పెడన క్వారంటైన్ లో ఉన్న కరోనా అనుమానితుడు గుండెపోటుతో మృతి చెందారు. మచిలీపట్నంలో కరోనా పాజిటీవ్ తో మృతి చెందిన వ్యక్తికి ఈయన బంధువుగా తెలుస్తుంది. గత నాలుగు రోజులుగా పెడన క్వారంటైన్ లో ఉన్న మృతుడు తోట రాజా, గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన రాజాను, హుటాహుటిన 108 అంబులెన్స్ లో విజయవాడకు తరలించారు. అయితే, మార్గమధ్యలో మృతి చెందిరు రాజ. కరోనా రిపోర్ట్ రాకపోవటంతో ఉదయం నుండి మృతదేహాన్ని అధికారులు, కుటుంబ సభ్యులకు అందించలేదు. అయితే చివరకు, రిపోర్ట్ నెగిటీవ్ రావటంతో మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉదయం నుండి రాజా మరణంపై నగర వాసుల్లో ఉత్కంఠత కొనసాగింది. చివరకు నెగిటీవ్ రిపోర్ట్ తో ఊపిరి పీల్చుకున్న అధికారులు, నగర వాసులు. అయితే, ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, విషయం తెలుసుకున్న, స్థానిక తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి, కొల్లు రవీంద్ర, అసలు క్యారంటైం సెంటర్ లో , ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో చూడటానికి బయలు దేరారు.

దీంతో, పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కి పోలీసులకి వాగ్వాదం జరిగింది. పెడన లొ ఉన్న క్యారంటైం కి వెళ్ళనీయకుండా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ని పోలీసులు అడ్డుకుంటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్లు రవీంద్ర , కొంచెం సేపు ప్రతిఘటీంచారు. పెడన కోర టైన్ ని పరిశీలించడానికి వెళ్తున్న వాహనాలను పోలిసులు అడ్డుకోవడంతో కొల్లు రవీంద్ర కి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కారును సీజ్ చేసిన పోలీసు అధికారులు లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి క్వారంటైన్ సందర్శనకు వెళుతున్న కొల్లు రవీంద్రని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కొల్లు రవీంద్రకు చిన్నపాటి వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి . ఐపీసీ సెక్షన్ 188 మరియు ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1987 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు తెలిపారు.

అలాగే కోల్లు రవీంద్రను, పోలీస్ జీప్ ఎక్కించి, తరువాత, విడిచి పెట్టరు. ఆయన కారును సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటన పై మాట్లాడిన రవీంద్ర, జరిగిన విషయాన్ని చెప్పారు. క్వారంటీన్ లో ఉన్న వ్యక్తి గుండె నొప్పి వచ్చి చనిపోవటం, అతని సోదరుడు కరోనా పాజిటీవ్ తో మృతి చెందటంతో, క్వారంతీన్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో చూడటానికి వెళ్లామని, అయినా పోలీసులు ఆపి, కేసులు పెట్టారని అన్నారు. ఒక పక్క వైసీపీ నేతలు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా, మీటింగ్లు పెడుతున్నా, మందలు మందలుగా పోగేసి, హడావిడి చేస్తున్నా, పోలీసులు పట్టించుకోకుండా, మేము ఒంటరిగా వెళ్తున్నా అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. నిన్న కూడా టిడిపి ఎమ్మల్యే సైకిల్ పై కలెక్టర్ వద్దకు వెళ్తుంటే, పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకు వెళ్ళిన సంగతి తెలిసిందే.

విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్లే.. ఆర్టీజీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ప్రభుత్వానికి సూచించారు. అన్న క్యాంటిన్లు, చంద్రన్న బీమాలు పునరుద్ధరించాలని... పంటలకు మద్దతు ధర, ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు...సీఎం జగన్ కు లేఖ రాశారు. "1)విశాఖ మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యత గుర్తించడం ముదావహం: దేశంలోనే తొలి మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీ పార్క్ గా విశాఖపట్నంలో నెలకొల్పిన మెడ్ టెక్ జోన్ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం ముదావహం. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, ముందుచూపు ఆలోచనలే ప్రస్తుత మెడ్ టెక్ జోన్ పనితీరుకు నిదర్శనాలు. ప్రస్తుత సంక్షోభంలో 55నిముషాల్లోనే కరోనా నిర్ధారణ చేసేలా టెస్టింగ్ కిట్ల తయారీకి విశాఖ మెడ్ టెక్ జోన్ వేదిక కావడం శుభపరిణామం. రోజుకు 2వేల కిట్ల తయారీ సామర్ధ్యం ఈ నెలాఖరుకు 25వేల కిట్ల తయారీకి, మే నెలాఖరుకు ఏడున్నర లక్షల కిట్ల తయారీకి చేరుకోవడం ప్రస్తుత కరోనా కారుచీకట్లో నిజంగా కాంతిరేఖలే. 3వేలకు పైగా వెంటిలేటర్లు, వైద్య సిబ్బందికి కావాల్సిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్ (పిపిఈ) మన మెడ్ టెక్ జోన్ లో యుద్దప్రాతిపదికన తయారీ చేయడం ముదావహం. ఈ 10నెలలు దానిని నిర్లక్ష్యం చేయకుండా, మరింత అభివృద్ది చేసినట్లయితే ప్రస్తుత కరోనా సంక్షోభంలో దేశానికే మరింత మెరుగైన సేవలు అందించే స్థాయిలో ఉండేది. మరిన్ని కంపెనీలు మెడ్ టెక్ జోన్ కు రావడమే కాకుండా, దేశానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్ మెంట్ అందుబాటులోకి వచ్చేది. గత ప్రభుత్వంపై అక్కసుతో, పదేపదే అవాస్తవ ఆరోపణలతో, ఎంక్వైరీల పేరుతో తొలి ఏడాది విలువైన కాలాన్ని వృధా చేశారు. మయసభగా మెడ్ టెక్ జోన్ ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు దేశానికే గర్వకారణంగా చెప్పడం ఆనంద దాయకం. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఏడాది ఆలస్యంగా అయినా మెడ్ టెక్ జోన్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం సంతోషకరం.

2) మెడ్ టెక్ జోన్ తరహాలోనే ఈ వ్యవస్థలను(అన్నా కేంటిన్లు, చంద్రన్న బీమా, ఆర్టీజిఎస్)కూడా పునరుద్దరించాలని, బలోపేతం చేయాలని విజ్ఞప్తి: ఎ) అన్నా కేంటిన్ల పునరుద్దరణతో పేదలకెంతో మేలు: అన్నా కేంటిన్లను కూడా పునరుద్దరించే ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. రెక్కాడితే గాని డొక్కాడని లక్షలాది రోజు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదల ఆకలిదీర్చే అన్నా కేంటిన్లను రాజకీయ కక్షతో మూసివేయడం తగనిపని. అన్నా కేంటిన్లే గనక ఉండి ఉన్నట్లయితే ఇప్పుడీ కరోనా సంక్షోభంలో పేదలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేవనేది ప్రజల్లో నెలకొన్న విస్తృతాభిప్రాయం. కేరళలో పీపుల్ కేంటిన్లు, కర్ణాటకలో ఇందిరా కేంటిన్లు, హైదరాబాద్ లో అన్నపూర్ణ కేంటిన్ల విజయగాథల స్పూర్తితో అయినా మన రాష్ట్రంలో అన్నా కేంటిన్లను తక్షణమే పునరుద్దరించాలని కోరుతున్నాం.

బి)‘‘బీమా పథకం’’ ఉంటే కరోనా మృతుల కుటుంబాలకు ఆదరవు అయ్యేది: కరోనా మహమ్మారి బారిన పడి, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అనారోగ్యంతో అల్లాడుతున్నారు, వేలాది ప్రజలు బలి అయ్యారు. అనేక కుటుంబాలు అనాధలుగా మారాయి. మనదేశంలో, రాష్ట్రంలోనూ కరోనా విధ్వంసం విస్తృతరూపం దాల్చింది. ఈ పరిస్థితుల్లో ‘‘బీమా పథకం’’ రద్దు చేయకుండా కొనసాగించివుంటే, ఆయా కుటుంబాలకు ఎంతగానో అక్కరకు వచ్చేది. ప్రత్యామ్నాయంగా కొత్తపథకం తేకుండానే రాష్ట్రంలో ‘‘చంద్రన్న బీమా’’ పథకాన్ని అర్ధంతరంగా రద్దు చేయడం అనాలోచిత చర్య. ఇప్పుడదే పథకం ఉండివుంటే, కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు, భవిష్యత్ పై ఎంతో భరోసాగా ఉండేది. కాబట్టి తక్షణమే ‘‘బీమా పథకాన్ని’’ పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నాము. సి)ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ‘‘ఆర్టీజి’’ ఎంతో ఉపయోగకరం: అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గాడితప్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి)కి నూతన జవసత్వాలు కల్పించి మళ్లీ సమర్ధంగా నిర్వహించాలి. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే ఆర్టీజి వల్ల గత ప్రభుత్వంలో ఎన్నో సత్ఫలితాలు సాధించాం. తిత్లి తుపాన్ విపత్తులో, ఇతర సంక్షోభ సమయాల్లో ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరవేసేందుకు, ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సకాలంలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఆర్టీజి ఎంతగానో దోహదపడింది. ప్రస్తుత కరోనా సంక్షోభంలో కూడా ఆర్టీజిని మరింత సమర్ధంగా వినియోగించుకుని వుంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అంతరం ఉండేది కాదు. కాబట్టి రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజి) వ్యవస్థను వెంటనే పునరుద్దరించాలి, మరింత బలోపేతం చేయాలని సూచిస్తున్నాం.

3)మద్దతు ధర చెల్లించి పంట ఉత్పత్తులన్నీ కొని రైతులను ఆదుకోవాలి: కరోనా లాక్ డౌన్ కారణంగా కూలీలు దొరకక, లారీలు లేక, రవాణా స్థంభించి కనీస మద్దతుధర లభించక రాష్ట్రంలో ధాన్యం రైతులు, పత్తి, మిర్చి, హార్టీకల్చర్, ఆక్వా రైతాంగం, ఫౌల్ట్రీ, సెరికల్చర్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి ఆయా రంగాల రైతులను ఆదుకోవాలి. 4) ప్రతి పేద కుటుంబానికి రూ 5వేల ఆర్ధిక సాయం అందించాలి: లాక్ డౌన్ తో పనులు కోల్పోయి జీవనం దుర్భరంగా మారిన రైతు కూలీలు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, ఇతర చేతివృత్తులవారు, ఎస్సీ,ఎస్టీ వర్గాల వారికి తక్షణమే, కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాలి. 5) వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం, విధ్వంసం సులభం: వ్యక్తి కన్నా వ్యవస్థ గొప్పది. వ్యవస్థల నిర్మాణం చాలా కష్టం, వాటి విధ్వంసం చాలా సులభం. వ్యక్తి చేయలేని పనిని ఒక వ్యవస్థ ద్వారా చేయవచ్చు. మరింత మెరుగ్గా, సమర్ధంగా ప్రజలకు సేవలు అందించవచ్చు. దప్పిక అయినప్పుడే బావిని తవ్వాలనే ధోరణి విజ్ఞత కాదు. నిర్మాణం చేసేవాళ్లనే ప్రజలు పదికాలాలు గుర్తుంచుకుంటారు. విధ్వంసం చేసేవాళ్లు చరిత్రగతిలో తెరమరుగు అవుతారు. వీటన్నింటిని గుర్తుంచుకుని ఇకనైనా రాష్ట్రంలో విధ్వంసాలకు స్వస్తి చెప్పి వ్యవస్థల నిర్మాణంపై, వాటి బలోపేతంపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము. నిర్మాణ దృక్ఫథంతో, భవిష్యత్ తరాలకు సరైన దిశా నిర్దేశం చేయడమే పాలనాధర్మంగా తెలియజేస్తున్నాను." అంటూ చంద్రబాబు లేఖ రాసారు...

ఒక పక్క ఎస్మా ప్రయోగిస్తాం అని ప్రభుత్వం బెదిరిస్తున్నా, మేము కేసులు కైనా సిద్ధమే, ప్రాణాలు ముఖ్యం అంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే మాస్కులు అడిగినందుకు, ఒక డాక్టర్ ను, ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు, అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు, తమ విధులు బహిష్కరించినిరసన వ్యక్తం చేశారు. తమకు ఎన్ 95 మాస్కులు, పీపీఈ కిట్స్ ఇవ్వాలని, అవి లేకుంటే వైద్యం చేయలేమని అంటున్నారు. అయితే వీరి డిమాండ్ల పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే, కనీస సౌకర్యాలు లేని కారణంగా కరోనా విధుల్లో పాల్గొనలేమని తమకు మినహాయింపునివ్వాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంఈవోకు వినతిపత్రం సమర్పించారు. కరోనా కట్టడికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తమకు సౌకర్యాల కల్పిచంకపోవటం విచారకరమన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తుంటే... ప్రభుత్వం కనీసం శానిటైజర్లు కూడా ఇవ్వకపోవటం దారుణమన్నారు. పైగా రాత్రి వేళల్లో డ్యూటీలు వేస్తున్నారని మండిపడ్డారు.

