 365 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. 1,59,524 ఎకరాల వరి, 4,543 ఎకరాల కొబ్బరి తోటలు, 17,589 ఎకరాల జీడిమామిడి తోటలు, 968 ఎకరాల అరటి పంట ధ్వంసం అయ్యింది. 34,848 ఇళ్ళు పూర్తిగా, 12,397 ఇళ్ళకు పాక్షికంగా నష్టం జరిగింది. రూ.3,428 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనా.
కానీ, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతే జీవితమే లేదు. తిత్లీ తుఫాను చేసిన గాయాలకు మనమే మందు వేయాలి. ఒక రైతుబిడ్డగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారి కష్టాన్ని చూసి చలించిపోయాను. వెంటనే రంగంలోకి దిగాను. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి వ్యూహరచన చేశాను. ఈ కష్టం నుంచి గట్టెక్కించే వరకు ఇక్కడ నుంచి ఎవరూ కదలకూడదని అధికార యంత్రాంగాన్ని ఆదేశించాను. బాధితుల్లో ధైర్యం నింపాను. సచివాలయాన్నే అక్కడికి తరలించాను. నా మంత్రివర్గ సహచరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ ఆపన్నులను ఆదుకునేందుకు అహోరాత్రులూ కృషిచేశారు. 35 మంది ఐఏఎస్ అధికారులు, 100 మంది డిప్యూటీ కలెక్టర్లు,10వేల మంది విద్యుత్ సిబ్బంది, 13వేల మంది పారిశుద్య కార్మికులు,ఇతర శాఖల ఉద్యోగులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు శాయశక్తులా పనిచేస్తున్నారు. నీరు, ఆహారం,నిత్యావసర సరుకులు పుష్కలంగా అందిస్తున్నారు. తుఫానులు, కరవులు తదితర ప్రకృతి వైపరీత్యాలు ఈ రాష్ట్రాన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలోనే దీని గురించి హెచ్చరించాను. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశాను, కాని అప్పుడు నా మాటలను నిర్లక్ష్యం చేశారు.
మానవ ప్రయత్నం అంటూ ఉంటే దైవం కూడా సానుకూలంగా ఉంటుంది. ఎదిరించి నిలబడే గుండెధైర్యం ఉంటే తుఫాన్ కూడా తలొంచుతుంది. ఉక్కు సంకల్పంతో, మనో నిబ్బరంతో ఆనాడు ‘హుద్‌హుద్ తుఫాన్‌ను జయించాం.’ ఒక ఆపదను అవకాశంగా తీసుకుని అభివృద్ధి చేసుకున్నాం. హుద్‌హుద్ తరువాత విశాఖ నగరం ఎలా మారిపోయిందో అందరికీ తెలుసు. వైజాగ్ ఇప్పుడు ప్రపంచశ్రేణి నగరంగా ఉంది. అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచింది. తిత్లీ నుంచి కూడా అటువంటి స్ఫూర్తినే తీసుకుని శ్రీకాకుళం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాను. అందరితో సమాలోచన చేసి ‘TURPU’ అనే పేరుతో పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాం. ‘తూర్పు’ అంటే టిట్లి ఉద్దానం రికనస్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్ అని అర్ధం. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర ప్రాంతంలో గొప్ప మార్పును తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ‘TURPU’ ఊతంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. తిత్లీ తుఫాన్ జాడలే కనిపించనంతగా అభివృద్ధి చేస్తాం. కష్టాలపాలైన ఉద్దానాన్ని కాపాడుకోవడం ప్రస్తుతం మనందరి కర్తవ్యం. బాధల్లో ఉన్న బారువాను ఓదార్చడం మన ఉమ్మడి బాధ్యత. ఈ రెండు ప్రాంతాలనే కాదు, తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాలన్నింటినీ పునర్నిర్మించాలి. దీనిని ఒక సామూహిక ఉద్యమంగా చేపట్టాలి.
తిత్లి తుపాన్ నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి రూ.1,200 కోట్ల తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరాం. నిన్న కూడా మరో లేఖలో జరిగిన నష్టాన్ని వివరిస్తూ వెంటనే నిధులు విడుదల చేయమని విజ్ఞప్తి చేశాం. అయినా ఇంతవరకు కేంద్రం స్పందించలేదు. కేంద్రం నిధుల విడుదల కోసం ఎదురు చూడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా ఇప్పటికే శరవేగంగా సహాయక చర్యలు ముమ్మరం చేశాం. బాధిత కుటుంబాలు నిలదొక్కుకొనేందుకు నష్టపరిహారం ప్రకటించాం. అయితే ప్రభుత్వం అందించే సహాయంతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆర్థిక స్థోమత గల కంపెనీలు, ప్రవాసాంధ్రులు, అన్నివర్గాల ప్రజలు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. ఒక సమస్య వచ్చినప్పటికీ దీనిద్వారా ఇంకొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కలిగింది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి నివారణ పరిశోధనా సంస్థను నెలకొల్పడానికి దాతలు ముందుకొచ్చారు. హార్టీకల్చర్ పరిశోధనా సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు మరికొన్ని సమస్యల పరిష్కారానికి మీ అందరి చేయూత కావాలి.
తిత్లీ తుపాను బాధితులకు సహాయం చేయాలనుకునే దాతలు విరాళాలను నేరుగా పంపడానికి వీలుగా ఏపీసీఎం సహాయ నిధి వెబ్సైట్ ప్రారంభించాం. దీని ద్వారా దాతలు విరాళాలను చెల్లించవచ్చు. ఈ విరాళాలను పూర్తిగా తిత్లీ తుఫాన్ బాధిత ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తాం. Apcmrf.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి దాతలు తమ విరాళాలను పంపవచ్చు. డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ బ్యాంకింగ్, paytm ద్వారా ఎవరైనా తమ విరాళాలను అందించవచ్చు. పెద్ద మొత్తాల్లో అందించే విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ‘ఉద్యమాల పురిటిగడ్డ’ శ్రీకాకుళం జిల్లాలో ఆస్తులు కోల్పోయినా ఆత్మవిశ్వాసం సడలని ప్రజలు సిక్కోలు జనం. ఇప్పటి ఈ చీకట్లు చీల్చి రేపటి వెలుగులు అందించేందుకు ఈరోజే మనమంతా ఒక మహోద్యమానికి శ్రీకారం చుడదాం. ఆపదలో ఆదుకునే హృదయమే గొప్పది. రండి ! చేతనైన సహాయం చేద్దాం. ఆపదలో ఉన్న మన శ్రీకాకుళం సోదర సోదరీమణులకు వీలైనంత ఆసరా ఇద్దాం. మానవతను చాటుకుందాం. నెలవారీ మన ఖర్చుల నుంచి కొంత సొమ్ము విరాళంగా ఇద్దాం. తుఫాను బాధితులకు ఓదార్పునిద్దాం, వారి బాగుకు భరోసానిద్దాం ! జైహింద్... జై జన్మభూమి.. మీ చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..