ఫేక్ ప్రమోషన్లు చేయడంలో తిరుగులేని ట్రాక్ సాధించిన ఐ ప్యాక్ తన టీములతో పూర్తిస్థాయిలో విశాఖలో దిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కోసం ఐప్యాక్ పెయిడ్ ఆర్టిస్టులు స్టార్టప్ హీరోల అవతారం ఎత్తారు. ఆంత్రప్రెన్యూర్ పాత్ర పోషిస్తున్నారు. విశాఖ పట్టణంని చూస్తుంటే, ఈ రాత్రికే వందల కోట్లు పెట్టుబడి పెట్టేయాలని అనిపిస్తోందని తెగ ముచ్చట పడిపోతున్నారు. ఈ శాల్తీలు ఏవో తేడాగున్నాయే అని అనుమానించిన టిడిపి సోషల్‌మీడియా వారియర్స్ ఒక్కొక్కరి రంగు బయటపెట్టటం మొదలు పెట్టారు. ఆకిబ్ జావేద్ అనే తెలంగాణ కుర్రాడు ఐప్యాక్ ఉద్యోగి. విశాఖ గురించి తెగ మురిసిపోతూ ఇచ్చిన బైట్ ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఇంతలోనే టిడిపి వాళ్లు ఆకిబ్ జావేద్ బండారం బయట పెట్టేశారు. ఐ ప్యాక్ కోర్ టీముకి చెందిన అనుష్క టాండన్ కూడా ఎక్కడి నుంచో ఇప్పుడే దిగినట్టు తెగ హోయలు పోతూ బైట్ ఇచ్చింది. టిడిపి వారియర్స్ అనుష్క టాండన్ పుట్టుపూర్వోత్తరాలు, ఐ ప్యాక్ లో అమ్మడు చేసే ఉద్యోగాన్ని కూడా బయటపెట్టేశారు. ప్రమోషన్ ఈ రేంజులో ఫేక్ చేస్తున్నారంటే, రేపు ఎంవోయూలు కొరియా పారిశ్రామికవేత్తలంటూ ఓ న్యూడిల్స్ బండివాడికో సూటు వేసి ఫోటోలు దిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఐప్యాక్ ఫేక్ గురించి తెలిసిన అనలిస్టులు. విశాఖ రాజధాని అని ప్రమోట్ చేసే ఉద్దేశంతో అక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ని మార్చి 3, 4 తేదీలలో ప్లాన్ చేశారు. వాస్తవంగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్న పరిశ్రమలే పక్కరాష్ట్రాలకి వెళ్లిపోయాయి. కొత్తగా వచ్చేవీ ఏవీ ఉండవు. ఐప్యాక్ టీమే మొత్తం సమ్మిట్ ప్రమోషన్స్ నుంచి ఎంవోయూల ప్లానింగ్ అంతా డిజైన్ చేసిందని తెలుస్తోంది. ఐప్యాక్ ఉద్యోగులే ఇన్వెస్టర్లు అవతారం ఎత్తినట్టు టిడిపి కనిపెట్టి వీధిన పెట్టేసింది.
news
పేర్ని నానియే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టార్గెట్టా ? మచిలీపట్నంలో భారీగా ప్లాన్ చేసిన పవన్...
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుపై ఎప్పుడు ఏ ఆరోపణ చేసినా ..కౌంటర్ ఇవ్వడానికి వచ్చేది మాజీ మంత్రి పేర్ని నానియే. ఆ కౌంటర్ ఇచ్చే క్రమంలో పవన్ నాయుడు అని సంబోధించడం, మా కాపోడే కాబట్టి తిడతానంటూ తిక్క లాజిక్‌లతో జనసేనకి మెయిన్ టార్గెట్ గా మారాడని టాక్ వినిపిస్తోంది. మచిలీపట్నం పేర్ని నాని ఇలాఖా. ఇక్కడ కాపులు గణనీయంగా ఉన్నారు. దీంతో పేర్ని నాని అహంకారం అణచాలంటే అక్కడి నుంచే సమరశంఖారావం పూరించాలని పవన్ డిసైడయ్యారని టాక్ వినిపిస్తోంది. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభను మచిలీపట్నంలో నిర్వహించాలనుకోవడంతోనే పేర్నినానిని టార్గెట్ చేశారని స్పష్టం అవుతోంది. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఆవిర్భావ దినోత్సవ సభను మచిలీపట్నం లో నిర్వహిస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహనం లో పవన్ కళ్యాణ్ బయలు దేరి మచిలీపట్నం సభకి హాజరు అవుతారని తెలిపారు. మచిలీపట్నం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రి పదవి పోయాక ప్రతీసారీ కాపు కార్డుతో వచ్చి పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. పేర్ని నాని గెలుపు మదం దింపే ప్లాన్‌లో భాగంగానే మచిలీపట్నం ఆవిర్భావ సభను ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. కాపు ఓట్లు గంపగుత్తగా పేర్నినానికి పడేవని, జనసేన అభ్యర్థిని దింపడం ద్వారా, లేదంటే టిడిపి అభ్యర్థికి మద్దతు పలకడం ద్వారా పేర్నినానికి ఓటమి దారి చూపించాలని జనసేన వ్యూహం అని ప్రచారం సాగుతోంది.