అనంతపురం జూనియర్ డాక్టర్లు భయపడటానికి కారణం, నిన్న జరిగిన సంఘటన. అనంతపురం జిల్లాలో లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడికి తొలుత కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఆ ఆతర్వాత మక్కా వెళ్లి వచ్చిన హిందూపురానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడిలో వ్యాధి లక్షణాలు కనిపించగానే... స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురానికి మార్చారు. అయితే అప్పటికే వృద్ధుడికి ఆస్తమా ఉన్నందున క్షయవ్యాధి వార్డుకు పంపించి...సాధారణ రోగులతోపాటు చికిత్స చేస్తూ వచ్చారు. వ్యాధి తీవ్రత పెరగటంతో ఈ నెల 4న వృద్ధుడు మృతి చెందాడు. ఆ తర్వాత నమూనాలు తీయించి వైరాలజీ ల్యాబ్‌కు పంపగా...కరోనా వ్యాధితోనే చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో క్షయవ్యాధి వార్డులో వైద్యం అందించిన వైద్యులు, నర్సులు, స్వీపర్లు...మొత్తంగా 24 మందిని క్వారెంటైన్‌కు పంపారు. వారిలో ఇద్దరు వైద్యులు, ఇద్దరు నర్సులకు వైరస్‌ సోకినట్లు బుధవారం తేలింది.

ఈ నెల 4వ తేదీన మృతి చెందిన హిందూపురానికి చెందిన వృద్ధుడు... అప్పటిదాకా చికిత్స పొందిన క్షయవ్యాధి వార్డులో వైద్యం చేయించుకున్న కల్యాణదుర్గానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు తర్వాత చనిపోయాడు. వైద్యం అందించిన బృందాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్న అధికారులు... వారిని మాత్రమే క్వారెంటైన్‌కు పంపించారు. వారి కుటుంబీకులు, స్నేహితులు, వీరితో కలిసిన ఇతరుల గురించి ఆలోచించలేదు. వైరస్ సోకిన హౌస్‌ సర్జన్‌తోపాటు 40 మంది కలిసి ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరందర్నీ పరీక్షిస్తే తప్ప ఎవరెవరు వైరస్ బాధితులో తెలిసే అవకాశం లేదు. అలాగే సిబ్బంది కుటుంబీకులు, సన్నిహితులపైనా దృష్టి పెట్టాలనే అభిప్రాయం ఆసుపత్రి వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కరోనా కట్టడిలో భాగంగా రాజకీయ నాయకులు లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లాలో చోడవరంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సామాజిక దూరం పాటించలేదని ఆరోపిస్తూ రాష్ట్ర హై కోర్టుకు న్యాయవాది లేఖను రాసారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాముహిక సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం శ్రేయస్కరం అనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలను రాజకీయ నాయకులు గౌరవించాలని. వైరస్ వ్యాప్తి జరుగ కుండా భౌతిక దూరం పాటించాలని తన ఆదేశాల్లో ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు తెలియ జేయాలని రాష్ట్ర ప్రభుత్వా నికి జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

మరో పక్క, రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్‌ ద్వారా స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పేదలకు మాస్కులు, శానిటైజర్లు సహా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తనిఖీ చేశారు. స్థానికంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును పరిశీలించారు. వివిధ సేవాసంస్థలు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్స్, కూరగాయలు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా కేసుల నమోదును పరిగణనలోకి తీసుకుని.. కృష్ణాజిల్లాలో ఐదు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించామని తెలిపారు.

కడపజిల్లా రైల్వేకోడూరు సమీపంలో ప్రభుత్వ విప్‌ శ్రీనివాసులు పర్యటించారు. శాంతినగర్, రంగనాయకులపేట వీధుల్లో వైకాపా నేతలతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారులతో మాట్లాడారు. రైల్వేకోడూరు పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలని క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు వీధివీధి తిరిగి బ్లీచింగ్ పౌడర్‌ను పిచికారీ చేశారు. కర్నూలులో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని వీధుల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్రిమి సంహారక మందును పిచికారీ చేస్తున్నారు. విశాఖలోని రెడ్‌జోన్‌ ప్రాంతంగా ప్రకటించిన అక్కయ్యపాలెంలో పూర్తి లాక్‌డౌన్ కోసం పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతం నుంచి ఎక్కువ కేసులు నమోదు కావటంతో పూర్తిగా దిగ్బంధనం చేయాలని నిర్ణయించారు.

Advertisements

Latest Articles

Most Read