షర్మిల కొత్త పార్టీ పై ఎట్టకేలకు జగన్ పార్టీ స్పందించింది. స్పందించింది కూడా జగన్ కు అత్యంత ఆప్తుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, షర్మిల పార్టీ పై స్పందించారు. షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డని, ఈ రోజు ఆమె తీసుకున్న నిర్ణయం పై తప్పుడు బాష్యాలు మీడియాలో వస్తున్నాయని సజ్జల అన్నారు. షర్మిల కొత్త పార్టీ పెడుతుందని, ఆమె పార్టీ గురించి మాకు ఏమి తెలియదు అని చెప్తే అది బుకాయింపు అవుతుందని అన్నారు. షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు అంటూ, మూడు నెలల ముందు నుంచే మాకు తెలుసని, దీని పై చర్చలు జరుగుతున్న విషయం తమకు తెలిసిందని అన్నారు. షర్మిల పార్టీ పెట్టాలనే ఆలోచనలు భిన్నంగా ఉన్నట్టు ఉన్నాయని సజ్జల అన్నారు. జగన్ షర్మిల మధ్య ఎలాంటి విబేధాలు లేవు కానీ, భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. తెలంగాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తరణ విషయంలో జగన్ కు ఒక అభిప్రాయం ఉందని, దానికి వ్యతిరేకంగా షర్మిల ఆలోచనలు ఉన్నాయని సజ్జల అన్నారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణాలో పార్టీ విస్తరణ పై మాత్రమే, ఇద్దరికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అన్నారు. ఈ విషయంలో షర్మిలతో చర్చలు జరిగాయని, ఆమెను నచ్చచెప్పే ప్రయత్నం జరిగిందని సజ్జల అన్నారు.
పార్టీ పెడితే వచ్చే ఇబ్బందులపై షర్మిలకు వివరించమని సజ్జల అన్నారు. అయినా తెలంగాణాలో పార్టీ ఏర్పాటు పై ఇంకా షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సజ్జల అన్నారు. షర్మిల పార్టీ పెడితే దానితో వైసీపీకి సంబంధం ఉండదని అన్నారు. పార్టీ పెట్టటం అంటే సాహసం అనే చెప్పాలని సజ్జల అన్నారు. షర్మిల తీసుకునే నిర్ణయానికి ఆమె బాధ్యులు అవుతారని, ఫలితాలు ఎలా ఉన్నా, ఆమెకే వర్తిస్తాయని సజ్జల అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో మంది నాయకులను తయారు చేసారని, షర్మిలకు అవకాశాలు ఇవ్వేలేదు అని చెప్పటం కరెక్ట్ కాదని, ఆయన అవకాసం ఇస్తేనే కదా, అంత పెద్ద పాదయాత్ర చేసింది అంటూ సజ్జల అన్నారు. జగన్ మోహన్ రెడ్డికి చెల్లిగా, వైఎస్ఆర్ కూతురుగా ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, నేనే విషెస్ చెప్తున్నప్పుడు, జగన్ ఆశీస్సులు కూడా ఉంటాయని అనుకుంటున్నా అంటూ, షర్మిల ఎంట్రీ పై సజ్జల వ్యాఖ్యలు చేసారు. మొత్తానికి సజ్జల ప్రెస్ మీట్ వింటుంటే, ఇద్దరి మధ్య గ్యాప్ చాలా పెరిగిందని అర్ధం అవుతుంది. ముందు ముందు ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.