ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఎన్నో పెండింగ్ లో ఉన్నాయి, ఎన్నో సమస్యల పై తెలుగుదేశం పోరాటం చేస్తుంది. అయితే, పోరాటం చేస్తున్న వాటి పై, ప్రజలకు ఉపయోగం ఉన్న వాటి పై కాకుండా, నియోజకవర్గాల పెంపు పై ఆఘమేఘాల మీద, ఈ రోజు కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్ర హోంశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉన్నట్టు ఉండి, దీని పై కేంద్రం ఎందుకు ముందుకు వెళ్తుంది అనే విషయం పై, ఏపి ప్రభుత్వం ఆరా తీస్తుంది. తెలంగాణాకు లాభం చేకుర్చటానికి, ఇప్పుడు ఏమన్నా చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది.
గతంలో నిలుపుదల చేసిన నియోజకవర్గాల పెంపు పై ప్రక్రియను హోం మంత్రిత్వశాఖ తిరిగి ప్రారంభించింది. ప్రస్తుత రిజర్వేషన్ల వివరాలు తెలపాలని, ఎన్ని నియోజకవర్గాలు ఎస్పీ, ఎస్టీ జనరల్ కేటగిరీల్లో ఉన్నాయో చెప్పాలని, ఏ కేటగిరీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర హోంశాఖ అడిగిన అంశాలపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది. ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందో చెప్పాలని ఎన్నికల సంఘం కోరింది. దీంతో రిజిస్ట్రార్ జనరల్ నుంచి హోం మంత్రిత్వశాఖ అభిప్రాయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల పూర్తి నివేదిక ఇంకా తయారు కాలేదని, 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చని రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదికను కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి పంపింది. ఇటీవల అధికారులతో ఈ అంశంపై హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గబా సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా పోలవరం ముంపు మండలాలపై కూడా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పెంచిన నియోజకవర్గాలకు అనుగుణంగానే ఎన్నికలకు వెళ్లాలని హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల పెంపుపై హోంశాఖలో అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసుకుని, ఎన్నికల సంఘం ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఎన్నికల సంఘం ఈ వారంలో కానీ, వచ్చే వారంలోకానీ నివేదిక ఇస్తుందనే అభిప్రాయాన్ని హోంశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబరు 15-20 తేదీలోగా ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తుందనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్నికల సంఘం నుంచి నివేదిక వస్తే వెనువెంటనే ఈ నిర్ణయాన్ని కేబినెట్ ముందుకు తీసుకువెళ్లి రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది.