కేంద్రమంత్రి గడ్కరీ, నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సందర్భంలో చంద్రబాబు పోలవరంతో పాటు, విజయవాడలో నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ పై కూడా నితిన్ గడ్కరీకి నివేదించారు. మాటలతో చెప్పటమే కాకుండా, లేఖ రూపంలో కూడా, ఫ్లై ఓవర్ విషయంలో ఎదురవతున్న ఇబ్బందులను గడ్కరీ ముందు ఉంచారు. కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులను పూర్తి చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే ఈ ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు. ఫ్లై ఓవర్ నిర్మిస్తున్న ప్రాంత పరిస్థితులు, భద్రత దృష్ట్యా ప్రాజెక్టులో ప్రతిపాదించిన డిజైన్ మార్పులు కూడా ఇంకా ఆమోదం చెప్పలేదని, అవి కూడా త్వరగా ఆమోదించాలని కోరారు. అలాగే నిధులు విషయంలో కూడా, జాప్యం జరుగుతుందని, త్వరగా నిధులు విడుదల చెయ్యలని కోరారు.
ప్రాజెక్ట్ ఖర్చులో పెట్టాల్సిన దానికంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పెట్టింది అని, త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని రకాల మద్దతు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, కేంద్రం కూడా సహకరించాలని కోరారు. ఒక పక్క నిధులు ఇవ్వక, మరో పక్క డిజైన్ లు ఆమోదం లభించక, ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుందని అన్నారు. కృష్ణా తూర్పు కాల్వ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు చేపట్టవలసిన అప్రోచ్ పోర్షన్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.19.07 కోట్ల నిధులను రాష్ట్రాభివృద్ధి పథకం కింద కేటాయించిందని, ఆ డబ్బులు రాష్ట్రానికి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో, కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు.
ఫ్లై ఓవర్ నిర్మాణం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని సోమా కనస్ట్రక్షన్ సంస్థ ఎండీ హామీ ఇచ్చారు. వచ్చేఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీనికి జనవరి 26కు అవకాశం ఇవ్వాలని ఎండీ కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం 70శాతం పనులు పూర్తయ్యాయి. 62 శాతం బిల్లులు చెల్లించారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర మంత్రితో ఇబ్బందులు చెప్పటం, లేఖ కూడా రాయటంతో, ఇప్పటికైనా ఈ ఫ్లై ఓవర్ కు ఇబ్బందులు తొలగి, త్వరతిగతిన పూర్తవుతుందని ఆశిద్దాం...