వైసీపీకి రెండు చేతులతో ఓట్లేసిన ఉద్యోగులు, ఇప్పుడేమంటున్నారో చూసారా ?
ఏపీ సర్కారుతో హనీమూన్ టైమ్ ముగిసిపోయిందంటున్నాయి ఉద్యోగ సంఘాలు. మొన్నటివరకూ మా ప్రభుత్వం, అనుకున్నా ఆడుకున్నా మేమంతా ఒక్కటేనంటూ గారాలు పోయినా ఉద్యోగసంఘ నాయకులు బాగానే బాగుపడ్డారు. అయితే ఉద్యోగుల్లో సర్కారు తీరుపట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. సర్కారుతో లాలూచీ కోసం ఎంత మేనేజ్ చేసినా, ఆగేలా లేరు ఉద్యోగులు. దీంతో సర్కారు ఉద్యోగసంఘాలైన కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎన్జీవో సంఘం బండి శ్రీనివాసరావు తప్పించి మిగిలిన ఉద్యోగ సంఘాలన్నీ కలిపి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. రాజశేఖర్ రెడ్డి బిడ్డా, నీపై మోజు తీరిపోయిందంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తే ఇబ్బందుల పాలు జేస్తున్నారని, అందుకే ఉద్యమంలోకి దిగుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. సీఎస్ జవహర్ రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు. మార్చి 9 నుంచి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఇప్పటికే ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మార్చి 9 నుంచి యథావిధిగా ఉద్యమంలోకి దిగుతామని నేతలు పేర్కొన్నారు. నోటీసులో పేర్కొన్న ప్రకారం మార్చి 9, 10 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన, 13, 14 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, 15, 17, 20 తేదీల్లో జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, 21 నుంచి వర్క్‌టూ రూల్ అనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని చేయనున్నారు. మార్చ్ 21న సెల్‌డౌన్, యాప్‌డౌన్, 24 నుంచి అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో ధర్నాలు, 27న కరోనాతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఓదార్పు కార్యక్రమం ఉంటుంది. సరెండర్-ఎర్న్ లీవ్‌లు, జీపీఎఫ్ విషయంలో ఏప్రిల్ 1న పోలీసు కుటుంబాల ఇళ్ళ సందర్శన ఉంటుంది. ఏప్రిల్ 5న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి రెండోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారు.
వాలంటీర్ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులపై నమ్మకం లేకే వలంటీర్ల వ్యవస్థని నమ్ముకున్నారా అంటూ ఏపీ సర్కారుపై హైకోర్టు మండిపడింది. వలంటీర్ల వ్యవస్థపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగగా కోర్టు మరోసారి వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్దిదారుల ఎంపిక బాధ్యతను వలంటీర్లకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించింది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనైనా లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా? ఇప్పుడు ఎందుకు వలంటీర్లను వినియోగిస్తున్నారని కోర్టు సూటిగా నిలదీసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వలంటీర్ల వ్యవస్థను సమాంతరంగా వాడుతున్నారనే అర్థంలో హైకోర్టు వ్యాఖ్యలతో సర్కారు ఉలిక్కిపడింది. రాజకీయ కారణాలతో తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని హైకోర్టును ఆశ్రయించిన గారపాడు గ్రామానికి చెందిన 26 మంది లబ్దిదారులు ఆశ్రయించగా దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ అంశంపై కోర్టుకు హాజరైన సెర్ప్ సిఈఓ ఏఎండీ ఇంతియాజ్ ని వలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు కోర్టు వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనది అని కోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, చట్టం అనుమతిస్తే వలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించాలని జడ్జి పేర్కొన్నారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంతియాజ్ ను ఆదేశించిన న్యాయమూర్తి కేసు విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.