నవ నిర్మాణ దీక్ష ఏడు రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామదర్శిని, గ్రామ సభలు రెండవరోజు 13 జిల్లాలలో ఉత్సాహభరితంగా సాగాయి. నవ నిర్మాణ దీక్ష ఏడు రోజుల కార్యక్రమాల్లో ఆదివారం నాడు ‘నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం’ అనే అంశంపై గ్రామసభలలో చర్చలు నిర్వహించారు. నీరు-చెట్టు, నీరు-ప్రగతి, చెక్ డ్యాములు, పంట కుంటలు, నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టు, ప్రాధాన్యక్రమంలో పూర్తిచేస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, భూగర్భ జల సంరక్షణ, తాగునీరు, తుఫాన్లు, కరవు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ గ్రామసభలలో ప్రజలకు అవగాహన కల్పించేలా చర్చలు సాగాయి.
జల వనరులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పురపాలక-పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు, కార్యదర్శులు, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదికలు అందాయి. నేడు వ్యవసాయం-అనుబంధ రంగాలపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, గ్రామదర్శిని కార్యక్రమాలను నిర్వహిస్తారు. 13 జిల్లాల్లోని మొత్తం 9,876 గ్రామాలలో ఆదివారం గ్రామదర్శిని కార్యక్రమం విజయవంతంగా సాగినట్టు సమాచారం.
19,33,967 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాసాధికార సర్వేలో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు 6,770 మంది అభ్యర్ధనలు అందించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి 8,917 ప్రారంభోత్సవాలు, 3,810 శంకుస్థాపనలు జరిగాయి. 3,86,539 మందికి గ్రామసభలలో పెన్షన్లు అందించారు. 48,481 కొత్త రేషన్ కార్డులను అందించారు. కొత్తగా 36,572 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. గ్రామసభలలో విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలను జరిపారు. 3,450 ఎగ్జిబిషన్లను నిర్వహించారు.