కడపలో కృష్ణమ్మ సవ్వడి కనువిందు చేస్తోంది.. గండికోటలో శ్రీశైల జలం కళకళలాడుతోంది. రాయలసీమ జిల్లాల గుండెకోటగా పేరొందిన గండికోట జలాశయంలోకి చరిత్రలోనే తొలిసారిగా 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మొత్తం 26.84 టీఎంసీల నిల్వసామర్థ్యం ఉన్న ఈ జలాశయంలో ఇప్పటివరకు 3-5 టీఎంసీల లోపు మాత్రమే నీటిని నింపగలిగారు. అదీ ట్రయల్‌రన్, పైడిపాళెం ఎత్తిపోతల పథకం కోసం నిల్వచేశారు. ఇప్పుడు తొలిసారిగా గండికోటలోకి కృష్ణాజలాలను పారిస్తూ.. వాటిని పరిసర జలాశయాలకూ పంపిణీ చేస్తున్నారు.
అధికారుల లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు గండికోటలోకి 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇక్కడి నుంచి ప్రస్తుతం మరో నాలుగు జలాశయాలకు పంపిణీ జరుగుతోంది. కడప-అనంత సరిహద్దున ఉన్న చిత్రావతి జలాశయంలోకి 960 క్యూసెక్కుల చొప్పున పంపిస్తున్నారు. సీబీఆర్‌కు 2 టీఎంసీల నీరు చేరింది. పైడిపాళెం జలాశయంలోకి నాలుగు మోటార్ల ద్వారా 680 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. మైలవరం జలాశయంలోకి 5 టీఎంసీల నీరు చేరింది. వామికొండకు 200 క్యూసెక్కులు వెళుతుండగా.. సర్వరాయసాగర్‌కు 0.29 టీఎంసీల నీరు విడుదల చేసేందుకు సమాయత్తమయ్యారు.
గండికోటలోకి ప్రభుత్వం 12 టీఎంసీల నీరు తెచ్చేందుకు సంకల్పించింది. ఇప్పటి వరకు చరిత్రలోనే తొలిసారిగా 8.25 టీఎంసీల నీరు వచ్చి చేరింది. రాయలసీమలో కరువును తరిమి కొట్టాలని భీష్మ ప్రతినబూని అహర్నిశం శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పానికి నిదర్సనం ఇది. జలయజ్ఞం అంటే ఏంటో ఇపుడు గండికోట చెబుతోంది.. జలయజ్ఞం పేరుతొ దోచినోళ్ల పాపాలు తుడిచిపెట్టేలా... కరువు కడపలో పచ్చదనం చిగుళ్లు తొడిగేలా... వికృత రాజకీయం చెల్లాచెదురయ్యేలా ప్రవాహం పోటెత్తుతోంది... పులివెందుల బ్రాంచ్ కెనాల్ తో మొదలు గండికోట ఘనచరిత్ర సృష్టిస్తోంది.