ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా పరకాల ప్రభాకర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు నొచ్చుకుని, చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో, పరకాల ఆ పదవికి రాజీనామా చేసి, దూరంగా ఉంటున్నారు. దాదాపు పరకాల ప్రభాకర్ నాలుగేళ్ళ పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఈ నేపధ్యంలో, ఆయన అమరావతి నుంచి వెళ్ళిపోయి, హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో, పరకాల ప్రభాకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయం పై ఊహాగానాలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ప్రభాకర్ రాజకీయ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఇటు ఆయన ఆనుచరులతో పాటు ఇతర పార్టీల్లోనూ ఆసక్తికరమైన చర్చ నెలకొంది.
పరకాల ప్రభాకర్ ఫ్యామిలీ అంతా రాజకీయలతో ముడి పడి ఉంది. గతంలో పరకాల కుటుంబానికి నరసాపురంలో రాజకీయపరంగా ఎంతో పట్టు ఉంది. ఇప్పటికీ ఆయన కుటుంబం పై, అక్కడ మంచి పేరు ఉంది. పరకాల ప్రభాకర్ తండ్రి శేషావతరం రెండు సార్లు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. పరకాల ప్రభాకర్ తల్లి కాళికాంబ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రభాకర్ సతీమణి నిర్మలా సీతారామన్ కేంద్ర కేబినెట్లో కీలక పదవి నిర్వహిస్తున్నారు. ఆమె నరసాపురంలోని తూర్పుతాళ్ళు, పీఎంలంక గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఇటు ప్రభాకర్ కూడా ప్రభుత్వ సలహాదారు హోదాలో సీతారాంపురం గ్రామానికి దత్తత తీసుకుని అభివృద్ధి చేపట్టారు.
అయితే ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన తరువాత మౌనం వహించారు. తన భవిష్యత్ రాజకీయాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. నాలుగేళ్ళ కాలం నుంచి ఆయన పార్టీలకు దూరంగా ఉంటూ సీఎం సలహాదారుడిగా వ్యవహరించారు. ఈనేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభాకర్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా.? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో ప్రభాకర్ నరసాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒకసారి స్వల్ప మెజార్టీతో ఓటమి చెందారు. ఇక కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఆపార్టీ తరుపున పోటీ చేశారు. ఆ తరువాత ఉభయగోదావరి జిల్లాలా ఎమ్మెల్సీ స్ధానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.