రెండు రోజుల క్రితం, మన రాష్ట్రం నుంచి మంత్రి బాలినేని స్టిక్కర్ ఉన్న కారులో, 5 కోట్లు తరలిస్తూ ఉండగా, తమిళనాడు సరిహద్దులో తమిళనాడు పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇవి ఒంగోలులని ఒక వైసిపీ నాయాకుడువి అని, అవి బంగారం కొనటానికి వెళ్తున్నాం అని చెప్తున్నారు. అయితే 5 కోట్లు క్యాష్ అలా తీసుకువెళ్ళి, ఏది కొనుగోలు చెయ్యకుడదు అనే నిబంధన ఉండటంతో, అవన్నీ కట్టుకధలే అని అర్ధం అవుతుంది. మరో పక్క ఈ వ్యవహారంలో తమిళనాడు మీడియా మొదటి నుంచి బాలినేని పేరు ప్రస్తావిస్తూ వస్తుంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు, మంత్రి బాలినేనిని టార్గెట్ చేసాయి. ఈ క్రమంలోనే, తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కార్యకర్తని టార్గెట్ చేస్తూ వైసిపీ చేస్తున్న అరాచకం పై చంద్రబాబు ఒక సంచలన వీడియో పోస్ట్ చేసారు. నన్ను చంపేస్తున్నారు కాపాడండి, అంటూ ఒక యువకుడు సేల్ఫీ వీడియో అది. వద్దేల సందీప్ అనే వ్యక్తీ సోషల్ మీడియాలో, ఈ విషయం పై బాలినేనిని, ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో అతన్ని ఒంగోలు పోలీసులు స్టేషన్ కు తీసుకు వచ్చి హింసిస్తున్నారు.

చంద్రబాబు పోస్ట్ చేసిన వీడియోలో, ఆ యువకుడి మాటలు "బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో షేర్ చేసానని, పోలీసులు నిన్న మధ్యాన్నం ఒంటి గంటకు తీసుకు వచ్చి, చేతులు అన్నీ వాచిపోయేలా కొట్టారు. మన పార్టీ వాళ్ళ పేర్లు చెప్పాలి అంటూ, దౌర్జన్యంగా కొడుతున్నారు అన్నా. మధ్యాన్నం కొట్టారు. మళ్ళీ రాత్రికి కొడతాం అంటున్నారు. కొంత మంది పేర్లు చెప్పమంటున్నారు. లేకపోతె చంపేస్తాం, రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అని బెదిరిస్తున్నారు. ఒక వైసిపీ నాయకుడు వచ్చి వెళ్ళిన తరువాత, పైకి తీసుకువచ్చి, ముగ్గురు కానిస్టేబుల్ లు, సిఐ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కాలికి ఆపరేషన్ అయ్యింది, కొట్టొద్దు అని దండం పెట్టినా, ఆపరేషన్ అయిన చోట, కావాలని మళ్ళీ కొట్టారు. కాళ్ళు, చేతులు అన్నీ నొప్పులు పుడుతున్నాయి అన్నా. మీరు కాపాడాలి అన్నా. ఇక్కడ ఉంటే ఎదో ఒకటి చేస్తారు అన్న. ప్లీజ్ మీరే కాపాడాలి" అంటూ ఆ యువకడు ఆవేదనతో మాట్లాడిన మాటలు చంద్రబాబు ట్వీట్ చేసి, ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.

ఎన్ని అవమానాలు పడినా రాజధాని రైతులు, 213 రోజులుగా, అమరావతి ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే జగన్ ప్రభుత్వం వారిని పట్టించుకోవటం లేదు. మూడు ముక్కల రాజధాని పై ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. వీలు అయినంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తీ చేసేందుకు ప్లాన్లు వేస్తుంది. సిఆర్డీఏ రద్దు బిల్లుతో పాటుగా, వికేంద్రీకరణ బిల్లుని, రేపు స్పీకర్ తమ్మినేని సీతారం, గవర్నర్ వద్దకు పంపనున్నట్టు సమాచారం. ఈ బిల్లులు గవర్నర్ ఆమోదించిన తరువాత, రాష్ట్రపతి అనుమతి కోసం కూడా, ఈ బిల్లులు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర పరిధిలోని బిల్లులకు అయితే గవర్నర్ ఆమోదం సరిపోతుంది కానీ, కేంద్ర చట్టాలతో ముడి పడిన చట్టం కావటంతో, ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుందని సమాచారం. మరి ఇప్పుడు గవర్నర్ ఏమి చేస్తారు ? కోర్టు పరిధిలో ఉన్న అంశం పై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. రెండు బిల్లుల పై , శాసనమండలిలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ సభ ఆదేశాలు ఇచ్చినా, ప్రభుత్వం మాత్రం సెక్రటరీ ద్వారా, అది జరగకుండా చూసుకుంది.

