కరోనా లాక్ డౌన్లో 80 రోజులు నిర్మానుష్యంగా మారిన ఏడుకొండలు సోమవారం శ్రీవారి దర్శనాలు ఆరంభం కావడంతో మళ్లీ గోవిందనామం ప్రతిధ్వనించింది. తిరుమల తిరువతి దేవస్థానంలో వనిచేస్తున్న ఉద్యోగులు తొలిదర్శనం పొంది ఆనందం వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటిస్తూ, 300రూపాయలు ప్రత్యేక ప్రవేశదర్శనాల క్యూలైన్ల నుంచి ఆలయంలోనికి చేరుకున్నారు. శ్రీవారి దర్శన ప్రయో గాత్మక పరిశీలనలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి ఉద్యోగులను అనుమతించడంతో తొలి రెండు గంటల్లోనే 1200 మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని దర్శించుకున్నారు. ఆలయంలోపల బంగారు వాకిలి నుంచి రెండు క్యూలైన్ విధానాలు అమలు చేసి, పరిమితం చేయడంతో ఒక్కో భక్తుడు సామాజిక దూరంలో 20-30 సెకండ్లు సమయం శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకునే భాగ్యం కలిగింది. ఎక్కడా ఎవరినీ తాకకుండా ఆలయంలో కూడా భక్తులు ముందుకు కదిలారు. మంగళవారం కూడా టిటిడి ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దర్శనం కల్పించనున్నారు.
మూడవ రోజు బుధవారం తిరుమలలోని స్థానిక భక్తులకు వెంకన్న దర్శనాన్ని కల్పిస్తున్నారు. మూడు రోజుల ప్రయో గాత్మక దర్శనాలు ముగియగానే క్యూలైన్లలో ఏవేమి మార్పులు తీసుకోవాల్సి ఉన్నా తదనుగుణం గా చేపడతారు. ఆ తరువాత 11వ తేదీ గురువారం ఉదయం 7.30గంటల నుంచి సామాన్య భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్లు, ఆన్లైన్ టిక్కెట్లు ద్వారా దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తొలిరోజు ఉదయం 8గంటలకు మొదలైన దర్శ నాలు రాత్రి 7.30గంటల వరకు నిరంతరా యంగా సాగింది. ఇప్పటికి వున్న లాక్ డౌన్ వరి స్థితుల దృష్ట్యా 10ఏళ్ళలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్ళ పైబడిన వృద్ధులను పూర్తిగా దర్శనాలకు దూరంగా ఉంచారు.
మొదటి రోజు, సోమవారం 6 వేల మంది శ్రీవారని దర్శించుకోగా, 25.7 లక్షలు స్వామి వారికి హుండీ ఆదాయం వచ్చింది. సహజంగా రోజుకు 60 వేల మంది శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ లాక్ డౌన్ కారణంగా, కేవలం 6 వేల మంది మాత్రమే దర్శించుకున్నారు. 11వతేదీ నుంచి విఐపిలకు ఉదయం గంట పాటు దర్శన భాగ్యం కల్పించిన విషయం విదితమే. ఈ మేరకు విఐపిలు స్వయంగా తిరుమలకు చేరుకుంటేనే శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది. లేకుంటే సిఫార్సు లేఖలను ఈ నెలాఖరు వరకు స్వీకరించే అవకాశం కనిపించడంలేదు. రానున్న రెండు రోజుల తరువాత భక్తులకు ఇదే విధానంలో దర్శనం కల్పించేలా చూడనున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో 3వేల టిక్కెట్లు, తిరుపతి ఆర్టీసి బస్టాండు, అలిపిరి ప్రాంతాల్లోని కౌంటర్లలో మరో 3వేల టిక్కెట్లు కరెంట్ బుకింగ్ లో టైమ్ స్లాట్ కేటాయిస్తారు. భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే తిరుమలకు చేరుకుని నేరుగా క్యూలైన్లో ప్రవేశించేలా టిటిడి కార్యాచరణ సిద్ధం చేసింది.