వ్యవసాయ రంగానికి కీలకమైన నీటి వనరుల నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆధునిక దేవాలయాలైన సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసి, లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నా చోద్యం చూస్తోందని టీడీపీనేత, తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ప్రాజెక్టుల నిర్వహణార్థం తీసుకొచ్చిన క్రాంతి పథకంతో ఉమ్మడి రాష్ట్రంలో ఒకరకమైన హరిత విప్లవమే వచ్చిందన్నారు. కానీ తనకు తానే రాజుగా భావించుకున్న రాష్ట్రముఖ్యమంత్రి పాలనలో పరిస్థితి పూర్తిగా తలకిందులైందన్నారు. గతంలో రాజులు, చక్రవర్తులు బయటకు వచ్చినప్పుడు విప్లవకారులు, ఆందోళనకారులను, సంఘవిద్రోహ శక్తులను సైన్యం కట్టడి చేయడం జరిగేదని, ఇప్పుడు రాష్ట్రంలో కూడా అదే విధమైన నిర్బంధాలు కొనసాగుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారీ వేలమంది పోలీసులు, న్యాయంకోసం, సమస్యల కోసం రోడ్లెక్కే వారిని తమ ఖాకీయిజంతో అణచివేస్తున్నారని మర్రెడ్డి స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక మానసికమైన వ్యాధితో బాధపడుతూ, రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో క్షామపీడిత ప్రాంతంగా మార్చేదిశగా ప్రయాణిస్తున్నా డన్నారు. సాగునీటి నిర్వహణ, కాలువల్లో పూడికతీత, మురుగునీటి కాలువల ఆధునికీకరణ వంటి పనులు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవన్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు ముంపునకు గురవుతున్నాయని, వర్షపునీరు కూడా బయటకు పోని పరిస్థితులు కళ్లముందే కనిపిస్తున్నాయన్నారు. అలానే అవసరమైనప్పు డు ప్రాజెక్టుల గేట్లు కిందికి దిగవని, కొన్ని ప్రాజెక్టుల్లో గేట్లు కొట్టుకుపోతుంటాయని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రధాన ప్రాజెక్టుల నిర్వహణ అనేది ఈ ప్రభుత్వానికి ఇప్పటికీ కొరుకుడు పడని పదార్థమే అయ్యిందన్నారు. నీటిపారుదల శాఖా మంత్రి అసమర్థత, ముఖ్యమంత్రి బాధ్యతారాహత్యం వెలసి, రాష్ట్ర రైతులకు కన్నీళ్లే మిగులుస్తున్నాయని మర్రెడ్డి వాపోయారు.
అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే అవి కిందకు దిగకపోవడంతో నీరంతా సముద్రం పాలైందన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ గేటుకొట్టుకుపోయి, నీరంతా వృథాగా కడలి పాలైందన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను చూసే అధికారులకు అవసరమైన వసతులు, పరికరాలు, ఇతర యంత్ర సామగ్రిని కూడా ప్రభుత్వ అందించలేక పోతోందన్నారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు కూడా పెట్టలేని దుస్థితిలో ప్రభుత్వముండటం దారుణమన్నారు. తన చేతగాని తనాన్ని, అసమర్థతను కప్పిపుచ్చుకుంటూ, ప్రాజెక్టులపై పెత్తనాన్నికేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ఏం చేస్తాడనే సందేహం ప్రతి ఒక్కరినీ పట్టి పీడిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులపై అధికారాన్ని కేంద్రానికి అప్పగించడం ద్వారా, ఏపీలో ఎక్కడైనా రైతులకు అవసరమైన నీటిని సాధించడ మనేది చాలా కష్టసాధ్యం అవుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ ల అసమర్థత, దద్దమ్మ ప్రభుత్వం కారణంగా, రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిధిలోని సుభిక్షమై నప్రాంతాలన్నీ బీడు భూములుగా మారే పరిస్థితిని మన కళ్లతో మనమే చూడబోతున్నామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను లోపభూయిష్టంగా మార్చిన ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనక పోతే, రైతులు కళ్లముందే ఎండిపోతున్న పైర్లను చూడలేక అసువులు బాసే ప్రమాదం పొంచి ఉందన్నారు. బంగారం పండే నేలలన్నీ నెర్రలు బారకముందే జగన్ ప్రభుత్వం కళ్లు తెరవాలని మర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రాణాధారమైన ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం చిత్తశుద్ధితో నిర్వహించాలని, చేతగాని పాలకులు, అవసరమైతే ప్రతిపక్షం, సాగునీటిరంగ నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకెళ్లాలని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.