కరువే... అనంతను చూసి భయపడేలా చేస్తానని జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ హామీని నెరవర్చేలా.. జల కల సాకారం అయ్యేలా జిల్లాకు వీలైనంత నీటిని తొసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు... ఆ ప్రయత్నాల ఫలితమే, ‘‘అనంత... ‘జలకళ’లాడుతోంది... తుంగభద్ర ఎగువ కాలువ (టీబీ హెచ్చెల్సీ), హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టులు కల్పతరువులా మారాయి. జిల్లా దాహార్తి తీర్చడమే కాదు.. అన్నదాత మోమున వెలుగులు నింపాయి. ఏటా కనుచూపు మేర బీడు భూములే కన్పించేవి.. నేడు దశదిశలా పచ్చదనం వెల్లివిరుస్తోంది.
మూడేళ్ల తర్వాత మళ్లీ ఆశించిన మేర నీరు జిల్లాకు చేరడం శుభ పరిణామం. అన్ని ప్రాంతాలను ఆదుకోవాలనే ప్రభుత్వ ముందుచూపు.. జల నిర్వహణ.. నీటి పంపిణీలో పారదర్శకతతో సాగుకు జీవం వచ్చింది.... ఈ సందర్భంగా, ఈ ఏడాది ఉగాదికి, రైతులకి కానుక ఇస్తాము అంటుంది ప్రభుత్వం... ఎన్నో ఏళ్లుగా నీరు లేక ఎండిపోయిన చెరువులకు వేసవి కాలంలో హంద్రీ నీవా నీరు అందిస్తుండటంతో రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని, ఏపీ ప్రభుత్వం రైతులకిచ్చే ఉగాది కానుక ఇదేనని శాసనమండలి చీఫ్ విప్, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద హంద్రీ నీవా ప్రధాన కాలువ నుంచి లేదారు చెరువుకు ఈరోజు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎండిపోయిన చెరువులకు హంద్రీనీవా నీటిని అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబునాయుడుదేనని ప్రశంసించారు. లేదారు చెరువుకు నీటిని విడుదల చేయడం ద్వారా నాలుగు గ్రామాలు సస్యశ్యామలం కానున్నాయని, పామిడి మండలంలోని చెరువులకు కూడా నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దశల వారీగా అన్ని చెరువులకు నీరందించే ప్రణాళికలు పూర్తి చేసినట్టు పయ్యావుల కేశవ్ తెలిపారు.