ప్రభుత్వంలో అనేక జీవోలు విడుదల అవుతూ ఉంటాయి. పరిపాలనకు సంబంధించి నిర్ణయాలు, అపాయింట్మెంట్లు, బడ్జెట్ విడుదల, ఖర్చులు, బిల్లులు, ఇలా అనేకం ప్రతి రోజు జీవొల రూపంలో విడుదల అవుతూ ఉంటాయి. అయితే సహజంగా ఈ జీవోలు ఆయా శాఖల ప్రధాన కార్యదర్శి కాని, ముఖ్య కార్యదర్శి కాని, కార్యదర్శి స్థాయిలో ఉన్న అధికారి కానీ, ఈ జీవోలు విడుదల చేస్తూ ఉంటారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఈ జీవోల రూపంలో అమలులోకి వస్తాయి. అయితే ఈ మధ్య వచ్చే జీవోలు చాలా వరకు ప్రవీణ్ ప్రకాష్ పేరుతోనే వస్తున్నాయి. దీని పై చర్చ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు జీఏడీలో మరో కలకలం రేగింది. ఎప్పుడు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, డీజీపీ పేరుతొ జీవో విడుదల అయ్యింది. నిన్న డీజీపీ పేరు మీద విడుదల అయిన జీవో చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా వర్గాలు కూడా, పొరపాటున, వచ్చింది ఏమో అనుకుని, ఎంక్వయిరీ చేసారు కూడా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్రమ మద్యం, అక్రమ ఇసుక, లాంటివి నిరోధించటానికి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక కొత్త శాఖ, పోలీస్ డిపార్టుమెంటుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. వీళ్ళు, రాష్ట్ర సరిహద్దులతో పాటుగా, రాష్ట్రంలో అనేక చోట్ల, వాహనాలు తనిఖీ చేస్తూ, అక్రమ మద్యం పట్టుకుంటున్న వార్తలు, ఈ మధ్య మనం తరుచు వార్తల్లో చూస్తున్నాం. ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే సంస్థను, సియం పర్యవేక్షించే, జీఏడీ విభాగం కిందకు తెస్తూ ఇచ్చిన జీవో, డీజీపీ గౌతం సవంగ్ ఇవ్వటం, చర్చకు దారి తీసింది. ఈ శాఖకు వివిధ ఆర్ధికా పరమైన కార్యక్రమాలు నిర్వచించే వీలులో భాగంగా, దీన్ని జీఏడీలోకి తెచ్చారు. అయితే, దీనికి సంబంధించి జీవో, ఎప్పుడు లేని విధంగా ఒక డీజీపీ ఇవ్వటం, చర్చకు దారి తీసింది. ఈ పరిణామం పై సచివాలయంలోని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల మధ్య చర్చ జరుగుతుంది. ఇక ముందు ముందు, ఎవరు జీవోలు రిలీజ్ చేస్తారో అని చర్చించుకుంటున్నారు.