నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాదు. కనీసం ఆ పార్టీ సభ్యుడిని కాదు. ఒక వ్యక్తి నెలకొల్పిన ప్రాంతీయ పార్టీల్లో సిద్ధాంతాలు , వ్యవస్థ అనేది నేను నమ్మను. అంతే కాదు జాతీయ పార్టీల్లో కూడా వ్యక్తి స్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యం ఉంటుంది అని నేను అనుకోను. పదేళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ లో సోనియా స్వామ్యమే తప్ప సిద్ధాంతాలు ఎక్కడున్నాయి. కాస్తో కూస్తో బిజెపి మీద ఆ గౌరవం ఉండేది. కానీ మోడీ , షా లని చూసాక బిజెపి కూడా వ్యక్తిస్వామ్య వ్యవస్థే అని అర్ధం అయ్యింది. అందుకే ఎవరన్నా పార్టీ సిద్ధాంతం అంటే నవ్వొస్తుంది.ఏ పార్టీ అయినా ఆ పార్టీ వ్యవస్తాపకుడు లేదా అధ్యక్షుడి ఆలోచనలతో, సిద్ధాంతాలతో నడుస్తుంది. అందుకే నేను వ్యక్తులనే నమ్ముతాను , వాళ్ళ సిద్ధాంతాన్ని, కమిట్మెంట్ ని ఆరాధిస్తాను. ఎన్టీఆర్ గురించి తెలుసుకునే వయసొచ్చే లోపే ఆయన వెళ్లిపోయారు. నాకు ఊహ తెలిసాక పేపర్ లో రాజకీయ వార్తలు చదవటం అలవాటు అయ్యాక నాకు తెలిసిన నాయకుడు చంద్రబాబు. నాకిష్టమైన నాయకుడు చంద్రబాబు. నా దృష్టి లో వ్యక్తి తలుచుకుంటే వ్యవస్థ ని మార్చగలడు, లేదా తానే ఒక వ్యవస్థగా మారగలడు. అలాంటి వ్యవస్థ చంద్రబాబునాయుడు.
దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ , పారిశ్రామిక వేత్తలతో భేటీ , రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని ఆహ్వానం. ఇలా అన్నీ హెడ్లైన్స్ చూసి ఓహో అనుకుంటాం.ఆ వార్త తాలూకు 2 నిమిషాల వీడియో చూసి ఓకే అనుకుంటాం. ఆ వార్తలు చూసి అధికార పార్టీ వాళ్ళు జబ్బలు చరుచుకుని ఆనందపడిపోతే , విపక్షాలు పెదవి విరుస్తాయి, డబ్బులు దాచుకోవటానికి విదేశాలకి వెళ్లాడని పనికిమాలిన ఆరోపణలు చేస్తుంటాయి. ఇక ఘనత వహించిన మీడియా నిర్వహించే పనికిమాలిన చర్చల్లో పైసాకి కొరగాని వాళ్లంతా కూర్చుని అసలు పోయినేడాది ఎన్ని పెట్టుబడులు వచ్చాయి , వచ్చినవన్నీ ఏమయ్యాయి అంటూ వీళ్ళ అబ్బ సొమ్మేదో ఇచ్చినట్లు లెక్కలు అడుగుతుంటారు. మొన్న ఫిబ్రవరి 8 న చంద్రబాబు దుబాయ్ పర్యటనని అతి దగ్గరగా చూశాక మనం టీవీ లోనో పేపర్ లోనో చూసే విషయాలకి, నిజంగా అక్కడ జరిగే వాటికి చాలా తేడా ఉంటుంది అని అర్ధం అయ్యింది. ఆ ముందు రోజే గాలి ముద్దుకృష్ణమ నాయుడి మరణం , ఆయనకి నివాళులర్పించటానికి ఉదయం బయలుదేరి విజయవాడ నుండి తిరుపతి , అక్కడినుండి హైదరాబాద్ మళ్ళీ అక్కడినుండి దుబాయ్ చేరేసరికి అర్ధరాత్రి ఒంటిగంట అయ్యింది.
18 గంటలపాటు ప్రయాణించిన అలసటని ముఖం మీద చిరునవ్వుతో కప్పేసి వచ్చినవారందరినీ పలకరించి , ఏ మాత్రం చిరాకు లేకుండా ప్రతి ఒక్కరితో ఫోటో దిగారు. అక్కడినుండి హోటల్ కి వెళ్లి పడుకునేటప్పటికి 3 గంటలు అయ్యింది. మళ్ళీ పొద్దునే 7 గంటలకల్లా రెడీ. ఎమిరేట్స్ ఆఫీస్ కి వెళ్లి వారి తో రాష్ట్రంలో పెట్టుబడులకోసం ఒప్పందం. మళ్ళీ తనని కలవటానికి హోటల్ కి వచ్చిన వారితో ముఖాముఖి. సాయంత్రం 4 గంటలకల్లా బిజినెస్ లీడర్స్ ఫోరం లో పెట్టుబడిదారులతో సమావేశం. సమావేశం అనే కంటే 70 సంవత్సరాల వయసున్న ఒక సేల్స్ మాన్ తన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని 2 గంటలపాటు నిలబడి 24 స్లైడ్స్ ని ప్రదర్శించి అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవకాశాలని లెక్కలతో సహా వివరించి తనను నమ్మమని, మీకు భవిష్యత్తు ఉంటుందని వాళ్ళని ఒప్పించటం. ఆయన ప్రసంగం మొదలు పెట్టిన తర్వాత ఆయన్ని దగ్గరగా చూద్దామని స్టేజి పక్కనే నిలబడ్డాను. ఒక అరగంటకే నేను నిలబడలేక నా కుర్చీలోకి వెళ్లి కూర్చున్నాను. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ బడా పారిశ్రామిక వేత్తలు. తమ ముందు నిలబడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో లేక ఆర్ధిక వేత్తో తెలియక ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు.
