ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం వివధ రూపాల్లో జరుగుతుంది. సెలబ్రిటీలుగా పేరు ఉన్న వారు కూడా, ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్లో 'జబర్దస్త్' నటుడుకి సంబంధం ఉన్నట్టు, టాలీవుడ్ లింక్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మొన్నటి దాకా, టీవీ సీరియళ్లలో చిన్నచిన్న క్యారెక్టర్లు వేసుకునే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లకు పడగలెత్తాడు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా సంపాదించిన కోట్ల రూపాయాలతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు. పోలీసులు ఇతని కోసం స్పెషల్ టీంలు పెట్టి వేటాడటంతో, పోలీసులు నుంచి తప్పించుకోలేక లొంగిపోయాడు.
ఎర్రచందనం నిందితుడైన బుల్లితెర నటుడు హరి మంగళవారం తిరుపతిలోని టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్సు సీఐ మధుబాబు మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరానికి చెందిన హరి చిత్తూరు, తిరుపతి అర్బన్, టాస్క్ఫోర్స్ పరిధిలో 13 కేసుల్లో వాంటెడ్ నిందితుడని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా కంటే ముందు చోరీ కేసులో 4 నెలలు రిమాండులో ఉన్నాడని వివరించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్లతో సంబంధాలున్నాయని తెలిపారు. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన నగదును సినీరంగంలో ఫైనాన్స్ చేసేవాడన్నారు.
కాగా, టాస్క్ఫోర్సు ఐజీ ఎదుట లొంగిపోయే ముందు హరి మీడియాతో మాట్లాడాడు. 2014లో తన తల్లి అనారోగ్య పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రి వైద్యఖర్చుల కోసం ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డానని అంగీకరించాడు. ఇతను ఫైనాన్స్ చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణానంతర దశలో ఉన్నాయని తెలుస్తోంది.. అయితే మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. విచారణ జరిపి, వీరిని కూడా అరెస్ట్ చేతామని పోలీసులు అంటున్నారు.