ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య జరుగుతున్న జల జగడానికి సంబంధించి, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి వరుసగా కేంద్రానికి లేఖలు రాస్తూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే, కేంద్రానికి లేఖలు రాయటం తప్ప, ఈ అంశంలో జగన్ ప్రభుత్వం ఏమి చేయలేదు అనే చెప్పాలి. కేంద్రానికి రాస్తున్న లేఖల్లో భాగంగా ఈ రోజు మరొక లేఖ కేంద్ర జలశక్తి మంత్రికి, అదే విధంగా కేంద్ర పర్యవరణ శాఖా మంత్రికి రెండు లేఖలు రాసారు. జలశక్తి మంత్రికి రాసిన లేఖలో పలు కీలక అంశాలు జగన్ ప్రస్తావించారు. తెలంగాణా అక్రమంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుందని, తమకు సాగు నీరు అవసరం లేకపోయినా, కిందకు నీళ్ళు విడుదల చేస్తుందని, దీన్ని నిరోధించాలని పేర్కొన్నారు. తెలంగాణా అక్రమ ప్రాజెక్ట్ లు నిర్మిస్తుందని ఈ లేఖలో తెలిపారు. అయితే తెలంగాణాలో ఉన్న అక్రమ ప్రాజెక్ట్ లు సందర్శించిన తరువాతే, రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు ప్రతినిధులు సందర్శించాలని, ముందుగా తెలంగాణాలో సందర్శించి, అక్కడ స్థితిగతులు తెలుసుకున్న తరువాతే, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను విజిట్ చేయాలని , స్పష్టంగా జగన్ పేర్కొన్నారు. తెలంగాణాలో ఉన్న అక్రమ ప్రాజెక్ట్ ల సందర్శనకు కృష్ణా రివర్ మ్యానేజ్మెంట్ బోర్డు ఎందుకు వెళ్ళటం లేదని ప్రశ్నించారు.
కేఆర్ఎంబీ కూడా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తుందని, ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం కూడా కేఆర్ఎంబీకి సూచనలు చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, దిండి ప్రాజెక్ట్ ల విషయంలో కూడా కలుగు చేసుకోవాలని కోరారు. కేఆర్ఎంబీ పని తీరు పై లేఖలో ఫిర్యాదు చేసారు. తెలంగాణా ఇచ్చిన ఫిర్యాదులను కేఆర్ఎంబీ వెంటనే స్పందించి ఆదేశాలు ఇస్తుందని, ఏపి ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోవటం లేదని, ఆ లేఖలో ప్రస్తావించారు. రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని పరిశీలిస్తాం అని చెప్తున్న కేఆర్ఎంబీ, తెలంగాణా అక్రమ ప్రాజెక్ట్ ల విషయంలో ఎందుకు ఒత్తిడి తీసుకురావటం లేదని, తన లేఖలో ప్రశ్నించారు. తెలంగాణా అక్రమ ప్రాజెక్ట్ లు కడితే, శ్రీశైలం ప్రాజెక్ట్ కు చుక్క నీరు కూడా రాదని తెలిపారు. అక్రమ ప్రాజెక్ట్ లు కట్టటమే కాకుండా, ఇప్పుడు విద్యుత్తు ఉత్పత్తి కూడా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేసారు. తెలంగాణా అక్రమ ప్రాజెక్ట్ ల వల్లే, రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించాలని అనుకున్నాం అని అన్నారు.