తెలుగుభాషను, అకాడమీని నిర్వీర్యం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నచర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ, ప్రభుత్వం జీవో ఇవ్వడం దారుణమని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై మాతృభాషాభిమానులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వివాదాస్పదమైన నిర్ణయాలనే ముఖ్యమంత్రి ఎందుకు తీసుకుంటున్నాడో తెలియడంలేదన్నారు? తెలుగు భాష ఖ్యాతిని గుర్తించి, తెలుగు అకాడమీని అభివృద్ధి చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలాంటి పనులు చేయడం బాధాకరమని రఫీ వాపోయారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి తెలుగుభాష పటిష్టతకు కృషి చేస్తే, ఈ ముఖ్యమంత్రి తెలుగు భాషపై ఎందుకు కత్తి కట్టాడో తెలియడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీలో తెలుగు అనే పదం ఉందన్న దురాలోచనతో, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో తెలుగు అనేది ఉండకూడదని ఆలోచిస్తున్నాడేమోననిపిస్తోందన్నారు. తెలుగు, సంస్కృతాలను మిళితం చేయడం ద్వారా ముఖ్యమంత్రి తల్లి వంటి తెలుగు భాషను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు. సంస్కృతంపై పట్టు ఉండటం అందరికీ సాధ్యం కాదని, అటువంటి భాషతో ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల20లక్షలమంది మాట్లాడే తెలుగుభాషను జోడించాలని ముఖ్యమంత్రి చూడటం ముమ్మాటికీ మాతృభాషను నిర్వీర్యం చేయడమేనని రఫీ తేల్చిచెప్పారు. తెలుగుభాషపై కోపం చూపే, ముఖ్యమంత్రికి సంస్కృతంపై ఉన్నట్టుండి ఇంత ప్రేమచూపడం ఏమిటన్నారు? మాతృ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని, అదే అంశాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మాతృభాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని చెబితే, ముఖ్యమంత్రికి ఇవేవీ పట్టడం లేదన్నారు. తెలుగుభాష ఉనికిని ప్రశ్నార్థకంచేసే జీవోనెం-33ని ముఖ్యమంత్రి తక్షణమే రద్దు చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. అనేక దేశాల్లో పాశ్చాత్యులు తెలుగు నేర్చుకోవడానికి, తెలుగుభాష మాధుర్యాన్నిఆస్వాదించడానికి ఉవ్విళ్లూరుతుంటే, సొంత భాషను కాపాడుకోవాల్సిన ముఖ్యమంత్రి దాన్ని తుంచడానికి పూనుకోవడం అత్యంత బాధాకరమన్నారు. తల్లిని, చెల్లిని రోడ్ల పాలు చేసిన ముఖ్యమంత్రి చివరకు ఎందుకూ, ఎవరికి కొరగాని విధంగా తయారయ్యాడన్నారు. ఈ సందర్భంగా రఫీ సుమతీశతకంలోని “ కొరగానికొడుకు పుట్టిన కొరగామియేకాడు.తండ్రి గుణములు చెరచున్, చెరకుతుద వెన్నుపుట్టిన చెరకున తీపెల్లచెరచు సిద్ధము సుమతీ” పద్యాన్ని వినిపించారు.
జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఒక్క లక్ష్మీపార్వతి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లు తప్ప ఎవరూ సమర్థించలేదని, వారికున్న పదవి పిచ్చి, జగన్మోహన్ రెడ్డి భజన తెలుగుభాషకు చేటు చేస్తున్నాయన్నారు. లక్ష్మీప్రసాద్, లక్ష్మీపార్వతి నిర్ణయంపై భాషాభిమానులంతా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగును అధికార భాషను చేశారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తెలుగులోనే అర్జీలు అమలయ్యేలా చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలుగుమాట్లాడటం రాదని, ప్రజలెవరూ తెలుగు మాట్లాడ కూడదని భావించడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తులు చేయాల్సిన పనికాదన్నారు. తమిళనాడులో తమిళ భాషనే అన్ని విధానాల్లో ఉపయోగిస్తున్నారని, అఖరికి సంస్కృతంలోని శ్లోకాలు, మంత్రాలను కూడా తమిళలు వారి భాషలోనే చెబుతున్నారన్నారు. తెలుగుకు తెగులు పట్టించేలా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన జీవోని ఆయన తక్షణమే రద్దు చేయాలని టీడీపీ తరుపున రఫీ డిమాండ్ చేశారు. తెలుగుభాషను నిర్వీర్యం చేసే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారన్నారు. జగన్మో హన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక మాతృభాషను విద్యార్థులకు దూరం చేసే అనేక చర్యలకు శ్రీకారం చుట్టాడన్నారు. తెలుగు అకాడమీతో పాటు, సంస్కృత అకాడమీని కూడా ఏర్పాటు చేసి రెండు భాషలను ముఖ్యమంత్రి రక్షిస్తే, ప్రజలంతా ఎంతో సంతోషిస్తారన్నారు. తానొక మహమ్మదీయుడనని, కానీ తెలుగును అమితంగా ప్రేమిస్తానని రఫీ తెలిపారు. తేనెలొలికే తెలుగు భాషలోని గొప్పతనాన్ని ముఖ్యమంత్రి గ్రహించకపోవడం చాలాచాలా బాధాకరమన్నారు. చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుందని రఫీ హెచ్చరించారు.