ప్రభుత్వాలు మారగానే, ప్రత్యర్ధుల పై, ఇష్టం వచ్చినట్టు చెయ్యటానికి, వీలు ఉండకుండా, ఒప్పందాలు, చట్టాలు, న్యాయాలు ఉంటాయి. ఇవే కనుక లేకపోతే, రిలయన్స్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, లేక మరో పెద్ద పెద్ద పేరు ఉన్న సంస్థలు, ఎప్పుడో, ఎదో ఒక పార్టీకి బలి అయిపోయేవి. మన దేశం, ఎప్పుడో నాశనం అయ్యేది. సహజంగా అభివృద్ధి చెందే కంపెనీలు, నాలుగు ఉద్యోగులు వచ్చే కంపెనీలు ప్రభుత్వాలు వాడులుకోవు. ఈ కాలంలో ఒక కంపనీ పెట్టుబడి పెట్టాలంటే ఎంతో కష్టపడి, రాయతీలు ఇస్తే కానీ రాని పరిస్థితి. అలాంటిది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కంపనీలు రావటం చూసి ఏడాది అయ్యింది. అయితే ఇప్పటికే ఉన్న కంపెనీలను కూడా బయటకు పంపించే చర్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన, అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ కు గతంలో ఇచ్చిన కొంత భూమిని వెనక్కు తీసుకుంటూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గతంలో రాజశేఖర్ రెడ్డి హయంలో 483 ఎకరాలు ఇవ్వగా, అందులోని 253 ఎకరాలు ఇప్పుడు జగన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది.
అయితే దీని పై అమర్‌రాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్, హైకోర్టుకు వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూములు వెనక్కు తీసుకునే అధికారం లేదని అన్నారు. ఆ భూములు తమకు, ఏపీఐఐసీకి మధ్య జరిగిన ఒప్పందం అని, దీంట్లో ఏపి ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. అలాగే ఇప్పటికే అక్కడ 2700 కోట్ల పనులు చేపట్టామని, 6 వేల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం భూములు వెనక్కు తీసుకుంటూ చెప్తున్న కారణంలో వాస్తవం లేదని అన్నారు. అందుకే జీవోని సస్పెండ్ చెయ్యాలని కోరారు. ఈ కేసు పై ఈ రోజు విచారణ చేసిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 30న ఇచ్చిన 33వ జీవోని నిలుపుదల చేస్తూ, హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వానికి ప్రస్తుతానికి, ఆ భూములు వెనక్కు తీసుకునే అవకాశం లేకుండా పోయింది.