తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం జ్వరంతో పాటు మూత్రనాళాల ఇన్ఫెక్షన్ కారణంగా చెన్నైలోని గోపాలపురం నివాసంలో ఆయనకు కావేరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన ప్రత్యేక వైద్య బృదం చికిత్సలు చేస్తోంది. కాగా, తన తండ్రి ఆరోగ్యం దృష్ట్యా ఆయను చూసేందుకు అభిమానులు ఎవరూ రావొద్దని ఆయన కుమారుడు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ కోరారు. అయితే, కరుణ కుటుంబం మాత్రం కొంత ఆందోళనగానే ఉంది. ఆయన ఆరోగ్యం క్షీణించిందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
.కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్రపతి రాంనాథ్కోవింద్ వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకున్నారు. కరుణానిధి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ వాకబు చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ట్వీటర్లో పేర్కొన్నారు. ఇదే విషయమై కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్, కుమార్తె కనిమొళితో కూడా ప్రధాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయన ఆరోగ్యం పై ఆరా తీసి, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఉపముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం గురువారం కరుణ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇప్పటికే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైకో, డీఎంకే నేత దయానిధి మారన్, కమల్ హాసన్ సహా పలువురు నేతలు గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఇది ఇలా ఉండగా, డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరినీ గోపాలపురంలోని తన నివాసానికి రావాలని స్టాలిన్ కబురు పెట్టడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన వారితో సమావేశమయ్యారు. మరోవైపు కరుణానిధి అనారోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఉదయం నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.