ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కోసం అని ప్రారంభం అయ్యాయి. అయితే బద్వేల్ ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం, అలాగే సంతాప తీర్మానాలు తరువాత, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానం స్పీకర్ తిరస్కరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదల పైన తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే స్పీకర్ దాన్ని తిరస్కరించారు. తరువాత సభ వాయిదా పడింది. సభ వాయిదా తరువాత బీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్క రోజు మాత్రమే జరపాలని తాము భావిస్తున్నాం అని, స్పీకర్ తమ్మినేని అచ్చెన్నాయుడుకి చెప్పారు. దీని పైన అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, మీరు ఒక్క రోజు అసెంబ్లీ కోసం, ఇంత హడావిడి ఎందుకని, అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పాటు జరపాలని అచ్చెన్నాయుడు కోరారు. దీని పైన జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, గ్రేట్ అచ్చెన్నాయుడు, పెద్దాయిన అడుగుతున్నారు కదా, మనం అంగీకరించకాపోతే ఎలా, ఈ నెల 26 వరకు అసెంబ్లీ జరుపుకుందాం అంటూ, వెటకారంగా జగన్ స్పందించారు. దీంతో స్పీకర్ కూడా ఒప్పుకుని, అసెంబ్లీ సమావేశాలు ఒక్క రోజు కాకుండా, 26 వరకు జరుపుకుందాం అని నిర్ణయం తీసుకున్నారు.
అయితే బీఏసి సమావేశంలో కుప్పం ఎన్నికల పైన ఆసక్తికర చర్చ జరిగింది. చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, ఆయన్ను హేళన చేస్తూ, జగన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ప్రవర్తించిన తీరు హుందాతనంగా లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకురండి, కుప్పం ఫలితాల తరువాత చంద్రబాబుని చూడాలని ఉంది అంటూ, జగన్ మోహన్ రెడ్డి వెటకారంగా చంద్రబాబుని హేళన చేస్తూ మాట్లాడటంతో, అచ్చెన్నాయుడు దీటుగా సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో గెలుపు ఓటమలు అనేవి సహజం అని, మీరు ఎన్నికల్లో ఎలా గెలిచారో అందరికీ తెలుసులే కానీ, బీఏసి సమావేశంలో ఎన్నికల చర్చ ఎందుకు, మీరు ప్రజా సమస్యల పైన చర్చించే దమ్ము ఉందొ లేదో చెప్పండి అని అన్నారు. అయినా ఆపకుండా మంత్రి అనిల్ కల్పించుకుని, నెల్లూరు ఎన్నికలకు అచ్చెన్నాయుడు ఇంచార్జ్ అని, ఒక్కటి కూడా గెలవలేదని మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడారు. మళ్ళీ జగన్ కల్పించుకుని, చంద్రబాబుతో చాలా మాట్లాడాలి, అసెంబ్లీకి తీసుకురండి అని చెప్పగా, చంద్రబాబు పారిపోయే వ్యక్తి కాదని, కచ్చితంగా అసెంబ్లీకి వస్తారని అన్నారు.