రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోందని, రాష్ట్ర ప్రభుత్వం సమీకరిస్తున్న రుణాలకు సంబంధించి, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలియచేస్తూ, నేడు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఈశాన్య రాష్ట్రాలకంటే ఎక్కువగా వడ్డీలు చెల్లిస్తూ, దేశంలో మరే రాష్ట్రం లేని విధంగా అప్పులు తెస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "7.15శాతం వడ్డీతో రూ.1000 కోట్లు, 7.19 శాతంతో మరో రూ. 1000కోట్లు, వెరసి రూ.2వేలకోట్లు, దేశంలోనే అత్యధిక వడ్డీ రేటు చెల్లించి మన రాష్ట్రం అప్పు తెచ్చింది. ఈ వడ్డీ శాతం ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ కంటే చాలా ఎక్కువ. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి మన రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణం, రికవరీపై అప్పులిచ్చేవారికి నమ్మకం సన్నగిల్లడమే. సాధారణంగా ఏవిధంగా, ఎవరు అప్పుతీసుకున్నా, ఇచ్చేవారు అప్పుతీసుకున్నవాడు తిరిగి నమ్మకంగా ఇస్తాడా లేదా అని ఆలోచిస్తాడు. కచ్చితంగా సకాలంలో ఇచ్చేవారికి ఎంతో కొంత వడ్డీ కూడా తగ్గుతుంది. తిరిగి చెల్లించని వారికే షరతులు, వడ్డీలు ఎక్కువుంటాయి. బ్యాంకులిచ్చే రుణాల్లో కూడా క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉండేవారికి వడ్డీఎక్కువ వేస్తారు. మ నరాష్ట్రం యొక్క క్రెడిట్ రేటింగ్ పడిపోబట్టే, రోజువారీ అవసరాలకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకుంది. వీటన్నింటికీ మూలమైన ప్రధానకారణాన్ని ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చు. జగన్ హవాలా – రాష్ట్రం దివాలా అంటే సరిపోతుంది. తీసుకొస్తున్న అప్పులన్నీ కూడా తన అవినీతి కార్యకలాపాల ద్వారా దిగమింగి, వాటిని హావాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ముఖ్యమంత్రి, ఇక్కడ ఏమాత్రం సరైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. అప్పులుతెచ్చిన సొమ్ములో పైసా కూడా ఆదాయ మొచ్చే మార్గాలకు వినియోగించడం లేదు. అందువల్లే రాష్ట్రం దివాలా తీస్తోంది. రాష్ట్రం దివాలాతీసినా, అంతిమంగా ప్రజలంతా చంకనాకిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కంపెనీలు, ఆయన అనుచరుల కంపెనీలు, వారి ఖజానాలు మాత్రం నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. ఎటొచ్చీ ఏపీ ఖజానానే కొడిగట్టిన దీపంలా వెలవెలబోతోంది. ఇదీ నేడు ఆంధ్రరాష్ట్రం యొక్కదుస్థితి...పరిస్థితి."
"ఇది వరకు ప్రభుత్వాలు అడిగిన వెంటనే బ్యాంకులు రుణాలి చ్చేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ గ్యారంటీతో సరిపెట్టుకోకుండా, ఆస్తులు తనఖా పెడితే తప్ప, రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకులు తెగేసి చెబుతున్నాయి. విశాఖపట్నంలోని కలెక్టర్ బిల్డింగ్ సహా, ఇతర ఆస్తులను తనఖా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైన సంగతిని అందరూ గమనించాలి. ఏ ప్రభుత్వమున్నాకూడా గతంలో బ్యాంకులు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు విధించలేదు. స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల పేరుతో కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ ప్రభుత్వం అప్పుల సాధనకు సిద్ధమైంది. 2014లో రూ.16వేలకోట్ల ఆర్థిక లోటు ఉన్నాకూడా రాష్ట్రం ఆర్థికంగా ఇంతలా దిగజారలేదు. రాష్ట్రానికి సంపద సృష్టించకపోగా, జగన్ రెడ్డి తన సొంత ఖజానా పెంచుకుంటున్నాడు. తన కంపెనీలకు, తన అనుచరుల కంపెనీలకు ఎన్నిఆస్తులు, ఎన్ని వందల ఎకరాలు దోచిపెడుతున్నాడో కూడా ప్రజలంతా గమనించాలి. కేంద్రం షరతులతో 2021-22 సంవత్సరానికి కేవలం రూ.27,668 కోట్లు మాత్రమే అప్పు తీసుకునే అవకాశం ఈ ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై బ్యాంకులు, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం అన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెస్తున్న అప్పులు, వడ్డీరేట్ల పెరుగుదల, తిరిగి చెల్లింపులు చూశాక రాష్ట్రానికి ఎవరూ రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రాని దుస్థితి. ఆవిధంగా ఈ ముఖ్యమంత్రి హోల్ సేల్ గా రాష్ట్రాన్ని దివాలా తీయించాడని, తన కంపెనీలు, తన అనుచరుల కంపెనీల ఖజానాలను కళకళలాడిస్తూ, రాష్ట్ర ఖజానా మాత్రం వెలవెలబోయేలా చేశాడనే పచ్చినిజాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం."