రాష్ట్ర హైకోర్టులో ఈ రోజు కుప్పం నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి, ప్రత్యేక అధికారిని నియమించాలని, అదే విధంగా కుప్పం ఎన్నికల కౌంటింగ్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేయించాలని తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్ధులు, ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ రోజు ఉదయం లంచ్ మోషన్ పిటీషన్ విచారణకు వచ్చిన తరువాత, 12 గంటల ప్రాంతంలో విచారణ చేస్తాం అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టులో పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వరులు , గింజుపల్లి సుబ్బారావు వీరు ఇరువురూ కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల నేపధ్యంలోనే ప్రభుత్వం వైపు నుంచి ఎన్నికల కమిషన్ వైపు నుంచి కూడా వాదనలను హైకోర్టు వింది. విన్న తరువాత, కుప్పం ఎన్నికల మొత్తానికి ప్రత్యెక అధికారిగా , అంటే కౌంటింగ్ ని పరిశీలన చేసేందుకు ప్రత్యేక అధికారిగా, ఎన్ ప్రభాకర్ రెడ్డిని నియమించాలని హైకోర్టు ఆదేశించింది. కుప్పం ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి, బ్యాలట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తీసుకుని వచ్చే దగ్గర నుంచి, కౌంటింగ్ ప్రక్రియ మొత్తం అయిపోయే వరకు కూడా, మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాలని కూడా, ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశించింది.
ఈ ఎన్నికల కమిషన్ కు, ఆదేశాలు జారీ చేయటంతో పాటుగా, వీడియో రికార్డింగ్ మొత్తాన్ని కూడా తీసి, ఈ మొత్తం వీడియో రికార్డింగ్ ను వచ్చే సోమవారం నాటికి, హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. కుప్పం ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎక్కువగా వేయటం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దెబ్బతింది, పోలింగ్ ప్రక్రియ కూడా తేడాగా ఉందని, మొత్తం అరాచకాలకు తెగ బడ్డారని, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఓటర్లను తరలించారని, అందుకే తమకు కౌంటింగ్ పై కూడా నమ్మకం లేదని, గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమకు అన్యాయం జరిగిందని, అందుకే కౌంటింగ్ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేయించాలని పిటీషనర్ తరుపున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, గింజుపల్లి సుబ్బారావు వీరి ఇద్దరూ వాదనలు వినిపించారు. ఈ నేపధ్యంలోనే లంచ్ మోషన్ పిటీషన్ పై వాదనలు విన్న ధర్మాసనం, నిష్పాక్షపాక్షికంగా ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఎందుకు భయపడాలి, అందుకే వారు కోరుతున్నట్టే ప్రత్యేక అధికారిని, వీడియో రికార్డింగ్ చేయించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.