మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు పై, చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. "తెలుగుదేశంతోనే అచ్చెన్నాయుడి గారి కుటుంబ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 38 ఏళ్లలో అంచెలంచెలుగా వెనుకబడ్డ వర్గానికి నాయకుడిగా ఆయన ఎదిగారు. అటువంటి నాయకుడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయం, బాధాకరం. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో 300 మంది పోలీసులతో అచ్చెన్నాయుడి ఇంటి మోహరించారు. సర్జరీ చేయించుకున్న వ్యక్తిని కనీసం మందులు కూడా తీసుకోనివ్వకుండా ఎత్తుకొచ్చారు. కుటుంబ సభ్యులకు కనీస తెలుపకుండా ఇంట్లోంచి బలవంతంగా ఆయనను తీసుకువచ్చారు. ఆయన ఏమన్నా టెర్రరిస్టా..? ఒక ప్రజాప్రతినిధి పట్ల ఇలాగేనా వ్యవహరించేది. కనీసం మాస్కులు కూడా ధరించకుండా.. బలవంతంగా అచ్చెన్నాయుడు ఇంట్లోకి ప్రవేశించారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని రోజంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడో తిప్పారు. వైకాపా కక్ష సాధింపు చర్యలకు అంతులేదా..? ఆయన చేసిన నేరమేమిటి..? ఎంక్వైరీకి పిలిస్తే అచ్చెన్నాయుడు ఏమన్నా రానన్నారా..? విజిలెన్స్ రిపోర్టులో ఎక్కడా అచ్చెన్నాయుడి పేరు లేదు. పైగా అచ్చెన్నాయుడి ఇంటికి వెళ్లిన తర్వాత చేతివ్రాతతో అరెస్ట్ వారెంట్ ను ఇచ్చారు. " అని చంద్రబాబు అన్నారు.
ఇది ట్రైల్ మాత్రమే, లోకేష్, చంద్రబాబు సంగతి కూడా చూస్తాం అని వైసీపీ బెదిరిస్తుంది అని అడగగా, చంద్రబాబు స్పందిస్తూ., "ఏడాది నుంచి చూస్తున్నాం. ట్రయల్ మీకు చూపించాలి. మేం అన్ని చట్టపరంగా చేశాం. వైసీపీ పూర్తిగా బురదలో కూరుకుపోయింది. ఆ బురదను మాకు పూయాలనుకుంటున్నారు. మేం ఎవరికీ భయపడం. హైకోర్టు వాతలు పెట్టినా సిగ్గురాలేదు. రాజ్యాంగం ప్రకారం అందరం నడుచుకోవాలి. నోటీసులు ఇచ్చి.. ఏం నేరం చేశారో చెప్పాలి కదా. ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలి కదా. విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా తప్పుబట్టలేదు. ఆయన వైసీపీకి కొరకరాని కొయ్యలా ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరు. మేము 5ఏళ్లు నీతివంతమైన పాలన ఇచ్చాం. వైసీపీ ఏడాదిలోనే 50 ఏళ్ల అవినీతికి పాల్పడింది. కడపలో ఎస్సీ మహిళను జుట్టు పట్టుకుని లాగి, చెప్పుతో కొట్టారు. దానిపై ఎస్సీ మంత్రులు ఎందుకు మాట్లాడరు..? ఆ దారుణాలపై మేం మాట్లాడకూడదా..? 11 కేసులు, 43 వేల కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డాడు. నేడు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక, మైనింగ్, ల్యాండ్, ఇరిగేషన్, లిక్కర్ లో ఏం జరుగుతోంది. మీరా అవినీతిపరులు, మేమా. చట్టప్రకారం వెళ్లాలి. నోటీసులు ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేస్తారా, కాగతం పై రాసిస్తారా. తెలవారు జామున పోతారా. ఆయనేమైనా పారిపోతారా. భార్యకు చెప్పరా. బెడ్ రూం లో ఉంటేఎత్తుకుని వస్తారా. కుమారుడు ఉన్నాడు. మనోభావాలు దెబ్బతినవా. పశువుల కంటే హీనంగా చూస్తారా? మందులు తీసుకోనివ్వరా. కనికరం లేదా" అంటూ చంద్రబాబు వైసిపి పాలనపై ధ్వజమెత్తారు.