రాజధాని అమరావతిలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూములు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోనెంబర్ 316 విషయంలో తదనంతర చర్యలు అన్నీ నిలిపివేయాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధానిలోని 29 గ్రామాల్లో భూములు సమీకరించేందుకు, భూసమీకరణ విధానాన్ని తీసుకుని వచ్చి, అందులో ఎవరు అయితే అసైన్డ్ రైతులు ఉన్నారో ఆ అసైన్డ్ రైతులకు కూడా ప్రత్యెక ప్యాకేజి ఇవ్వాలని, దళితులకు న్యాయం చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసైన్డ్ రైతులు, తమ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి, రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, ఆ భూమి కోసం ఒక ప్రత్యెక ప్యాకేజి ఇస్తూ, జీవో నెంబర్ 41ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జీవో నెంబర్ 41 మేరకు, ఎవరు అయితే భూములు ఇచ్చారో అసైన్డ్ రైతులు ఆ భూములు ఇచ్చిన రైతులు అందరికీ కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రిటర్నబుల్ ప్లాట్స్ ని కూడా అసైన్డ్ రైతులకు అప్పట్లో సిఆర్డీఏ కేటాయించింది. అయితే ఈ జీవో నెంబర్ 41ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాద్ధాంతం చేసింది.
దళితులకు న్యాయం చేకూర్చే ఈ జీవో నెంబర్ 41ని చట్ట విరుద్ధం అని, అసైన్డ్ రైతులకు ఏవైతే భూములు ఇచ్చారో, ఆ భూములను అసైన్డ్ చట్టం ప్రకారం, ఇతర చట్టాల ప్రకారం, అనుభవించే హక్కు ఉంది కానీ అమ్ముకునే హక్కు లేదు అని చెప్పి, జగన్ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు జీవో నెంబర్ 41ని నిబంధనలకు విరుద్ధం అని చెప్పి, ఇది కేవలం దళారుల కోసం చేసిన జీవో అని, అప్పటి ముఖ్యమంత్రి, నారయణ పై కూడా కేసులు కూడా నమోదు చేసింది. అయితే జగన్ ప్రభుత్వం కొత్త జీవో ఇచ్చి, భూములు వెనక్కు ఇవ్వాలని కోరింది. అయితే ఆ భూములు తిరిగి ఇవ్వాలి అంటూ ప్రభుత్వం కోరటంతో, రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై ఈ రోజు విచారణ జరిగింది. రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, తమను అన్యాయం చేస్తున్నారని వాపోయారు. పిటీషనర్ తరుపు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి చర్యలు అన్నీ నిలిపివేయాలి అంటూ, ఆదేశాలు ఇవ్వటంతో, అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది.