బిల్ గేట్స్ మిరండా ఫౌండేషన్ అధ్వర్యంలో విశాఖపట్నంలో ఆగ్రో టెక్నాలజీ ఏర్పాటు చేసేందుకు 200 కోట్ల రూపాయలు మంజూరు చెయ్యటానికి అంగీకరించింది. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 15 నుంచి 17 వరకు సదస్సు ఏర్పాటు చేసిందని, ఈ సదస్సుకు బిల్ గేట్స్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వల్లభనేని దామోదర నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మెగా సీడ్ పార్కుకి 630 ఎకరాల్లో పరిశోధనలకు గానూ 670 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. దీనికి దిలీప్ కుమార్ నాయకత్వం వహిస్తారన్నారు. మేలైన యాజమాన్య పద్ధతుల్లో ఈ పార్కులో పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అన్ని పంటలపై జరుగుతున్న పరిశోధనలను ఆయన స్వయంగా పరిశీలించి విలేకరులతో మాట్లాడారు.
లిక్విడ్ బయో ఫార్మింగ్ కు రెండు కోట్ల సాయిల్ బయో ఫెర్టిలైజర్స్ కోసం 70 లక్షలు కేటాయించిందన్నారు. ప్రీమియం పోస్టు హారెస్ట్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు అనకాపల్లి పరిశోధన స్థానంలో నాబార్డు నుంచి నాలుగుకోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఆర్గానిక్ ఫాం 3.5 ఉందని, దీనిని 0.5 శాతానికి తీసుకురావలసి ఉందన్నారు. నానో టెక్నాలజీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనా జింక్ వాడకం కూడా తగ్గించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఎకరాకు 20 కిలోలు జింక్ వాడుతున్నారని, ఇప్పుడు గ్రాముల్లో జింక్ వాడకాన్ని తీసుకురావలసి ఉందన్నారు. రైతులు పంటలపై పెట్టే పెట్టుబడులను తగ్గిస్తే లాభాల బాటలో నడవాలంటే ఆత్యాధునిక సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టబాటు ధర లేనప్పుడు దాచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో 19 పాలీటెక్నికల్ కళాశాలలు ఉన్నాయని, ఆలాగే 79 ప్రైవేట్ పాలిటెక్నికల్ కళాశాలలు ఉన్నాయన్నారు. ప్రతీ ఏడాది నాలుగు వేల మంది విద్యారులు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదివి ఉత్తీర్ణులవుతున్నారని, వీరందరికీ ఉద్యోగావకాశాలు కల్పించే వీలు లేనందున వారు స్వశక్తిగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ప్రభుత్వం కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అనకాపల్లి డాట్ సెంటర్లో రైతులకు సలహాలిచ్చేందుకు ఎప్పుడూ శాస్రవేత్తలు అందుబాటులో ఉంటారని చెప్పారు.