‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర ముగిసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా, విలేకరులు అడిగిన ప్రశ్నకు, చంద్రబాబు చెప్పిన సమాధానం ఆసక్తి కలిగించింది... సిబిఐ మాజీ జేడీ లక్ష్మీ నారయణ, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, ఆయన మీ పార్టీలో చేరతారు అనే ప్రచారం జగుతుంది, దీనికి మీ సమాధానం చెప్పండి అని చంద్రబాబుని అడగగా, ఆయన నవ్వుతూ సమాధానం చెప్పారు.. ఇవన్నీ ఊహాగానాలు అని, ఊహాజనిన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తాం అంటూ, నవ్వుతూ చంద్రబాబు చెప్పారు... చంద్రబాబు చెప్పిన విధానం చూస్తుంటే, లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరతారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి...
మరో పక్క, తన పాదయాత్ర విశేషాలు చంద్రబాబు నెమరు వేసుకున్నారు... అయుదు సంవత్సరాల క్రితం, అనంతపురం జిల్లా హిందూపురంలో అక్టోబర్ 2న పాదయాత్ర ప్రారంభించి, సరిగ్గా ఇదే రోజున విశాఖలో ముగించామని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు ఎంతో పవిత్ర భావంతో, పాదయాత్ర చేశానని, పాదయాత్ర చేపట్టక ముందు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, కాంగ్రెస్ పరిపాలన ఎంతో దారుణంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు... పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశామని చంద్రబాబు అన్నారు. అప్పట్లో వృద్ధులకు కేవలం రూ.200 మాత్రమే పెన్షన్ ఇచ్చేవారని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 47 లక్షల మందికి వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చేదని, నిరంతర విద్యుత్ కోతలు ఉండేవని చెప్పారు.
పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచామని, డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేశామని, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెప్పారు. పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీటిని కృష్ణాకు తీసుకొచ్చామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు, రైతు, డ్వాక్రా రుణమాఫీ చేశామన్నారు. విభజన గాయాలు ఎన్ని ఉన్నా సొంత కష్టంతో నాలుగేళ్లుగా ఎదుగుతూ వచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజలకు ఎక్కడా ఇబ్బందిలేని పాలన ఇచ్చామని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే అభివృద్ధిలో ఇంకా ముందుకు వెళ్లేవాళ్లమని వివరించారు. ఉద్యోగాల నుంచి రిటైర్డయిన కొందరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై పుస్తకాలు రాస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు.