పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం పై, కేంద్రం ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇప్పటి వరకు రూ.2.85లక్షలతో మాత్రమే ఇళ్ళు నిర్మిస్తున్నామని, కానీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి మరో రూ.50వేలు అదనంగా మంజూరు చేసి ఇళ్లను నిర్మిస్తామని భూసేకరణాధికారి హరేంద్రప్రసాద్ వెల్లడించారు. గురువారం కుక్కునూరులో పునరావాస పరిహారం వ్యక్తిగత లబ్ధిదారుల ఎంపికపై నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు.
పోలవరం నిర్వాసితుల కు పునరావాస పరిహారం అందించడానికి గత ఏడాది అర్హులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసినట్టు తెలిపారు. ఆ జాబితాను పరిగణలోకి తీసుకుని వ్యక్తిగత పరిహారం అందించనున్నట్టు తెలిపారు. అలాగే స్ధానికంగా రేషన్, ఆధార్, ఓటరు కార్డులు ఉన్న వారికి జాబితా లో పేర్లు లేకపోతే వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పునరావాస పరిహారానికి అర్హులను చేస్తామన్నారు. అలాగే అన్ని ఆధారాలు ఉండి స్ధానికంగా ఉండకపోయినా, ఎక్కడ ఉంటున్నా పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే స్థానికంగా ఇళ్లు ఉండి ఇతర ప్రాంతాల్లో ఉంటే వారికి ఇంటి ప్యాకేజీ మాత్రమే ఇచ్చి పునరావస ప్యాకేజీ మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు.
2017 జూలై నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే పరిహారం ఇస్తామని, భూములు ఇక్కడ కోల్పోయి ఎక్కడో ఉంటున్న వారికి స్ధానికంగా ఆధార్ లేకపోతే పరిహారం ఇవ్వమన్నారు. ఇంటి పరిహారం విలువ తక్కువ వస్తే రెండు రోజుల్లో బృందాలు వచ్చి పరిశీలించి మరలా కొలతలు తీసుకుంటారని తెలిపారు. అలాగే త్వరలో పునరావాస కాలనీల్లో నమూనా ఇళ్ళను నిర్మించి నిర్వాసితులను తీసుకువెళ్ళి చూపిస్తామన్నారు. అలాగే ఇంటి పరిహారం, వ్యక్తిగత పరిహారం, నిర్వాసిత కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించే సమయంలోనే ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రామాంజనేయులు పాల్గొన్నారు.