అయితే దీని తరువాత, మండలిని రద్దు చేస్తూ, జగన్ నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేసే ఏ వ్యవస్థ ఉండకుడదని ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే ఇది పెండింగ్ లో ఉండగానే, మళ్ళీ ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, శాసనమండలికి మళ్ళీ పంపించారు. అయితే అక్కడ ఈ బిల్లుల పై ఎటువంటి చర్చ జరగకుండానే, సభ నిరవధికంగా వాయిదా పడింది. అయితే, మండలిలో బిల్లులు చర్చించకపోయినా, బిల్లు పై వ్యతిరేకంగా తెలిపినా, నెల రోజుల తరువాత, బిల్లు ఆమోదించుకోవచ్చు. ఈ నిబంధన ప్రకారం, ఇప్పుడు ఈ బిల్లులను రేపు గవర్నర్ వద్దకు పంపుతున్నారు. అయితే, ఈ అంశం ఇప్పటికే హైకోర్ట్ లో వివాదం నడుస్తుంది. ప్రభుత్వం కూడా బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉందని చెప్పింది. అయితే, హైకోర్ట్ లో ఉన్నా ఇబ్బంది లేదు అంటూ, ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. మరి గవర్నర్ ఏమి చేస్తారు ? గవర్నర్ ఆమోదిస్తే, రాష్ట్రపతి ఏమి చేస్తారు అనేది చూడాలి. న్యాయస్థానంలో ఉన్న అంశం పై, గవర్నర్, రాష్ట్రపతి జోక్యం చేసుకుంటారా ? చూద్దాం...

జగన్ పాలనలో దళితులంతా ద్వితీయ శ్రేణి పౌరుల్లా బతకాల్సిన దుస్థితి దాపురించిందని, ఉన్నతస్థానాల్లో ఉన్న దళితులకే న్యాయం జరగకపోతే, ఇక సామాన్యులైన దళితబిడ్డల పరిస్థితి ఏమిటని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య వాపోయారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భారతదేశ పౌరులుందరికీ సమానహక్కులు కల్పించిన, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చే రచింపబడిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతున్నదా అని అనుమానం కలుగుతోందన్నారు. దురదృష్టవశాత్తూ సస్పెన్షన్ లో ఉన్న ఒక దళిత మేజిస్ట్రేట్ అయిన రామకృష్ణ అనే వ్యక్తిపై, సరిహద్దు గొడవలకు సంబంధించిన కొందరు వ్యక్తులు అకారణంగా దాడిచేశారని, ఆయన స్థలంలోని ఇటుకలను తీసుకెళ్లారని, దాన్ని అడ్డుకోబోయిన దళితవర్గానికి చెందిన వ్యక్తిపై అమానుషంగా ఇటుకలు, ఇనుపరాడ్లతో దాడిచేయడం జరిగిందన్నారు. ప్రజల డబ్బుని జీతంగా తీసుకునే సదరు పోలీస్ అధికారి తక్షణమే మేజిస్ట్రేట్ నుంచి కేసు తీసుకొని, ఆయనపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేయకుండా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడమేంటని రామయ్య నిలదీశారు. జగన్ పాలనలో ఏపీ పోలీస్ మాన్యువల్ సక్రమంగా అమలవదా.. భారత రాజ్యాంగం అమలు కాదా అని వర్ల ప్రశ్నించారు.

మేజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న దళితుడికే న్యాయం జరగకపోతే, ఇక సామాన్య దళితులు, చెప్పులుకుట్టేవారు, పొలం పనిచేసే వారికి ఏం న్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. మొన్న డాక్టర్ సుధాకర్, నిన్నడాక్టర్ అనితారాణి, నేడు మేజిస్ట్రేట్ రామకృష్ణల పరిస్థితి చూస్తుంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి చులకనగా చూస్తున్నారని అర్థమవుతోందన్నారు. మేజిస్ట్రేట్ రామకృష్ణ కడపజిల్లాలో పనిచేస్తున్నప్పుడు, అక్కడ అదనపు న్యాయమూర్తిగా పవన్ కుమార్ రెడ్డి పనిచేసేవారని, ఆయన మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్ పర్సన్ అయిన నాగార్జున రెడ్డికి సొంత తమ్ముడేనని రామయ్య చెప్పారు. సదరు పవన్ కుమార్ రెడ్డి వద్ద పనిచేసే రామానుజం అని వ్యక్తిని పిలిచి, తెల్లకాగితాలపై సంతకం చేయాలని, తాను చెప్పినవిధంగా చేయని నేరం ఒప్పుకోవాలని ఆదేశించగా, ఆ రామానుజం తిరస్కరించడం జరిగిందన్నారు. తాను చెప్పింది వినలేదన్న అక్కసుతో సదరు రామానుజాన్ని పవన్ కుమార్ రెడ్డే, కొట్టించి, కిరోసిన్ పోసి తగులబెట్టబోతుంటే, అతను పారిపోయి ఆసుపత్రిలో చేరాడన్నారు. రామానుజం చనిపోతూ, తనచావుకి కారణం పవన్ కుమార్ రెడ్డేనని మరణ వాంగ్మూలం ఇవ్వడం జరిగిందని, ఆ వాంగ్మూలాన్ని రామకృష్ణ నమోదు చేయడం జరిగిందన్నారు. 30-11-2012న అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న నాగార్జున రెడ్డి, రామకృష్ణకు ఫోన్ చేసి, మరణవాంగ్మూలం నుంచి తన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి పేరు తొలిగించాలని కోరడం, దాన్ని రామకృష్ణ తిరస్కరించడం జరిగాయన్నారు.

13-02-2012న నాగార్జున రెడ్డి హైకోర్టు జడ్జిహోదాలో రాయచోటి వచ్చి, రామకృష్ణకు రమ్మని చెప్పడం జరిగిందన్నారు. రామకృష్ణ అక్కడకు వెళ్లగానే, నాగార్జునరెడ్డి, ఆయన తమ్ముడైన పవన్ కుమార్ రెడ్డి, రామకృష్ణపై పడి బూటుకాళ్లతో తంతూ, కులంపేరుతో దూషిస్తూ, నానా మాటలు అంటూ, దారుణాతి దారుణంగా ప్రవర్తించడం జరిగిందని వర్ల రామయ్య తెలిపారు. నాగార్జున రెడ్డి ఆనాడు మేజిస్ట్రేట్ రామకృష్ణను ఉద్దేశించి వాడిన బూతుమాట విన్నవారెవరైనా సరే, ఆత్మాభిమానంతో, పౌరుషంతో తనను తిట్టిన వారి పీకకోయడమో.. లేక తన పీక తాను కోసుకోవడమో జరిగి ఉండేదన్నారు. అంతటితో ఆగకుండా రామకృష్ణపై కక్ష పెంచుకున్న నాగార్జున రెడ్డి, ఆయన్ని దూరంగా చింతపల్లి ఏరియాకు బదిలీ చేయించడం జరిగిందన్నారు. తరువాత రామకృష్ణపై లేనిపోని తప్పుడు ఫిర్యాదులు మోపి, చివరకు ఆయన్ని సస్పెండ్ చేయించడం జరిగిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి సిద్ధమైన రామకృష్ణ, ‍హైకోర్టులో ఫిర్యాదు చేస్తే, అక్కడున్న కొందరు పెద్దలు నాగార్జున రెడ్డితో నీకెందుకు వెళ్లమని చెప్పి నీరు గార్చడం జరిగిందన్నారు. మరింత పట్టుదలతో ముందుకెళ్లిన రామకృష్ణ, నాగార్జున రెడ్డికి తగిన విధంగా శిక్ష పడేలా చేయాలన్న తలంపుతో పార్లమెంట్ ను ఆశ్రయించి, డిసెంబర్ 5-2016న నాగార్జున రెడ్డిపై 54మంది ఎంపీల సంతకాలతో ఇంపీచ్ మెంట్ పిటిషన్ వచ్చేలా చేయడం జరిగిందన్నారు. హైకోర్టు జడ్జిగా ఉన్న నాగార్జున రెడ్డి, దళితులపై ఈ విధంగా వ్యవహరించారని, ఆర్టికల్ 217, రెడ్ విత్ 124 ప్రకారం ఇంపీచ్ మెంట్ పిటిషన్ వేయడమైందన్నారు.

