పోలవరం కుడికాల్వ, విమానాశ్రయం విస్తరణ, మల్లవల్లి పారిశ్రామిక వాడ, ఇలా ఎన్నో మంచి పనులు గన్నవరం నియోజకవర్గంలో జరిగాయి. ఇవి రాష్ట్రానికి మంచి చేసేవే అయినా, అక్కడ భూమి సమీకరించటం మాత్రం, స్థానిక ఎమ్మల్యే వంశీకి ఒక ఛా లెంజ్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఉదారంగా వ్యవహరించి, రైతులకు సంతృప్తికరంగా ఉండేలా పరిహారం ఇచ్చారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్ట్ కి మాత్రం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ, వంశీ ముందుకెళ్ళారు. నవ్యాంధ్రకు ప్రధాన విమానాశ్రయంగా ఉండి, అంతర్జాతీయ హోదా పొందిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ఇక శరవేగంగా జరగనుంది.
ఏడాదిన్నర కిందటే పనులు వేగంగా జరగాలని ప్రజాప్రతినిధులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారుల సమావేశంలో నిర్ణయించారు. కానీ విస్తరణకు అవసరమైన భూ సమీకరణకు అడ్డంకులు రావడం, రాజధానిలో ఫ్లాట్ల కేటాయింపులపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో కార్యాచరణ అనుకున్నంతగా వేగవంతం కాలేదు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌లు ఇటీవల రైతులతో నిర్వహించిన సమావేశంలో దాదాపుగా ఏకాభిప్రాయం రావడంతో విస్తరణకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎప్పటికప్పుడు, రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి, మార్గం సుగుమం చేసారు.
ప్రస్తుతం విమానాశ్రయం 536 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మరో 1,200 ఎకరాలు సేకరించేందుకు 2016 ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో ఎకరాకు 1,450 గజాల చొప్పున భూమి కేటాయించేలా సమీకరణ ప్రక్రియ చేపట్టారు. ఆరంభంలోనే దాదాపు 700 ఎకరాల వరకు సమీకరణ జరిగింది. తర్జనభర్జనల అనంతరం 830 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. ఏలూరు కాల్వ మళ్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టడంతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు ముఖ్యమంత్రిని, ఇతర పెద్దల్ని కలిసి కాల్వ మళ్లింపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ క్రమంలో ఏలూరు కాల్వ మళ్లింపు ప్రతిపాదన్ను విరమించుకోవాలని, జల రవాణాకు అవసరమైతే ప్రత్యామ్నాయం ఆలోచిద్దామని ముఖ్యమంత్రి చెప్పడంతో వివాదానికి తెరపడింది. సమీకరణ ప్రక్రియ సాఫీగా పూర్తయినట్లేనని అందరూ భావించిన తరుణంలో, నిర్వాసితులకు అమరావతి పరిధిలో ఇచ్చే ప్లాట్ల కేటాయింపుపై గందరగోళం ఏర్పడింది. అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇస్తున్నారంటూ ఇటీవల రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.
నిర్వాసితులు కోరినట్లుగా నిడమర్రు, కొరగల్లు గ్రామాలను ప్లాట్ల కేటాయింపు నుంచి మినహాయించడం, భూములిచ్చిన రైతులందరి పేర్లతో విమానాశ్రయంలో శిలాఫలకం ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్ హామీనిచ్చారు. దీంతో పాటు అవకాశాన్ని బట్టి రైతులందరూ సింగపూర్ పర్యటనకు వెళ్లేలా ఏర్పాటు చేస్తామని కూడా పేర్కొన్నట్లు సమాచారం. దీంతో నిర్వాసితులంతా సంతృప్తి చెంది ఆందోళన విరమించారు.