తెలుగుదేశం పార్టీ, కేంద్రం పై తీవ్రమైన పోరుకు సిద్ధమైంది... ఈ రోజు ఉండవల్లిలో జరిగిన టీడీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు... ముందుగా అన్ని విషయాలు విశ్లేషించి, నిన్న అమిత్ షా తో జరిగిన మీటింగ్ గురించి కూడా చర్చించి, ఇక బీజేపీ రాష్ట్రానికి ఏమి చెయ్యదు అని కంక్లుజన్ కు వచ్చారు... అందుకే, ఇక బీజేపీ పై జాతీయస్థాయి పోరాటానికి సిద్ధమైంది తెలుగుదేశం. విభజన హామీలపై దేశంలోని వివిధ పార్టీలకు లేఖలు రాయాలని టీడీడీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, ఆనాడు ప్రధాని పార్లమెంట్ ఉభయసభలో ఇచ్చిన హామీలతోపాటు ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, వాటన్నిటిపై జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలకు కూడా లేఖలు రాయాలని నిర్ణయించారు.
అయితే, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరో ఆసక్తికర విషయం బయట పెట్టారు.. గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ... అవసరమైతే విభజన హామీలపై కోర్టుకు కూడా వెళతామని అన్నారు. ఫైనాన్స్ బిల్లులో సవరణలు చూశాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు... దీంతో బిల్ లో పెట్టిన అంశాలు నాలుగేళ్ళు అయినా, కేంద్రం పట్టించుకోలేదు అంటూ, కోర్ట్ మెట్లు కూడా ఎక్కటానికి చంద్రబాబు వెనుకాడటం లేదు... ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి చట్ట సభల్లో ఇచ్చిన హామీలు, పార్లమెంట్ ఆమోదించిన చట్టం, నాలుగేళ్ళు అయినా ముందుకు కదలలేదు అని, కేంద్రం పై కోర్ట్ కు వెళ్ళే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు..
మరో పక్క ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ, ఏపీ వ్యవహారం జాతీయ సమస్యగా మారిందని, నిర్ణయాలు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు.. గురువారం జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో జరిగిన సమావేశంలో చూస్తామన్నారే తప్ప .. ఏదీ స్పష్టంగా చెప్పలేదన్నారు. ‘‘2018 బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలిపాం. మా నిరసనల ద్వారా కేంద్రం స్పందించి.. ఏపీ హక్కులపై నిర్ణయాలు తీసుకుంటుందని మేము భావించాం. లోక్‌సభ, రాజ్యసభలో చెప్పిన మాటలనే మళ్లీ, మళ్లీ చెప్పారే తప్పా... కొత్తగా ఏపీ హక్కులపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం రాలేదు. ఇక బీజేపీతో తెల్చుకోవటమే’’ అని రామ్మోహన్నాయుడు స్పష్టం చేశారు.