బాబు అంటే ఏంటో ముందే తెలిసున్న దుబాయ్ పారిశ్రామిక దిగ్గజాలు బి ఆర్ శెట్టి , రాం బుక్సాని మాత్రం దటీజ్ బాబు అన్నట్లు గర్వంగా కూర్చున్నారు. తన ప్రసంగం అయ్యాక ఇన్వెస్టర్లు అడిగిన ప్రతి సందేహానికి నిలబడే సమాధానమిచ్చారు. తరువాత మళ్ళీ పైకెళ్ళి రూమ్ లో ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులతో విడి సమావేశాలు. అక్కడే భోజనం, మరో పక్క ఆరోజు పార్లమెంట్ లో పోరాటంపై టెలికాన్ఫరెన్స్. రూమ్ బయట అభిమానుల నిరీక్షణ. 9.50 కి మళ్ళీ ఫ్లైట్ , కనీసం 8. 30 గంటల కల్లా బయలుదేరాలి. ఒకపక్క నిద్రలేక ఆవలింతలు. రూమ్ నుండి బయటకి రాగానే మళ్ళీ అభిమానులతో ప్రేమపూర్వక కరచాలనం అందరితో సేల్ఫీ లు. ఒక పక్క సెక్యురిటీ వారిస్తున్నా అందరితో మాట్లాడి ఎయిర్పోర్ట్ కి పయనం. ఆయనని ఇంత దగ్గరగా చూశాక అసలు ఈయన మనిషేనా లేక మెషినా అనిపించింది.
ఆ వేదిక మీద చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు నేను ఆయన్నే చూస్తుండిపోయాను. అసలు ఆ స్థానంలో ఇంకెవర్నీ ఊహించటానికి కూడా నాకు మనసు రాలేదు.ఒక ముఖ్యమంత్రి సామాన్య వ్యక్తి లాగే నిలబడి రాష్ట్ర స్థితిగతులని వివరించటం ఎక్కడన్నా జరిగిందా ? ఈ వయసులో కనీసం కూర్చుని అరగంట మాట్లాడలేని ముఖ్యమంత్రులున్నారు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటో , ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో కనీస అవగాహనా లేని కుహనా మేధావులంతా టీవీ లలో చేరి బాబుగారు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అని ఉచిత సలహాలు ఇస్తుంటారు. మొన్నా మధ్య ఆయన చెయ్యి నొప్పిగా ఉందని చెప్తే ఆఖరికి ఆ వీడియో ని కూడా కామెడీగా చిత్రీకరించారు. ఆయనలా ఒక్కరోజు కాదు, ఒక్క గంట కాదు, ఒక్క నిమిషం కూడా బతకలేరు, ఇట్స్ మై ఛాలెంజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన్ని అందరూ CEO of Andhra Pradesh అనేవారు.
కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కి ఆయన సీఈఓ కాదు. నవ్యఆంధ్ర నిర్మాణానికి రాళ్లు ఎత్తుతున్న ఒక కూలీ.ఈ క్రమంలో ఆయన మీద రాళ్లు పడుతున్నాయి. మీరు సాయం చేయకపోయినా పరవాలేదు. పనిచేసేవాడిమీద పస లేని విమర్శలు చెయ్యకండి. జెపి లాంటి మేధావి కూడా ఈ క్లిష్ట సమయం లో బాబు లాంటి వ్యుహకర్త మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలడు అని పవన్ కళ్యాణ్ తో అన్నారంటే నే అర్ధం చేసుకోవచ్చు. బాబు బతికున్నంతవరకు ఈ రాష్ట్రానికి మరో ప్రత్యామ్నాయ నాయకుడు లేడు, రాడు. నేను ఆయన్ని ఇది నాలుగోసారి కలవటం, ముందు కలిసిన మూడుసార్లు కేవలం ఫోటో దిగాలనే ఆరాటం ఉంది. ఈసారి మాత్రం ఆయనేమిటో ప్రపంచానికి చూపించాలనే ఆరాటం తప్ప ఫోటో దిగాలన్న కోరిక కాని , ఆ ఆలోచన కాని రాలేదు.