జగన్ ప్రభుత్వం ఆర్థిక కష్టాలతో పాటు, పేదలకు అదనంగా కొత్త సమస్యలు వచ్చేలా చేస్తోందని, క-రో-నా మూడోదశ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం కోటిమంది పేదలకు రేషన్ కార్డులు నిలిపేయాలని చూస్తోందని, ఈకేవైసీ ఆగస్ట్ లోనే పూర్తి చేసుకోవాలనే నిబంధనతతో వారిని క్యూలైన్లలో నుంచో బెట్టి రాక్షసానందం పొందుతోందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఆధార్ నమోదు ప్రక్రియ మీసేవా కేంద్రాల్లో, బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండేదని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక, ఆయా కేంద్రాల్లో ఆధార్ నమోదు అందుబాటులో లేకుండా చేశాడన్నారు. పల్లెటూళ్లలో ఆధార్ నమోదు అనేది ప్రక్రియ మరీ ప్రహాసనంగా మారిందని, అటువంటి పరిస్థితుల్లో ఒక్క నెలలోనే ఆధార్ నమోదు చేయించుకోవాలంటూ ప్రభుత్వం, రాష్ట్ర వాసులను ఎందుకు పరుగులు పెట్టిస్తోందన్నారు. కేంద్రం చెప్పినా మిగతా రాష్ట్రాలు ఈకేవైసీ నమోదుకి ఎలాంటి గడువు విధించలేదని, ఒక ఏపీ మాత్రమే నెలాఖరులోగా పూర్త చేయాలనే నిబంధనతో, చంటి బిడ్డలతో సహా మహిళలు, వృద్ధులు ఆధార్ నమోదు కేంద్రాల ఎదుట పడిగాపులు పడేలా చేస్తోందన్నారు. రేషన్ కార్డులు తొలగించి, కోటిమందికి రేషన్ సరుకులు నిలిపివేయాలన్న ఉద్దేశంతోనే జగన్ ప్రభుత్వం, ఈకేవైసీ నమోదుకు ఈ నెల మాత్రమే గడువు విధించిందా అని రఫీ ప్రశ్నించారు. ప్రజలంతా గుంపులు గుంపులుగా గుమికూడుతుంటే, ప్రభుత్వం చెబుతున్న క-రో-నా నిబంధనలు ఏమయ్యాయన్నారు? ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెట్టడానికి, ప్రజలను గుంపులు చేయడానికే ప్రభుత్వం క-రో-నా నిబంధనలను వినియోగించుకుంటోందన్నారు. ఈకేవైసీ నమోదుకు అవసరమైన అన్ని చర్యలను సమర్థవంతంగా చేపట్టకుండా ప్రభుత్వం, పేదలను రోడ్ల మీదకు తీసుకొచ్చి, ఆధార్ నమోదు కేంద్రాల వద్ద గుంపులు చేయడమేంటన్నారు? కొన్నిచోట్ల వాలంటీర్లు ఈకేవైసీ నమోదు చేస్తారని చెబుతున్నారని, కానీ వారికున్న పనిభారంతో వారు సతమతమవుతున్నారన్నారు. రాష్ట్రంలో క-రో-నా పూర్తిగా తొలగిపోలేదని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈకేవైసీ నమోదు ప్రక్రియ నిర్వహించడం ఎంతమాత్రం సబబుకాదని రఫీ తేల్చిచెప్పారు.
కేంద్రం చెప్పినాసరే, ప్రభుత్వం ఇప్పుడు ఈకేవైసీ నమోదు ప్రక్రియను ఈ ఒక్కనెలకే పరిమితం చేయకుండా, డిసెంబర్ వరకు ఆధార్ నమోదు ప్రక్రియను కొనసాగించాలని రఫీ డిమాండ్ చేశారు. రేషన్ కట్ చేసి పేదల కడుపుకొట్టాలని చూడటం, రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం, చెత్తపన్ను, ఇంటిపన్ను పేరుతో ప్రజలను పీల్చిపిప్పిచేయడం వంటి విధానాలను అవలంభిస్తుండబట్టే, ముఖ్యమంత్రి గ్రాఫ్ అమాంతం పడిపోయిందన్నారు. రేషన్ కార్డుల ఈకేవైసీ నమోదు వ్వవహారాన్ని వాలంటీర్లకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రేషన్ కార్డులో పేర్లు తొలగించే అర్హత, అధికారం వాలంటీర్లకు లేదన్నారు. ఆధార్ నమోదుకు సంబంధించి, వాలంటీర్ల సేవల వినియోగం చట్టవిరుద్ధమని, అవసరమైతే ఈకేవైసీ అంశంపై ప్రతిపక్షం న్యాయస్థానాలను ఆశ్రయిస్తుందని రఫీ తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా మారిందని, పేదలపై అదనపు పన్నులవేస్తూ దోచుకుంటున్నదిచాలక, రమారమీ రూ.3 లక్షలకోట్ల వరకు అప్పులు తెచ్చారని, ఆసొమ్మంతా ఏంచేశారో చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. రూ.41వేలకోట్ల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి బిల్లులులేవని ఇప్పటికే తేలిందన్నారు. పేదలకు రూ.80వేల కోట్లకు మించి ఈప్రభుత్వం పంచలేదని, మిగిలిన సొమ్ము ఏమైందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్కరోడ్డు వేసిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదన్నారు. అప్పులుతెస్తూ లెక్కలు చెప్పకుండా దిగమింగుతున్నది కాక, అదనంగా ఈకేవైసీ నిబంధనలు, రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపు నిర్ణయాలతో కేంద్రం నుంచి అప్పులు తెచ్చి, ఆ సొమ్ముని కూడా ముఖ్యమంత్రి కాజేయాలని చూస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి సిగ్గుఎగ్గూ లేకుండా 6లక్షల ఉద్యోగాలిచ్చినట్లు చెప్పుకుంటున్నాడని, కరోనా విధుల కోసం గతంలో నియమించిన తాత్కాలిక సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, వాలంటీర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు