ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తొలుత ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖపట్టణంలోని కేజీహెచ్(కింగ్ జార్జ్ హాస్పిటల్)లో పడకల కొరత ఉన్నట్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. ‘‘అధ్యక్షా.. ఇంతకు ముందు వైద్యశాఖను మా పార్టీకి చెందిన కామినేని శ్రీనివాసరావుగారు నిర్వహించేవారు. ఇప్పుడు ఆ శాఖను సీఎంగారే నిర్వహిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా మార్పు రావాలి. ఇప్పుడున్న జనాభాకు వెయ్యి పడకలు సరిపోవడం లేదు. సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది."
"నేను నాలుగేళ్ల నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రిగారు తరచూ విశాఖపట్టణం వస్తున్నారు. అది మంచిదే. ఒకసారి ఆయన కేజీహెచ్‌ను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది వరకు మా మంత్రిగారు కేజీహెచ్‌లో రాత్రి బస చేశారు. నేను వద్దని చెప్పినా ఆయన వినలేదు. తర్వాత ఆయన పోస్టు పోయింది. అక్కడ ఏదో సెంటిమెంట్ ఉందట. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిగారు పడుకోవాల్సిన అవసరం లేదు.. విజిట్ చేస్తే చాలు(నవ్వుతూ). ఆయన కనుక విజిట్ చేస్తే కేజీహెచ్ రూపురేఖలు మారిపోతాయనే నమ్మకం ఉంది. తప్పకుండా కేజీహెచ్ బాగుపడుతుంది.’’ అంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు.
దీనికి చంద్రబాబు స్పందించారు. ప్రాథమిక వైద్యకేంద్రాల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రాథమిక వైద్యకేంద్రాలపై బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, మాణిక్యాలరావులు బాగా మాట్లాడారని.. కానీ కేంద్రం నుంచి డబ్బులు తేవడంలో మాత్రం విఫలమవుతున్నారన్నారు. భవనాలు సరిగ్గా లేవన్న విషయంలో వాళ్లతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. సామాన్యుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలన్నదే తమ ధ్యేయమన్నారు. అన్ని సబ్ సెంటర్లను, పంచాయతీ, అంగన్ వాడీ, స్కూళ్లు, శ్మశానాల నిర్మాణాలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో వైద్యులు నిర్లక్ష్యంగా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలోనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.