నివాస యోగ్యం కాని స్థలాల్లో ఇళ్ల పట్టాలు అంటూ జగన్ రెడ్డి రూ.6500కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు విమర్శించారు. ఆవ భూములు, స్మశానాలు, మురికి గుంటల్లో ఇళ్ల పట్టాలంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఇళ్ల పట్టాల్లో 40 నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, మునిగిపోయిన స్థలాలు, కొండలు, గుట్టలు, దూర ప్రాంతాలు వంటి 100 వంద రకాలు ఫోటోలను ప్రదర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇళ్ల పట్టా పేరుతో పంచాయతీ, ఉపాధి నిధలను మళ్లించారని పేర్కొన్నారు. పట్టాల పేరుతో రూ.4 వేల కోట్లు, చదును పేరుతో రూ.2 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వివరించారు. 40 మంది ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములుగా ఉన్నారు. క్విడ్ ప్రోకో విధానంతో అవినీతి జరుగుతోంది. ఒక్కో లబ్ధిదారుని నుండి రూ.25 వేల నుండి లక్షల వరకు వసూలు చేసి ఐదు వందల కోట్లు దోచుకున్నారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో జె.ట్యాక్స్ వసూళ్లు తాడేపల్లి రాజ ప్రసాదానికి అందుతున్నాయని వివరించారు. ఇళ్ల స్థలాలను టీడీపీ అడ్డుకుందని వైసీపీ అసత్యప్రచారం చేస్తోందని, వాళ్ల పార్టీ వారే కోర్టుకు వెల్లారని తెలిపారు. సీఎం జగన్ రెడ్డి దమ్ముంటే ఇళ్ల పట్టాల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా వైసీపీ అవినీతిని టీడీపీ బయటపెట్టిందని వివరించారు. దోచుకున్న డబ్బంతా టీడీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. మాజీమంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే అవినీతికి వైసీపీ అన్ని దారులను చూసుకుందన్నారు. రూ.10 లక్షలు విలువ చేసే భూమికి రూ.30 లక్షలు కేటాయించి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. పనికిరాని పొలాల్లో ప్లాట్లు వేసి అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టా పేరుతో ప్రజలను మాయ చేస్తున్నారని అన్నారు. టీడీపీ పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను ఇప్పటికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలకు పేదల నుండి డబ్బులు వసూలు చేశారన్నారు.
వివాదంలో ఉన్న భూములను వదిలేసి మిగతా పట్టాలను ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ రెండు సెంట్ల భూమిని ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల హామీల్లో ఒకటి చెప్తూ ఆచరణలో మరొకటి చేస్తున్నారని మండిపడ్డారు. 10 లక్షల ఇళ్లు చంద్రబాబు కట్టించారని వివరించారన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ శుక్రవారం జరిగేది ఇళ్ల పట్టాభిశేకం కాదని జగన్ కు కనకాభిషేకం జరుగుతోందని ఎద్దేవవా చేశారు. జగన్ రెడ్డి పత్రికలో చెప్పుకుంటున్న రూ.21,345 కోట్ల విలువైన 2.62 లక్షల టిడ్కో ఇళ్ల అగ్రిమెంట్ల ద్వారా ఇచ్చే సంపద కూడా చంద్రబాబు సృష్టించేదనని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఉద్ఘాటించారు. ముంపు, పీకల్లోతు మునిగే నీటిలో పేదలు ఇల్లు ఎలా కడతారని ప్రశ్నించారు. మీకు ఊరికో ప్యాలెస్, ఎకరాల పరిధిలో కట్టుకోవచ్చని కానీ పేదవాడు సెంటు స్థలంలో ఎలా కట్టుకోవాలని నిలదీశారు. జగన్ ప్యాలెస్ ఉన్న బాత్రూంత అంత స్థలం కూడా పేదవారికి ఇచ్చే స్థలం ఉండదన్నారు. చెరువు, కొండలు, అడవుల్లో ఇస్తున్నారు. మీరు ఇచ్చే స్థలంలో పేదవారు ఎలా కట్టుకుంటారు. మురికి వాడనలు సృష్టిస్తున్నారు. నివాసయోగ్యం కాని వాటిని ఇళ్ల స్థలాలుగా ఇస్తున్న విషయం రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరారు. వైసీపీ చేసిన అవినీతితో 13 లక్షల మందికి అదనంగా ఇళ్ల పట్టాలు ఇవ్వ వచ్చని పేర్కొన్నారు.
జగన్ ఓటమికి కౌంట్ డౌన్ మొదలైందని తెలిపారు. టీడీపీ ఇచ్చిన టిడ్కో ఇల్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దోచుకోవడం తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని జాతీయ అధికార ప్రతినిధి మొహ్మద్ నసీర్ అన్నారు. నిజమైన పేదలకు వైసీపీ మేలు చేయడంలేదుని అన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మాట్లాడుతూ జగన్ చేసే పెద్ద మాయను టీడీపీ బయటపెట్టిందన్నారు. ప్రజలు కూడా జగన్ ఇచ్చే ఇళ్లను అమ్ముకునే స్థితిలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ఏంచేసినా జగన్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో మురికి వాడలకు శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. పత్రిక ప్రకటనలతో డబ్బులు తగలబెతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి అన్నారు. ఆధునిక సాంకేతికతతో చంద్రబాబు ఇళ్లు నిర్మిస్తే జగన్ ఇవ్వడంలేదున్నారు. వర్షం వస్తే చెరువులుగా మారే వాటిని ఇళ్ల స్థలాలుకు కేటాయించడం దుర్మార్గమని విమర్శించారు. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ జగన్ ఇచ్చే మురికి వాడ స్థలాల్లో కార్మికులే ఎక్కవగా ఉండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.