ఆ పిటిషన్ అమల్లో ఉండగానే, తన వర్గానికి చెందిన కొందరి సాయంతో రామకృష్ణను సస్సెండ్ చేయించడం జరిగిందని, తరువాత 2018లో నాగార్జునరెడ్డి రిటైరయ్యారని, ఆ తరువాత జగన్ ప్రభుత్వం సదరు నాగార్జునరెడ్డికి కేబినెట్ హోదా కల్పించి, ఏపీ ఈ ఆర్ సీ కమిషన్ చైర్ పర్సన్ గా నియమించడం జరిగిందన్నారు. నాగార్జున రెడ్డిలో ఏమి నచ్చి జగన్ ఆయనకు పదవి కట్టబెట్టాడో సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. ఒక దళితుడి ఆత్మఘోషను ఎవరూ పట్టించుకోరు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. చేయరాని తప్పుచేసిన నాగార్జున రెడ్డికి ముఖ్యమంత్రి ఉన్నత పదవులు కట్టబెట్టడం ఏమిటని రామయ్య నిలదీశారు. తప్పుచేసిన వారిని ముఖ్యమంత్రి అమితంగా ప్రేమిస్తారు అనడానికి ఇంతకంటే రుజువు ఏముంటుందన్నారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా రాజ్యాంగంపై గౌరవం, చిత్తశుద్ధి ఉంటే, ఇప్పటికైనా తన పొరబాటు గ్రహించి, నాగార్జున రెడ్డిని తక్షణమే ఏపీ ఈ ఆర్ సీ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించాలన్నారు. ఇంతటి దురాగతానికి పాల్పడిన నాగార్జున రెడ్డి నిజంగా సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రాష్ట్రంలోని దళితజాతి మొత్తం ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేంగా ఉద్యమించకముందే, జగన్ ప్రభుత్వం నాగార్జున రెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటు, మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడిచేసిన వారిని కాపాడిన మంత్రి పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. రామకృష్ణ నుంచి ఫిర్యాదుతీసుకోకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరించిన ఎస్సైని కూడా ఉద్యోగం నుంచి తీసేయాలని వర్ల డిమాండ్ చేశారు. ఎన్నిచట్టాలు, శాసనాలు చేసినా పాలకుల్లో వాటిని అమలుచేయాలన్న చిత్తశుధ్ధి లేకపోతే, అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అనడానికి జగన్ ప్రభుత్వ విధానాలే నిదర్శనమని రామయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న ఆకృత్యాలు, అమానుషాలను తెలుగుదేశంపార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తమ మాట వినకపోవటం పై, హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కొన్ని విషయాల్లో, హైకోర్టు చెప్పినా వినకపోవటంతో, హైకోర్ట్ అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వ తీరు మాత్రం మారటం లేదు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మళ్ళీ రాష్ట్రానికి ఎదురు దెబ్బ తగిలింది. తనను ఎన్నికల కమీషనర్ గా నియమించమని ఆదేశాలు ఇచ్చినా, ప్రభుత్వం తన నియామకానికి అడ్డుపడుతుంది అంటూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. దీని పై ఈ రోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా, హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరుపు న్యాయవాది వాదిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసిందని, మూడు సార్లు సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని, హైకోర్టు దృష్టికి తీసుకోచ్చారు. సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోతే, హైకోర్టు ఆదేశాలు ఫైనల్ అవుతాయని, కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనతో, హైకోర్టు కూడా ఏకీభవించింది.

ఈ సందర్భంగా, హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వెంటనే గవర్నర్ ను కలిసి, తనను అపాయింట్ చెయ్యల్సిందిగా, అడగాలి అంటూ, రాష్ట్ర హైకోర్ట్ ఆదేశాలు జరీ చేసింది. అదే విధంగా సుప్రీం కోర్టులో మూడు సార్లు స్టే రాకపోవటంతో, నిమ్మగడ్డకు ఏ ఉత్తర్వులు తాము ఇచ్చామో, ఆ ఉతర్వులు అమలులో ఉన్నట్టు, భావించాలి అంటూ, కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు ప్రతిని గవర్నర్ కు అందించి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నియామక పత్రం ఇవ్వాలని కోర్టు తెలిపింది. వచ్చే శుక్రవారానికి ఈ కేసు వాయిదా వేసిన కోర్టు, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశించింది. ఈ సందర్భంగా, నిమ్మగడ్డ, రెండు మూడు రోజుల్లో, ఆయన గవర్నర్ ని కలిసే అవకాసం ఉంది. వచ్చే వారానికి వాయిదా ఉండటంతో, రాష్ట్ర గవర్నర్ ఎలా స్పందించారు అనే విషయం కోర్టు దృష్టికి తెలిపే అవకాసం ఉంది. మరో పక్క ఇప్పటికే నిమ్మగడ్డ, 15 రోజులు క్రితం గవర్నర్ కు లేఖ రాసినా, గవర్నర్ వైపు నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. మరి కోర్టు తీర్పు దృష్టిలో పెట్టుకుని, గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read