ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనమిక్ పోరమ్ ఆహ్వానం పై ఇండియా ఎకనమిక్ సమ్మిట్-2017 లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు. గురువారం న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సులో 'పౌష్టిక ఆహార వ్యవస్థ" అనే అంశం పై ఇంటరాక్టివ్ ప్యానెల్ సెషన్లో ఉపన్యాసించనున్నారు.

సిఐఐ సహకారంతో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశవిదేశాల ప్రతినిధులు హాజరవుతున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం భవిష్యత్ తరాలకు ఆహార భద్రత , వ్యవసాయం అనే అంశం పై చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి, రాయిటర్స్ మార్కెట్ లైట్ వ్యవస్థాపకులు అమిత్ మెహ్ర, నెస్లే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ, యుపిఎల్ లిమిటెడ్ సిఇవో జైష్రాఫ్, ఐడిఎఫ్సి సిఇవో రూబెన్ అబ్రహం తదితర ప్రముఖులు సదస్సులో పాల్గొంటున్నారు..

ఆహార ර రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, మాంసం ఉత్పత్తుల నుంచి మొదలుకుని సాధారణ ఆహారం, సాంకేతిక పరిష్కరాలు తదితర అంశాల పై సదస్సులో లోతుగా చర్చిస్తారు. ఈ రంగంలో సాంకేతిక ఉన్న అవకాశాలు, కొత్త వ్యాపార అవకాశాలు, రూపొందించాల్సిన విధానాలు, తదితర అంశాలపై దృష్టిసారిస్తారు.

ఆహర పౌర సరఫరాల రంగంలో సాంకేతిక పరిజానాన్ని ఉపయోగించడంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. ప్రత్యేకించి రేషన్ దుకాణాల్లో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్, రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేయడంలో ప్రభుత్వం గణనీయ ఫలితాలు సాధిస్తోంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో తొలి త్రైమాసిక ఫలితాల్లో 27.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. వ్యవసాయ రంగానికి ఊపనిచ్చేందుకు నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ అంశాలన్నింటిని సీఎం చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహిస్తున్న పలు సదస్సులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. వ్యాపార రంగంలోని దిగ్గజాలతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడుల అవకాశాల పై ప్రపంచ వేదికల పై ప్రస్తావిస్తూ ప్రగతికి బాటలు వేస్తున్నారు.

‘రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు జలవనరులే అతిపెద్ద ఆకర్షణ కానున్నాయి. అందుకు తగ్గట్టుగా అంతర్జాతీయస్థాయి జలక్రీడలకు అనువైన వాతావరణాన్ని అమరావతిలో కల్పించాలి. పర్యాటకం, వినోదం, క్రీడలకు అమరావతి చిరునామాగా మలచాలి’-అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘ఎఫ్1 హెచ్2వో’ పేరిట వాటర్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఇటలీకి చెందిన యుఐఎం సంస్థ ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నవంబరు మాసంలో అంతర్జాతీయ జల క్రీడా ఉత్సవాలను నిర్వహించేందుకు యుఐఎం సిద్ధమవుతోంది..

ఇక్కడ ఉన్న సానుకూల వాతావరణం దృష్ట్యా చైనా, ఫ్రాన్స్, యుఏఈ తరువాత అమరావతిని ఒక సర్క్యూట్‌గా తీసుకుంటున్నట్టు యుఐఎం ప్రతినిధులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ఉత్సవాలపై వారు ముఖ్యమంత్రికి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్2వో రేసింగ్ పేరుతో పవర్‌బోట్ రేసింగ్, ఎఫ్1హెచ్2వో పేరుతో వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఆక్వాబైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు.

వచ్చే ఏడాది జరిగే ఈ పోటీలకు ప్రపంచం నలుమూలల నుంచి 300, 400 మంది క్రీడాకారులు వస్తారని, వారు కనీసం వారం రోజులు బస చేసేందుకు మొత్తం 1200 హోటల్ గదులు అవసరం అవుతాయని పర్యాటక కార్యదర్శి ఎం.కే. మీనా ముఖ్యమంత్రికి వివరించారు.

