బెంగళూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరుకు వెళ్లిన ఆయన.. తన పిలుపు మేరకు ఇక్కడ భాజాపాకు వ్యతిరేకంగా ఓటు వేసిన తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బెంగళూరుకు చేరుకున్న చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనస్వాగతం పలికారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు ఈ బెంగళూరు పర్యటన అవకాశంగా మలచుకోవాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం భాజపాయేతర పక్షాలను ఇందుకు అనుకూలంగా మద్దతు కోరారు.
బెంగుళూరులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని బహుజన సమాజ్ వాద్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిని, సిపిఐ, సిపియం జాతీయ నేతలను, ఆకలీ దళ్ అధినేతను, కలిసి పరిస్థితిని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో పరిణామాలు, భాజపా కుట్ర రాజకీయాలను ఆయా నేతల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను ఆయా నేతలు చంద్రబాబుకు వివరించారు. ప్రాంతీయ పార్టీలన్నీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని మమతాబెనర్జీ బాబుతో అన్నట్లు సమాచారం.
రాష్ట్రాల హక్కులను హరించేలా 15వ ఆర్థికసంఘం సిఫార్సులు ఉన్నాయన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై కేజ్రీవాల్, మమత ఏకీభవించారు. 1971 జనాభా లెక్కలపై వారు చర్చలు జరిపారు. కర్ణాటక పరిణామాలే ఇందుకు నాంది కావాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరం ఉందని మాయావతి ప్రస్తావించినట్లు సమచారం. జాతీయ స్థాయిలో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అంశం నేతల భేటీల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో పక్క పశ్చిమబెంగల్ సీఎం మమత బెనర్జీ, భారతీయ జనతాపార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి అవసరమని, కూటమిని ఏర్పాటు చేయాలని ఏపీ చంద్రబాబుకు సూచించారు.