అమరావతి బాండ్లు బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యే సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 27న ముంబైకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 9.05 గంటలకు మార్కెట్ తెరిచిన వెంటనే లిస్టింగ్ జరగబోతోంది. ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అమరావతి బాండ్లకు మంచి స్పందన వచ్చిందని, అమరావతి అభివృద్ధిలో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయనడానికి ఇదే తార్కాణమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సందర్భంగా గురువారం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో అమరావతి బాండ్ల గురించి ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు.
ఉండవల్లిలో ప్రజా వేదికలో జరిగిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పలు ప్రోజెక్టుల ప్రగతిని సమీక్షించారు. విజయవాడలో ఉన్న మూడు కెనాళ్లతో పాటు కరకట్ట, ప్రకాశం బ్యారేజీ - కృష్ణ నదీ తీరప్రాంతాన్ని నీల-హరిత సుందర ప్రాంతంగా తీర్చిదిద్దడానికి వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. అమరావతిలో వైకుంఠపురం నుంచి చోడవరం వరకు దాదాపు 30 కిలోమీటర్ల పైగా ఉన్న నది తీరప్రాంతాన్ని అత్యంత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు.
విజయవాడ-గుంటూరు-తెనాలి వెంబడి ఉన్న కాల్వలను సుందరంగా మార్చేలా ప్రతిపాదనలు వెంటనే రూపొందించి అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రకాశం బ్యారేజీ పరిసరాల లో ఉన్న కొండ ను, ఘాట్లను సందర్శకులకు ఆహ్లాదం ఆనందం కలిగించేలా తీర్చిదిద్దాలని, వీటికి సంబంధించిన పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. 'స్వచ్ఛమైన, శుభ్రమైన జలాలు 365 రోజులు కెనాళ్లలో పారే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఆ కాల్వల చుట్టుపక్కల ఉన్న ముళ్లకంపలు, వ్యర్ధాలను, తొలగించి పరిశుభ్రం చేసి హరితహారాలను అభివృద్ధి చేయాలి. ప్రకాశం బ్యారేజీ నుంచి కరకట్ట వైపు ఇంకా రహదారులను విస్తరించడం, ఆకర్షణీయ ప్రాంతాలుగా రూపొందించడం చేయాలి" అని ముఖ్యమంత్రి చెప్పారు.ఈ ప్రోజెక్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి కూడా తీసుకెళ్లి పర్యావరణంగా తగు అనుమతులు కూడా తీసుకోవాలని సూచించారు.