గోదావరి, కృష్ణానదులలో ఏడాది పొడవునా జలక్రీడలకు సంబంధించిన ఈ తరహా అన్నిరకాల పోటీలను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పర్యాటక శాఖను ఆదేశించారు. జలక్రీడలకు సంబంధించిన పరికరాలు, పడవలు, ఇతర సాధనాలకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు త్వరలో ప్రత్యేకంగా ఒక ప్రాథికార సంస్థని ఏర్పాటుచేస్తామని చెప్పారు.

అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి స్టెడీఎరీనా అనే బ్రిటీష్ సంస్థ ముందుకొచ్చింది. వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ వంటి క్రీడలకు అనువైన ప్రాంగణాలన్నీ ఒకేచోట నిర్మిస్తారు.

20 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణానదికి అభిముఖంగా ఈ స్పోర్ట్స్ కాంప్లోక్స్ నిర్మించాలని సీఆర్‌డీఏ తలపోస్తోంది. దీనిని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటుచేయాలని మంత్రి పి. నారాయణ సూచించారు..

హోటళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ నిర్వహణకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా వాటిని స్వీకరించాలి. వాటిపై అర్థవంతమైన చర్చ జరగాలి. మేధోమధనం చేసి సరైన నిర్ణయాలు తీసుకోవాలి’-అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. అనేక తరాలు గర్వంగా చెప్పుకునే గొప్ప ప్రజారాజధానిని నిర్మిస్తున్నామన్న భావన ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిలో ఉండాలని, దానికి తగ్గట్టుగానే నిర్ధిష్ట కార్యప్రణాళికతో పనిచేయాలని ఆయన అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఒక్క నిమిషం కూడా వృధాచేయకుండా పనులు జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) సమావేశం బుధవారం సాయంత్రం వెలగపూడిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పీఎస్) ప్రాంత మౌలిక వసతుల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో పనులు చేపట్టేందుకు గల సానుకూలతలు, ప్రతికూలాంశాలపై సమావేశంలో ప్రస్తావించి తుది నిర్ణయం తీసుకున్నారు..

ఈ నిర్ణయం ప్రకారం రాజధానిలోని మొత్తం 13 జోన్లలలో 5 జోన్లను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారు. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపడతారు.

ఇంతవరకు దేశంలో ఎన్‌హెచ్ఏఐ మాత్రమే ఈ హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌ను అనుసరించి జాతీయ రహదారులను నిర్మిస్తోంది. ఇప్పుడు తొలిసారిగా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌కు వెళుతున్నారు.

ఇందులో భాగంగా మొత్తం 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, నీటి సదుపాయాల కల్పన వంటి వివిధ రకాల పనులను చేపడతారు. రూ.2383 కోట్ల అంచనా వ్యయంతో 5,174 ఎకరాల మేర జోన్ 5లో అభివృద్ధి పనులను చేపడతారు. రూ.817 కోట్లతో 1360 ఎకరాల మేర జోన్ 4ను అభివృద్ధి చేస్తారు. రూ.3,714 కోట్ల వ్యయంతో 6902 ఎకరాల మేర జోన్ 9ని అభివృద్ధి చేయనున్నారు. రూ.2102 కోట్ల వ్యయంతో 7838 ఎకరాల మేర జోన్ 12 అభివృద్ధి పనులు చేపడతారు. రూ.1498 కోట్ల వ్యయంతో 3860 ఎకరాల మేర 12ఏ జోన్‌ పరిధిలో పనులు ఆరంభిస్తారు. ప్రతి జోన్‌లోనూ రహదారులు, వారధులు, విద్యుత్, నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఐసీటీ వంటి మౌలిక వసతుల ఏర్పాటుచేస్తారు.

నిర్మాణమైన రాష్ట్ర శాసనసభ, హైకోర్టు భవంతుల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో చర్చించడానికి ఏపీ సీఆర్‌డీఏ బృందం ఈనెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనున్నది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈనెల 12న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఏపీ సీఆర్‌డీఏ బృందానికి సమర్పిస్తారు. అమరావతిలో చేపట్టనున్న వీఐపీ గృహనిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఈనెల 9న ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read