కలియుగ దైవం వెంకన్నను కూడా రాజకీయాల్లోకి లాగి ఆడుకున్న సంఘటనలు మన రాష్ట్రంలో తరుచూ చూస్తున్నాం. ముఖ్యంగా 2018 సమయంలో, ఒక వివాదం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కలిప్తాలు కల్పించిన కాలం అది. ఆ సమయంలో శ్రీవారిని కూడా ఈ కల్పితాలు వదలలేదు అందులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ గా ఉన్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర భారీగా నగదు దొరకటం, ఆ శేఖర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్ బినామీ అంటూ ప్రచారం చేసారు. చివరకు అధికారంలోకి రాగానే, అదే శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చారు. ఇలా ఎందుకు చేసారో, ఏంటో ఆ వెంకన్నకే తెలియాలి. ఇక మరో ముఖ్యమైన అంశం పింక్ డైమండ్. శ్రీవారి పింక్ డైమండ్ కనిపించటం లేదు అంటూ, అప్పట్లో బహిష్కరణకు గురైన రమణదీక్షితులు చెప్పిన మాటలు అందరికీ గుర్తు ఉన్నాయి. రమణ దీక్షితులు అప్పట్లో ఈ విషయం పై చాలా హడావిడి చేసేవారు. పింక్ డైమండ్ అనేది ఉందని, దాన్ని నేనే అలంకరించానని, పింక్ డైమండ్ ను విదేశాల్లో 500 కోట్లకు అమ్మేసారు అంటూ, ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక దీన్ని అందిపుచుకున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఆ పింక్ డైమండ్ సహా, శ్రీవారి నగలు అన్నీ, చంద్రబాబు నాయుడు ఇంట్లో నేలమాలిగల్లో ఉన్నాయని, తానూ వాటిని నిరూపిస్తాను అంటూ, విజయసాయి రెడ్డి చేసిన హంగామా, ఆయన ట్వీట్లు అందరికీ గుర్తున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రమణదీక్షితులు పదవి అయితే వచ్చింది కానీ, పింక్ డైమండ్ గురించి మాత్రం దీక్షితులు గారు మర్చిపోయారు.
పింక్ డైమండ్ ఏమైందో విచారణ చేయమని, ఇప్పటి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అడగటంలో దీక్షితులు గారు మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు పింక్ డైమండ్ మరోసారి తెర పైకి వచ్చింది. తిరుపతికి చెందిన లాయర్, విద్యాసాగర్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఈ విషయం పై లేఖ రాసారు. శ్రీవారి పింక్ డైమండ్ పై తేల్చాలని ఆ లేఖలో తెలిపారు. రమణదీక్షితులు పింక్ డైమండ్ ఉంది అంటూ హడావిడి చేసారని, అయితే వివిధ కమిషన్ లు ఎంక్వయిరీ చేసి, పింక్ డైమండ్ లేదు అనేది గతంలోనే తేల్చాయని, అయితే రమణ దీక్షితులు మాత్రం తానూ పింక్ డైమండ్ అలంకరించాను అంటూ చెప్పారని, ఏది నిజమో తేల్చాలని కోరారు. దీక్షితులు చెప్పినట్టు దేశం దాటి వెళ్ళిపోతే, ఏపి పోలీసులు ఎంక్వయిరీ చేయలేరు కాబట్టి, కేంద్ర దర్యాప్తు సంస్థలతో, ఈ విషయం పై ఎంక్వయిరీ చేసి నిజం ఏమిట్ తేల్చాలని ఆయన లేఖలో కోరారు. ఒక వేళ దీక్షితులు గారు చెప్పేది నిజం కాకపోతే, ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసారు, ఎవరి ప్రోద్బలంతో ఆయన ఈ ఆరోపణలు చేసారో , అది కూడా తేల్చాలని, ఈ విషయం పై భక్తులకు, ప్రజలకు క్లారిటీ కావాల్సి ఉంది అంటూ, ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు లేఖ రాసారు. మరి ఇప్పటికైనా ఈ విషయం పై క్లారిటీ వస్తుందా ? రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై, ఎలాగూ ఏమి తేల్చటం లేదు కాబట్టి, కేంద్ర దర్యాప్తు సంస్థలు అయినా నిజం చెప్తాయా ? చూద్దాం.