నీలి మేఘాలలో తేలుతూ.. అరకు లోయల్లోని అందాల చూస్తూ...మంచు దుప్పట్లను.. పిల్లగాలి తిమ్మెరలను చీల్చుకుంటూ.. విహరిస్తూ వీక్షిస్తే...? ఆ ఆనందమే వేరు.. ఆ అనుభూతే వేరు.. మంగళవారం నుంచి విశాఖ జిల్లా అరకులోయలో ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకంగా అరకు లోయను మరింత గుర్తింపు తెచ్చేందుకు ఈ అంతర్జాతీయ బెలూన్ల పండగకు శ్రీకారం చుట్టింది....
బెలూన్ ఫెస్టివల్‌కు 13 దేశాల నుంచి వచ్చిన 16 బృందాలు వచ్చాయి... ప్రదర్శన ఇవ్వనున్న పైలట్లతోపాటు వారి బృందాలకు, జాతీయ మీడియాకు అరకులోయలోని అతిథిగృహాల్లో వసతి కల్పించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లు ఈ-ఫాక్టర్స్ ఎండీ సమిత్ గార్గ్, ప్రోగ్రాం మేనేజర్లు అర్ఫాన్ చౌదరి, రుషి ఆధ్వర్యంలో సాగాయి... ప్రదర్శన సమయం: ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు.. సాయంత్రం 6.30 నుంచి 8 గంటల వరకు... విహరించే అవకాశం: ఈ వేడుకను అందరూ చూడొచ్చు.. వచ్చిన ఎంట్రీల్లో డ్రా తీసి రోజుకు 300 మందికి ఎగిరే అవకాశం కల్పిస్తారు. స్థానిక గిరిజనులకు కొందరికి విహరించే వీలు కల్పించనున్నారు...
బెలూన్ ఫెస్టివల్ సూర్యోదయ వేళ మంచుతెరలు.. చల్లగాలులు.. మేఘాల నడుమ ఆహ్లాదకరంగా సాగితే.. సాయంత్రం వేళ కనువిందుచేసే విద్యుత్తు వెలుగులు.. వినసొంపైన సంగీతం, బర్నర్ల నుంచి నిప్పుల వెలుగుల నడుమ ప్రదర్శన సాగనుంది. దక్షిణ భారతదేశంలో అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ నెల 16వ తేది వరకు ఈ ఫెస్టివల్ సాగనుంది... రెండేళ్ల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో, గతేడాది కర్ణాటకలోని హంపి, మైసూర్, బీదర్‌లలో ఆయా రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు ఈ ఫెస్ట్‌ను నిర్వహించాయి...