మరో రెండు రోజుల్లో పార్లమెంటులో వర్షాకాల సమావేశాలు! ఈసారీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని టీడీపీ ప్రకటించింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని తెలుగుదేశం ఇప్పటికే సమీకరించింది. తీర్మానానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం. టీడీపీకి 15, తృణమూల్ కు 34, ఆమ్ ఆద్మీకి నలుగురు ఎంపీలున్నారు. వీరుకాక తెలుగుదేశం నుంచి గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన మల్లారెడ్డి, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. వీరుకాక కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, వామపక్షాలు, ఎన్‌సీపీ, ఆర్జేడీ తదితర పార్టీలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనున్నాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ నేత సుర్జేవాలా ఇప్పటికే ప్రకటించారు.
పార్లమెంటులో ఈసారి మరింత తీవ్రం, ఢీ అంటే ఢీ అనేలా పోరాడాలని టీడీపీ భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎంపీలను ఆరు బృందాలుగా విభజించి... కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలను కలిసే బాధ్యత అప్పగించారు. ఆయా పార్టీల నేతలకు స్వయంగా తాను రాసిన లేఖలను అందిస్తున్నారు. తెలుగుదేశం ఇప్పటికే 18 పార్టీల మద్దతు కోరిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాక ప్రత్యేక హోదాపై అఖిలపక్ష సమావేశంలో ప్రధానిని నిలదీయాలని, స్పీకర్ ఏర్పాటు చేసే సమావేశాల్లోనూ ప్రశ్నించాలని తెలుగుదేశం నిర్ణయించుకున్నట్లు ఈ వర్గాలు చెప్పాయి. ఈసారి ఎలాగైనా వర్షాకాల సమావేశాల్లో కార్యకలాపాలు చేపట్టేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 18 కొత్త బిల్లులను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది.
మరో పక్క, మంగళవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కానుంది. ఈ భేటీకి అన్ని పార్టీల నుంచి ఫ్లోర్‌లీడర్లు హాజరుకానున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు కేంద్రమంత్రులు, ఎంపీలకు విందు ఇవ్వడం ఆనవాయితిగా వస్తోంది. అందులోభాగంగా రేపు రాత్రికి ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. పార్లమెంట్ కార్యాలయం నుంచి ఇప్పటికే అన్నీ పార్టీల ఎంపీలకు ఆహ్వానం పంపారు. ప్రధాని ఇస్తున్న విందుకు వెళ్లబోమని టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహం తెగేసి చెప్పారు. స్పీకర్ ఏర్పాటు చేసే విందు, అల్పాహార సమావేశాలను బహిష్కరించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. మరి వైసిపీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డి, ఈ విందుకు వెళ్తారో లేదో తెలియదు.