కృష్ణా జిల్లా వైసీపీలో ముసలం చోటు చేసుకుంది.నూజివీడు పురపాలకసంఘంలో పాలకపక్షానికి చెందిన వైసీపీ కౌన్సిలర్లు ఎనిమిది మంది తమ పదవికి, పార్టీ సభ్యత్వానికి బుధవారం రాజీనామాచేసే యోచనలో ఉన్నట్లు సమాచారం వస్తుంది. గత మూడేళ్లుగా ఈ పాలక వైసీపీలో చైర్మన్ పదవిపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కొంత కృషిచేసి అసమ్మతి వర్గమైన రామిశెట్టి మురళీవర్గానికి చెందిన వారికి వైస్ చైర్మన్ పదవి అందేలా చేశారు. అయితే తొలుత ఇచ్చిన హామీమేరకు చైర్మన్ పదవి చివరి రెండుసంవత్సరాలు మురళీవర్గానికి ఇవ్వడానికి కుదిరిన ఒప్పందాన్ని అమలుపర్చటంలో జగన్‌తో సహా అందరూ విఫలం కావడంతో మనస్థాపంతోనే ఈ 8 మంది కౌన్సిలర్స్ పార్టీకి, పదవికి రాజీనామాలు చేయటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ రాష్ట్ర నాయకులకు, జగన్ కార్యాలయ ముఖ్య సిబ్బందికి, తమ హామీలు ఇంకా నెరవేర్చబడలేదని రామిశెట్టి మురళీ ఫోన్‌ద్వారా సంప్రదిం చినట్లు సమాచారం. దీంతో వారు ఆ బాధ్యత ఎమ్మెల్యేమీద పెట్టాం కదా అని సమాధానం రావడంతో, మురళీ ఎమ్మెల్యే ప్రతాప్‌ను హామీ గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. మీరు హామీ నెరవేర్చకపోతే మాకు రాజీనామాలు తప్ప మరో గత్యంతరం లేదని ఎమ్మెల్యేకు స్పష్టం చేయడంతో ఆయన కూడా తీవ్రస్థాయిలోనే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో మంగళవారం జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశానికి అసమ్మతికి చెందిన 8 మంది గైర్హాజరు అయ్యారు. బుధవారం వీరు దీనిపై ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కౌన్సిల్లో మొత్తం 30మంది కౌన్సిలర్లు ఉండగా, వీరిలో 22మంది వైసీపీ, 8 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఒకవేళ వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు రాజకీయక్రీడ ప్రారంభించాలంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. దీనికి 16మంది కౌన్సిలర్ల మద్దతుతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు ఇవ్వాలి. ఒకవేళ 16మంది మద్దతు లభించి, కౌన్సిల్‌ల్లో ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి కౌన్సిల్‌పై విశ్వాస పరీక్ష జరిగితే, 21మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఉండాలని తెలుస్తోంది.