ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అములు కోసం తెలుగుదేశం పార్టీ ఏంపీలు చేస్తున్న ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు... హోదా సాధనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని మోదీ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు... ఈ విషయం తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్ పీఎస్‌కు వెళ్లి ఎంపీలను పరామర్శించి.. సంఘీభావం ప్రకటించారు. టీడీపీ న్యాయపరమైన డిమాండ్లకు మద్దతిస్తున్నానని తెలిపారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నవారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కేజ్రీవాల్. కనీసం ఎంపీలన్న గౌరవం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.
ఎంపీల ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని మరోమారు స్పష్టం చేసిన కేజ్రీవాల్, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రధాని మోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నా తర్వాత ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ నివాసం దగ్గర నుంచి బస్సులో తరలించి... తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ నేరుగా పీఎస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీలను పరామర్శించిన ఆయన... వారికి సంఘీభావాన్ని తెలిపారు.
కాగా ఈ రోజు ఉదయం రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఎంపీలు.. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీంతో అక్కడికి చేరుకున్న కేజ్రీవాల్ ఎంపీలతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు.