అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఎవరెవరికి, ఎంతెంత చెల్లిం చాలో వివరాలు ఇచ్చేలా అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించాలని సుభాష్ చంద్ర ఫౌండేషన్ కు చెందిన జీఎస్సెల్ గ్రూపు హైకోర్టును అభ్యర్థించింది. మార్చి , 2018 వరకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిల వివరాలను సమర్పించేలా అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించాలని జీఎస్సెల్ కోరింది. రెండు రాష్ట్రాల్లోని డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము వివరాలను సమర్పించేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించాలని అభ్యర్థించింది. ఆదాయపు పన్ను తగ్గించిన వ్యవహారంలో కంపెనీకి సంబంధించిన పన్ను వివరాలను ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించాలని కూడా జీఎస్సెల్ గ్రూపు అభ్యర్థించింది. ఈ మేరకు జీఎస్సెల్ గ్రూపు తరఫు న్యాయవాది ధర్మాసనం ముందు ప్రమాణపత్రం దాఖలు చేశారు.
ఉమ్మడి హై కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్ లతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరిపింది. తదుపరి విచారణ జులై 23కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ కంపెనీ చెల్లించాల్సిన పన్నును ఆదాయ పన్ను శాఖ రూ.1000 కోట్ల నుంచి రూ.700 కోట్లకు తగ్గించినందువల్ల పన్ను రాయితీ ఇవ్వాలంటూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని దర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులను పరిశీలించేందుకు జీఎస్సెల్ గ్రూపునకు ఇంతకు ముందే అనుమతించినట్లు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది 32 లక్షల మంది డిపాజిటర్లకు సంబంధించిన వ్యవహారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీల ఖర్చును ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 22 ఆస్తుల జాబితాను సమర్పించారు. ఈ 22 ఆస్తుల మార్కెట్ విలువ, సబ్ రిజిస్ట్రార్ విలువ వివరాలను సమర్పించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. అలాగే తెలంగాణ లో ఉన్న ఆస్తులను వేలం వేసేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటుచేసింది. నల్గొండ, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న ఆస్తులను గుర్తించేందుకు ఆ కమిటీలను ఏర్పాటు చేసింది. తదుపరి విచారణ జులై 23కి వాయిదా వేసింది.